లోక్‌సభ ఎన్నికల ప్రచారం పశ్చిమ యూపీలోని సహారన్‌పూర్ స్థానం నుంచే ప్రారంభించాలని పాలకపక్షమైన బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీ కూటమి నిర్ణయించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. మొదటి దశలో పోలింగ్ జరిగే ఈ సీటును 2014లో బీజేపీ కైవసం చేసుకుంది. మూడోవంతుకు పైగా ముస్లింలు ఉన్న సహారన్‌పూర్‌లో కాంగ్రెస్, బీఎస్పీ ముస్లిం అభ్యర్థులను నిలిపాయి. కిందటిసారి జరిగినట్టే బీజేపీ ప్రత్యర్థుల మధ్య మైనారిటీల ఓట్లు చీలితే ప్రస్తుత బీజేపీ ఎంపీ రాఘవ్ లఖన్‌పాల్ మళ్లీ గెలవవచ్చు. యూపీ బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సహారన్‌పూర్ జిల్లాలోని శాకాంబరి ఆలయం నుంచి ప్రారంభించారు. బీఎస్పీ–ఎస్పీ కూటమి కూడా తమ తొలి సంయుక్త ర్యాలీని ఈనెల 7న ఈ జిల్లాలోని దేవబంద్‌లో నిర్వహించబోతోంది. దేవబంద్‌లో అతిపెద్ద ముస్లిం అధ్యయన పీఠం ఉంది. ప్రతిపక్షాలు దేవబంద్‌ను తొలి ర్యాలీకి ఎంపిక చేయడం వాటి ఆలోచనలు, పోకడలకు అద్దం పడుతోందని ఆదిత్యనాథ్ విమర్శించారు. శాకాంబరి గుడికి 40 కిలోమీటర్ల దూరంలో దేవబంద్ ఉంది. 2017లో కూడా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సహారన్‌పూర్ నుంచే పరివర్తన్ యాత్ర ప్రారంభించారు.
ఇమ్రాన్ మసూద్‌కే మళ్లీ కాంగ్రెస్ టికెట్
కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌ను బీజేపీ అభ్యర్థి లఖన్‌పాల్ 65 వేల మెజారిటీతో ఓడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీపై మసూద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ముక్కలు ముక్కలుగా కోస్తానని అన్నందుకు మసూద్‌తో కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పించింది. కాని, ఇప్పుడు మసూద్‌నే కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించారు. బీజేపీపై బీఎస్పీ తరఫున పోటీచేస్తున్న ఫజ్లూర్ రహ్మాన్‌ను బలమైన అభ్యర్థిగా పరిగణిస్తున్నారు. మాంసం వ్యాపారి అయిన రహ్మాన్‌కు ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. నియోజకవర్గంలో 42 శాతం ఉన్న ముస్లిం ఓట్లు కాంగ్రెస్, బీఎస్పీ మధ్య చీలిపోతే బీజేపీ గెలిచే అవకాశముంది. బీజేపీ అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో మైనారిటీలు వ్యూహాత్మకంగా బలమైన ముస్లిం అభ్యర్థికే ఓటేస్తే ర హ్మాన్‌కు ప్రయోజనకరమౌతుంది. ఇక్కడ బీఎస్పీకే గట్టి పునాది ఉంది.
బంధువు వల్లే ఓటమి
కిందటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ఓటమికి కారణం ఆయను సమీప బంధువు రషీద్ మసూద్ కొడుకు షాదాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై పోటీచేసి ఓట్లు చీల్చుకోవడమే. ఇమ్రాన్ 2007 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ నెల మొదట్లో భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్‌తో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమావేశమౌతున్నారు. దీని వల్ల ఇమ్రాన్ విజయావకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు. భీమ్ ఆర్మీ సహారన్‌పూర్ కేంద్రంగానే అవతరించి పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో దళిత యువకులను ఆకట్టుకుంది. ఈ నెల 11న పోలింగ్ జరిగే ఈ నియోకవర్గంలో బీహత్, సహారన్‌పూర్, సహారన్‌పూర్ దేహాత్, రామ్‌పూర్ మణిహరన్, దేవబంద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment