24 గంటల్లో హీరో నుంచి జీరోకి
ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో దిగిన ఇమ్రాన్ మసూద్ కథ సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో ఊహించని మలుపు తిరిగింది. ఆవేశపూరిత ప్రసంగాలు, కత్తికో కండగా ముక్కలు ముక్కలుగా నరుకుతానన్న ప్రగల్భాలు శుక్రవారం ఆయన్ని ముస్లిం ఓటర్లలో హీరోగా నిలబెట్టి ఉండొచ్చు. కానీ శనివారం సూర్యుడు నిద్రలేచే సరికి ఆయన పై కేసు పెట్టారు. కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయనను రిమాండ్ కి పంపించారు.
హడావిడిగా ఎన్నికల ప్రచారం చేయాల్సిన ఇమ్రాన్ మసూద్ ఇప్పుడు తాపీగా ఊచలు లెక్కబెట్టుకుంటున్నారు. ఇంకా విషాదం ఏమిటంటే ఆయనకు అనుకూలంగా ఒక్కరూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇలాంటి వారిని పార్టీలో ఉంచకూడదు అన్నారు. రాహుల్ గాంధీ ఈ భాషను ఎట్టిపరిస్థితిలోనూ సమర్థించలేమని అన్నారు. రాహుల్ గాంధీ అయితే సహారన్ పూర్ లో శనివారం బహిరంగ సభనే రద్దు చేసుకున్నారు.
దీంతో కాంగ్రెసీయులు మసూద్ ను పూర్తిగా వదిలేశారు.
ఎన్నికల వేళ ఇలాంటి కామెంట్లు నరేంద్ర మోడీకి లాభం చేకూరుస్తాయన్నది కాంగ్రెస్ అధిష్ఠానానికి బాగా తెలుసు. గతంలో మోడీని సోనియా గాంధీ 'మౌత్ కా సౌదాగర్' అని విమర్శించింది. మోడీ దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయఢంకా మోగించాడు. అందుకే కాంగ్రెస్ మసూద్ ను ఏ మాత్రమూ వెనకేసుకురావడానికి ప్రయత్నించలేదు.