పేర్లు కాదు డబ్బు తేవటం ముఖ్యం | Ram Jethmalani vents anger in SC over government 'inaction' on blackmoney | Sakshi
Sakshi News home page

పేర్లు కాదు డబ్బు తేవటం ముఖ్యం

Published Wed, Jan 21 2015 12:55 PM | Last Updated on Wed, Apr 3 2019 5:14 PM

పేర్లు కాదు డబ్బు తేవటం ముఖ్యం - Sakshi

పేర్లు కాదు డబ్బు తేవటం ముఖ్యం

 న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ఖాతాలు కలిగివున్న వారి పేర్లను బహిర్గతం చేయడంకన్నా.. విదేశాల్లో దాచేసిన నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారి పేర్లను వెల్లడించాలని కోరుతూ న్యాయవాదులు రామ్‌జెఠ్మలానీ, ప్రశాంత్‌భూషణ్‌లు వేసిన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు స్పష్టంచేసింది.

 

అంతకుముందు విచారణ సందర్భంగా జెఠ్మలాని తరఫు న్యాయవాది అనిల్‌దివాన్ వాదనలు వినిపిస్తూ గత ఆరు నెలల్లో ఒక్క రూపాయి కూడా ఈ దేశానికి తిరిగిరాలేదని.. కేవలం కొన్ని సోదాలు, అటాచ్‌మెంటులు మాత్రమే జరిగాయని విమర్శించారు. అటార్నీ జనరల్ ముకుల్ రహ్తొగీ వాదిస్తూ.. జెనీవా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన ఆదాయ పన్ను అంచనాలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయటం జరుగుతుందన్నారు.
 
 భూషణ్ తరఫు న్యాయవాది దివాన్ వాదిస్తూ.. ఆయా ఖాతాదారుల పేర్లను ప్రచురిస్తే.. విదేశాల్లో నల్లధనం దాచుకుని, దానిని మాదకద్రవ్యాలు, ఉగ్రవాదం, మనుషుల అక్రమ రవాణాల్లోకి మళ్లించిన వారికి అది హెచ్చరికగా పనిచేస్తుంద్కన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఖాతాదారుల పేర్లను బహిర్గతపరచాలని తాము ఆదేశాలు ఇవ్వబోమని, నల్లధనాన్ని వెనక్కు తేవటం ఇక్కడ ముఖ్యాంశమని పేర్కొంది. నల్లధనం అంశంపై ఫ్రెంచ్ ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు, ఇతరత్రా సమాచారం  సిట్‌కు సమర్పించామని, వాటిని పిటిషనర్లకు అందించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆ దర్యాప్తు బృందమేనని పేర్కొన్న కేంద్రం వైఖరిపై పిటిషనర్లు స్పందనను సమర్పించేందుకు కోర్టు 3 వారాల సమయం ఇచ్చింది.
 
 రెండు వారాల్లోగా సమర్పించండి...  
 నల్లధనాన్ని వెనక్కు తెచ్చేందుకు తాము చేసిన వివిధ సూచనలను  సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిగణనలోకి తీసుకోవాలని జెఠ్మలానీ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ కేసుకు సంబంధించిన వారందరూ తమ సూచనలను మంగళవారం నుంచి రెండు వారాల్లోగా సిట్ దృష్టికి తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నామంది.  
 
 చట్టం చేస్తారో లేదో చెప్పాలి: జెఠ్మలానీ
 ఈ తీర్పు ప్రకటించిన తర్వాత.. ప్రభుత్వం ఆరు నెలలుగా నల్లధనంపై ఎటువంటి చర్యలూ చేపట్టలేదంటూ జెఠ్మలానీ కోర్టులోనే తన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేను నా డబ్బును వెనక్కు ఇవ్వాలని ఇక్కడికి రాలేదు. దేశానికి చెందిన డబ్బును వెనక్కు తేవాలని కోరుతూ వచ్చాను. చట్టం లేకుండా ఏమీ జరగదు. ఒక ముసాయిదా తయారు చేయాలని సిట్ నాకు చెప్పింది. నేను ముసాయిదాను సిట్‌కు, ప్రధానికి పంపించాను. ఆయన ఆర్థిక శాఖకు పంపారంతే.  కానీ.. ప్రధాని నుంచి నాకు ఎలాంటి సమాచారమూ రాలేదు. అసలు చట్టం చేయాలనుకుంటున్నారో లేదో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆ చట్టంలో ఈ ముసాయిదా భాగంగా ఉంటుందో లేదో చెప్పాలి. లేదంటే నేను బహిరంగంగా గొంతెత్తాల్సి ఉంటుంది. సలహా ఇవ్వటం తప్ప నేను ఏం చేయగలను? మీరు ఆ సలహాను అంగీకరించకపోతే నేను ఈ దేశ సార్వభౌమ ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని అన్నారు.  
 
 15 లక్షల పరిమితి పెట్టండి: సిట్
 న్యూఢిల్లీ: ఒక వ్యక్తి లేదా సంస్థ రూ.15 లక్షలకు మించి నగదును దగ్గర ఉంచుకోవడానికి వీల్లేకుండా పరిమితిని విధించాలని సిట్ సుప్రీంకోర్టుకు సూచించింది. నగదును పోగేయడం కూడా నల్లధనం పెరిగిపోవడానికి కారణమని పేర్కొంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement