అక్బర్‌పై మరో ‘మీ టూ’ | Journalist Pallavi Gogoi accuses MJ Akbar of molestation her 23 years ago | Sakshi
Sakshi News home page

అక్బర్‌పై మరో ‘మీ టూ’

Published Sat, Nov 3 2018 4:23 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Journalist Pallavi Gogoi accuses MJ Akbar of molestation her 23 years ago - Sakshi

పల్లవి గొగోయ్‌ ,ఎంజే అక్బర్‌

వాషింగ్టన్‌: ప్రముఖ సంపాదకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌(67) లైంగిక వేధింపులపై మరో బాధితురాలు గళం విప్పారు. 23 ఏళ్ల క్రితం తనపై ఆయన అత్యాచారం చేశారంటూ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ ‘నేషనల్‌ పబ్లిక్‌ రేడియో’ చీఫ్‌ బిజినెస్‌ ఎడిటర్‌ పల్లవి గొగోయ్‌ ఆరోపించారు. ఒక వార్తా పత్రిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న ఆ ‘తెలివైన పాత్రికేయుడు’ హోదాను వాడుకుని తనను వలలో వేసుకున్నారంటూ ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’లో ఆమె రాసిన వ్యాసం ఇటీవల ప్రచురితమైంది.

ఏషియన్‌ ఏజ్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా అక్బర్‌ పనిచేస్తున్న సమయంలో తనపై లైంగికదాడికి, వేధింపులకు పాల్పడ్డారంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌కు రాసిన వ్యాసంలో పల్లవి గొగోయ్‌ ఆరోపించారు. జీవితంలో అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలని అందులో పేర్కొన్నారు. ‘22 ఏళ్ల వయస్సులో ‘ఏషియన్‌ ఏజ్‌’లో చేరా. ఆ సమయంలో అక్బర్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉండేవారు. ఏడాదిలోనే ఒపీనియన్‌ ఎడిటోరియల్‌ పేజీకి ఎడిటర్‌గా అక్బర్‌ నేతృత్వంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన దగ్గర పనిచేయడం అద్భుతంగా అనిపించేది. ఆయన వాగ్ధాటి చూసి మైమరిచిపోయేదాన్ని. అయితే, నాకెంతో ఇష్టమైన ఆ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అందుకు తగ్గ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది.  



ఉద్యోగం నుంచి తీసేస్తా..
1994 వేసవిలో ఒక రోజు ఒపీనియన్‌ ఎడిటోరియల్‌ పేజీకి నేను రాసిన అద్భుతమైన శీర్షికను చూపిద్దామని అక్బర్‌ ఆఫీసుకు వెళ్లా. నా ప్రతిభను మెచ్చుకుంటూనే ఆయన అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నారు. నేను వెంటనే వెనుదిరిగి బయటకు వచ్చేశా. ఆందోళనకు, అయోమయానికి గురయ్యా’. అక్బర్‌ మరోసారి ఆఫీసు పనిపై ముంబై తాజ్‌ హోటల్‌ రూంకు పిలిపించుకుని, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారు. నేను విడిపించుకుని ఏడ్చుకుంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా నా ముఖంపై గోళ్లతో రక్కారు’ అని పల్లవి ఆ వ్యాసంలో వివరించారు. మరోసారి ఇలా అడ్డుకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించారని తెలిపారు.  ‘ఓ సారి అసైన్‌మెంట్‌ నిమిత్తం జైపూర్‌కు వెళ్లా.

అప్పటికే అక్కడ ఓ హోటల్‌లో ఉన్న అక్బర్‌ ఆ కథనంపై చర్చించేందుకు రూంకు రమ్మన్నారు. అక్కడే నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. నేనెంత ప్రతిఘటించినా ఆయన బలం ముందు నిలవలేకపోయా. ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేకపోయా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చెప్పినా నమ్మరని తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ఆయన నాపై మరింత అధికారం చెలాయించ సాగారు. ఆయన చూస్తుండగా నేను తోటి పురుష ఉద్యోగులతో మాట్లాడినా సహించేవారు కాదు’ అని పేర్కొన్నారు. నాపై అలా ఎందుకు పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇచ్చానన్నదే నాకు అర్థం కాలేదు. బహుశా ఉద్యోగం పోతుందని భయపడి ఉంటా. నన్ను నేనే అసహ్యించుకుంటూ కుమిలిపోసాగా’.  

బ్రిటన్, యూఎస్‌ పంపిస్తా..
1994 డిసెంబర్‌లో ఎన్నికల కవరేజీపై అక్బర్‌ నన్ను మెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా అమెరికా కానీ, బ్రిటన్‌ కానీ పంపిస్తానన్నారు. ఆ విధంగానైనా వేధింపులు లేకుండా దూరంగా ఉండొచ్చని ఆశించా. కానీ, ఢిల్లీకి దూరంగా ఉండే అలాంటి చోట్లకు ఎప్పుడనుకుంటే అప్పుడు రావచ్చు. నాతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చన్నది ఆయన వ్యూహమని నేను ఊహించలేదు. లండన్‌లోని పత్రిక ఆఫీసులో ఓ సహోద్యోగితో మాట్లాడుతుండగా గమనించిన అక్బర్‌..తిడుతూ నాపై చేయిచేసుకున్నారు. ఓ కత్తెరతోపాటు టేబుల్‌పై ఉన్న వస్తువులని నాపై విసిరేశారు. వాటి నుంచి కాపాడుకునేందుకు పార్కింగ్‌ప్లేస్‌కు పారిపోయా. ఈ ఘటనతో శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నా. ఈ ఘటన తర్వాత అక్బర్‌ నన్ను తిరిగి ముంబైకి పిలిపించారు. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి న్యూయార్క్‌లోని ‘డౌజోన్స్‌’ పత్రికలో చేరాను’

ప్రతిభతో ఎదిగా..
‘ఇప్పుడు నేను యూఎస్‌ పౌరురాలిని. ఒక భార్యగా, తల్లిగా ఉంటూ నా పాత్రికేయ వృత్తిని ఆనందంగా కొనసాగిస్తున్నా. ముక్కలైన నా జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నా. నా ప్రతిభ, కష్టంతో డౌజోన్స్, బిజినెస్‌ వీక్, యూఎస్‌ఏ టుడే, అసోసియేటెడ్‌ ప్రెస్, సీఎన్‌ఎన్‌ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశా. ప్రస్తుతం నేషనల్‌ పబ్లిక్‌ రేడియోలో అత్యున్నత హోదాలో ఉన్నా. మీటూలో పలువురు మహిళలు చేసిన ఆరోపణలను నిరాధారాలంటూ అక్బర్‌ ఖండించడం, ఒక మహిళపై పరువు నష్టం కేసు వేయడం నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అప్పట్లో ఆయన మా శరీరాలపై అధికారం చెలాయించినట్లుగానే, ప్రస్తుతం ’నిజం’ అనే దానికి తనదైన శైలిలో భాష్యం చెప్పాలని చూస్తున్నారు.

తీవ్రంగా పరిగణిస్తున్నాం:ఎడిటర్స్‌ గిల్డ్‌
ఎడిటర్స్‌ గిల్డ్‌ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సభ్యుడు కూడా అయిన ఎంజే అక్బర్‌పై తాజాగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో ఆయన సభ్యత్వాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపింది.

పరస్పర అంగీకారంతోనే: అక్బర్‌
పల్లవి గొగోయ్‌ ఆరోపణలపై అక్బర్‌ స్పందించారు. ‘అప్పట్లో ఆమెతో లైంగిక సంబంధం పరస్పర అంగీకారంతోనే కొన్ని నెలలపాటు కొనసాగింది. ఆ సంబంధం నా కుటుంబ జీవితంలోనూ కలతలకు కారణమైంది. ఇద్దరి అంగీకారంతోనే ఈ సంబంధం ముగిసింది’ అని పేర్కొన్నారు. అక్బర్‌ భార్య మల్లిక కూడా పల్లవి ఆరోపణలను ఖండించారు. ఇరవయ్యేళ్ల క్రితం పల్లవి గొగోయ్‌ మా కుటుంబంలో అపనమ్మకానికి, అసంతృప్తులకు కారణమయ్యారు. అప్పట్లో ఆమె నా భర్తతో నెరిపిన సంబంధం గురించి నాకు తెలుసు. నా భర్తకు అర్ధరాత్రిళ్లు ఆమె ఫోన్‌ చేసేవారు. నా సమక్షంలోనే అక్బర్‌తో సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పుడు ఆమె అబద్ధం ఎందుకు చెబుతోందో తెలియదు. అబద్ధం ఎప్పటికీ అబద్ధమే’ అని ఆప్రకటనలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement