న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత పి. రంగరాజన్ కుమారమంగళం భార్య కిట్టి కుమారమంగళం హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో గల తన నివాసంలో మంగళవారం రాత్రి ఆమెను చంపేశారు. కుమారమంగళం ఇంట్లో ధోబీగా(చాకలి) పనిచేస్తున్న రాజు అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలు.. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో నిందితుడు రాజు కిట్టి కుమారమంగళం ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ మోగడంతో పనిమనిషి తలుపు తీయగా.. వెంటనే ఆమెపై మత్తుమందు చల్లి ఓ గదిలో పడేశాడు.
అదే సమయంలో, మరో ఇద్దరు యువకులు కిట్టి కుమారమంగళం గదిలోకి వెళ్లి.. ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ముగ్గురూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో... స్పృహ కోల్పోయిన రెండు గంటల తర్వాత మెలకువలోకి వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేయగా.. వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కిట్టి కుమారమంగళం చనిపోయినట్లు గుర్తించారు.
పనిమనిషి చెప్పిన వివరాల ఆధారంగా.. ధోబి రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇక కిట్టి కుమారమంగళంలోని విలువైన వస్తువులు, డబ్బు దొంగతనం చేసే క్రమంలో వారు హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాగా దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో(1998-2001) పి. రంగరాజన్ కుమారమంగళం కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment