అందరివాడు | Former union minister and BJP troubleshooter Arun Jaitley passes away | Sakshi
Sakshi News home page

అందరివాడు

Published Sun, Aug 25 2019 3:25 AM | Last Updated on Sun, Aug 25 2019 10:24 AM

Former union minister and BJP troubleshooter Arun Jaitley passes away  - Sakshi

రాజకీయాల్లో అందరి మనసులూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్‌ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ జనతా పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలు సేవలందించిన అరుణ్‌ జైట్లీ... తన వాక్చాతుర్యంతో, అపార ప్రతిభాపాటవాలతో అందరి మనసులూ చూరగొన్నారు. ఒక న్యాయవాదిగా పార్టీలకతీతంగా ఎవరి తరఫునైనా వాదించే విలక్షణత్వం, ప్రత్యర్థుల్ని విమర్శించడంలో కనబరిచే హేతుబద్ధత ఇవన్నీ జైట్లీకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. అందుకే ప్రధానిగా ఎవరున్నా బీజేపీలో అరుణ్‌జైట్లీ స్థానం ప్రత్యేకమే. అందుకే కావచ్చు! కాంగ్రెస్‌లోనూ ఆయనకు వీరాభిమానులున్నారు.  

వాదనలో పదునెక్కువ  
గోధ్రా మతఘర్షణల్లో మోదీ తరపున, సొహ్రాబుద్దీన్, ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసుల్లో కూడా జైట్లీ వాదించారు. సోనియా, రాహుల్‌ నిందితులుగా ఉన్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసు, చిదంబరం ఇరుక్కకున్న కేసులు, ఇంకా ఎన్నో ప్రత్యేక కేసుల్లో అవి తప్పా, ఒప్పా అన్నది పక్కన పెడితే కోర్టుల్లో ఆయన వాదనా పటిమకు ప్రత్యర్థులు కూడా ముగ్ధులయ్యేవారు. ప్రఖ్యాత లాయర్‌ రామ్‌జెఠ్మలానీ వంటి వారి ప్రశంసలు అందుకున్నారు.  

తెరవెనుక వ్యూహకర్త  
జైట్లీ మంచి వ్యూహకర్త. అమిత్‌ షా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందు ఎక్కడ ఎన్నికలు జరిగినా జైట్లీ పేరే వినిపించేది. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా డజనుకిపైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించారు. గోధ్రా ఘర్షణల సమయంలో గుజరాత్‌ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న జైట్లీ.. మోదీకి అత్యంత అండగా నిలిచి ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక జైట్లీ కృషి కూడా ఉంది. ఆ ఎన్నికల వ్యూహకర్తల్లో జైట్లీ కూడా ఒకరు.

ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నిక కాలేదు...  
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అరుణ్‌ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్‌సభకు ఎన్నిక కాలేదు. అమృత్‌సర్‌ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్‌ అభ్యర్థి అమరీందర్‌ సింగ్‌ను ఎదుర్కోలేక ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకుంది. పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సైతం జైట్లీ కొనసాగారు.    

మోదీకి ప్రధాన మద్దతుదారు 
వాజపేయి హయాంలోనే జైట్లీ అత్యంత కీలకమైన శాఖల్ని నిర్వహించారు. న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలపై తనదైన ముద్రవేశారు. మోదీ ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో బీజేపీలో దిగ్గజ నాయకులు కొందరు వ్యతిరేకించి అడ్వాణీ వెంట నడిచారు. కానీ జైట్లీ అలా కాదు. గుజరాత్‌ సీఎంగా మోదీ నియామకం సమయంలో... గోద్రా ఘర్షణల సమయంలోనూ మోదీ వెంటే ఉన్నారు. ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. మోదీ ఆర్థిక నిర్ణయాలకు అండగా ఉండి ప్రత్యర్థుల నోరు మూయించారు. సోషల్‌ మీడియా అందుబాటులోకి  వచ్చాక ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తర్వాత అనారోగ్య కారణాలతో మీడియా ముందుకు రాకపోయినా సొంతగా బ్లాగు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ పోస్టులు పెట్టేవారు. మోదీ సర్కార్‌లో ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందారు.

2016లో పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో..

క్రికెట్‌ అంటే ప్రాణం
న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా అనూహ్యమైన విజయాలు సాధించిన అరుణ్‌ జైట్లీకి క్రికెట్‌ అంటే ప్రాణం. చిన్నతనంలో క్రికెట్‌ బాగా ఆడేవారు. బీజేపీలో చేరాక బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగారు. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ క్రికెట్‌ అధ్యక్షుడిగా పదమూడేళ్లపాటు ఉన్న జైట్లీ రాజధానిలో క్రికెట్‌ స్టేడియం నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కృషి చేశారు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌లో జైట్లీ అవకతవకలకి పాల్పడ్డారని ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణు చేయడంతో ఆయనను కోర్టుకు లాగారు. జైట్లీ వాదనా పటిమతో ఆఖరికి కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.  
   –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement