
ఎకో ఫ్రెండ్లీ అంత్యక్రియలకు బ్రిటిషర్ల మొగ్గు
ముందుగానే శవపేటికల ఎంపిక
చనిపోకముందే సమాధులు కట్టించుకోవడం గురించి విన్నాం. పిల్లల్లేని వారు, పోయాక ఎవరూ పట్టించుకురని భావించేవారు ముందుచూపుతో అలా చేస్తుంటారు. ఈ ధోరణి బ్రిటన్‌లోనూ ఉంది. కాకపోతే అందులోనూ పర్యావరణ హితానికి వాళ్లు పెద్దపీట వేస్తుండటం విశేషం. యూకే వాసులు తమ అంత్యక్రియల కోసం ఎకో ఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు.
యూకేలో అంత్యక్రియల్లో 80 శాతం దాకా ఖననాలే ఉంటాయి. అందుకు వాడే శవపేటికలు హానికర రసాయనాలతో తయారవుతున్నాయి. పైగా వాటిలో మృతదేహాల నిల్వకు వాడే ఫార్మాల్డిహైడ్ పర్యావరణానికి హానికారకమే. అది నేరుగా మట్టిలో కలుస్తుంది. కార్బన్ కన్సల్టెన్సీ సంస్థ ప్లానెట్ మార్క్ అధ్యయనం ప్రకారం ఒక్కో శవపేటిక నుంచి ఏకంగా లండన్–పారిస్ విమానం వదిలే కర్బన ఉద్గారాలకు సమానమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. శవపేటికను ఆరడుగుల లోతున పాతేస్తారు. ఇది మట్టిలో కలవడానికి వందేళ్లు పడుతోందట.
కళాకృతి నుంచి వ్యాపారం వైపు
బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తరువాత పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధానంపై బ్రిటన్‌వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఎకోఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ‘ఎకో ఫ్రెండ్లీ’ అంత్యక్రియలను కోరుకుంటున్నట్లు ఇటీవల యూగవ్ నిర్వహించిన కో–ఆప్ ఫ్యునరల్ కేర్ సర్వేలో తేలింది. స్వతహాగా కళాకారిణి అయిన వెస్ట్ యార్క్‌షైర్‌లోని హెబ్డెన్ బ్రిడ్జికి చెందిన రేచల్ చావు, దుఃఖం, ప్రకృతి ఇతివృత్తంతో క్రియేటివ్‌గా శవపేటికను చేశారు. దాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. స్నేహితుడికోసం ఊలు, చెట్ల ఆకులు, నార, ఇతర పదార్థాలతో పర్యావరణహితమైన శవపేటికను తయారు చేయడంతో అది ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది.
యూకే అంతటా వ్యాపారం..
ఈ ఎకోఫ్రెండ్లీ శవపేటికలను కేవలం మూడు అడుగుల లోతులో మాత్రమే పాతేస్తారు. అయినా.. భూమి పైపొరల్లో ఉండే క్రిముల వల్ల, శవపేటికల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో శరీరాలు కుళ్లిపోవడానికి 20 నుంచి 30 ఏళ్లు మాత్రమే పడుతుందట. అందుకే మరణానంతరమూ తమవల్ల భూమి కాలుష్యం కాకూడదనుకుంటున్న వ్యక్తులు వీటిని ఎంచుకుంటున్నారు. రేచల్ 2016లో ప్రారంభించిన ఈ వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు యూకే అంతటా ఈ ఎకో ఫ్రెండ్లీ స్మశాన వాటికలున్నాయి. భూమికి మేలు చేయాలనుకునేవారు తమను సంప్రదిస్తున్నారని రేచల్ చెప్పారు. ఇతర పర్యావరణ అనుకూల పరిశ్రమల మాదిరిగా, సహజ సమాధులకు ఎక్కువ ఖర్చు అవుతుంది.
‘‘ఈ భూమ్మీద నా చివరి చర్య కాలుష్య కారకమైనదిగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. జీవితమంతా పర్యావరణహితంగా జీవించిన తాను.. మరణం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్న’’ అని చెప్పే 50 ఏళ్ల రేచల్ సొంతంగా
శ్మశానవాటికను తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment