జవాను శవపేటికనూ వదలని 'అమ్మ'
చెన్నై: తమిళనాడులో ఏఐఏడీఎంకే మంత్రుల 'అమ్మ' భజన రోజు రోజుకు పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న నూతన వధూవరులు బాసికాలపై కూడా దర్శనమిచ్చిన 'అమ్మ' ఇప్పుడు అమరులైన జవానుల శవపేటికలను కూడా వదలలేదు. సియాచిన్‌లో మంచుతుపానులో చిక్కుకుపోయి అమరులైన జవాన్లకు మంగళవారం వారి స్వస్థలాల్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. తమిళనాడులోని మదురైలో సిపాయ్ గణేషన్ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇక్కడ కూడా తమిళనాడు సీఎం జయలలిత ఫోటో దర్శనమిచ్చింది. రాష్ట్ర మంత్రి సెల్లూరు రాజు జిల్లా కలెక్టర్ వీర రాఘవరావుతో కలిసి జవాను అంత్యక్రియల కార్యక్రమానికి వచ్చారు. రూ. 10 లక్షల చెక్ను ప్రభుత్వం తరఫున సిపాయ్ గణేషన్ తల్లికి అందజేశారు. ఆ తర్వాత జయలలిత ఫోటోను శవ పేటికపై పెట్టి ఈ సాయం అందించింది తనే అంటూ జవాను తల్లికి సైగ చేశారు. దీంతో అప్పటికే ఏడుస్తూ ఉన్న ఆవిడ ఆ ఫోటో చూసి నమస్కారం చేసింది.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాను శవపేటిక వద్ద రాజకీయాలు చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జయలలిత పేరును ఎంత వీలైత అంతగా ప్రచారంలోకి తీసుకు రావాలని ఏఐఏడడీఎంకే నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ ఫార్మసి, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఆముదం, అమ్మ అవార్డులు, అమ్మ థియేటర్. ఇలా అనేక పథకాలు ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి ప్రారంభించినవే.