‘జన’లలిత | heavy croud to Jayalalitha funeral | Sakshi
Sakshi News home page

‘జన’లలిత

Published Wed, Dec 7 2016 2:47 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

heavy croud to Jayalalitha funeral

మంగళవారం చెన్నై మెరీనా బీచ్ వద్ద జయలలిత అంతిమయాత్రకు హాజరైన జనవాహిని. (ఇన్‌సెట్‌లో) జయలలిత పార్థివదేహం
 
- లక్షలాది మందితో అంతిమయాత్ర - ’పురచ్చి తలైవీ’ నినాదాలతో హోరెత్తిన చెన్నై మహానగరం 
- 20 లక్షల మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు 
- రాష్ట్రమంతా స్వచ్ఛందంగా బంద్ పాటించిన ప్రజలు.. చెన్నై నగరం నిర్మానుష్యం 
- అభిమాన నాయికకు మిద్దెలు, మేడలపై నుంచి కన్నీటి నివాళి
- మధ్యాహ్నం నుంచి ఎంజీఆర్ ఘాట్ వద్ద వేచి ఉన్న జనం
- రాష్ట్రపతి, ప్రధాని సహా రాజకీయ, సినీ ప్రముఖుల నివాళులు
- అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
- అమ్మలేదని ఆగిన 30 గుండెలు
 
‘అమ్మా...తాయే... నీ వరువాయా...ఉలగత్తిల్ ఉన్నైపోల్ యారుమిల్‌లై తాయే...’(అమ్మా...తల్లీ నీవు మళ్లీ వస్తావా...ఈ ప్రపంచంలో నీవంటి వారు ఎవరూ లేరు తల్లీ)... అంటూ తమిళనాడు బోరుమంది. అమ్మగా తమ బాధలను గమనించి, సంక్షేమ పథకాలతో అండగా నిలిచిన అభిమాన నాయకి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తమిళ ప్రజలు శోకతప్త హృదయాలతో వీడ్కోలు పలికారు. తమిళ రాజకీయ మేరున(మ)గధీరులను మట్టి కరిపించిన ధీరవనితను కడసారి దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చిన జన సాగరం సాక్షిగా జయలలిత అంతిమయాత్ర మంగళవారం సాయంత్రం 4:15 గంటలకు రాజాజీ హాల్ నుంచి ప్రారంభమైంది. 
 
లక్షలాది మంది జనం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అనేక మంది రాజకీయ నాయకులు పాదయాత్రగా సాగి రాగా 5:40 గంటలకు మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న ఎంజీ రామచంద్రన్ సమాధి సమీపానికి చేరుకుంది. అధికారిక లాంఛనాలతో సాయంత్రం 6:40 గంటలకు అశ్రు నయనాల మధ్య ద్రవిడ సంప్రదాయాల ప్రకారం అమ్మ అంతిమ సంస్కారాలు ముగిశారుు. రాజకీయ గురువు, అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ సమాధి పక్కనే ఆమె తుది విశ్రాంతి తీసుకున్నారు. అమ్మ అంత్యక్రియలకు 20 లక్షల మందికి పైగా హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అన్నాదురై తర్వాత మరో నేత అంత్యక్రియలకు ఇన్ని లక్షల మంది జనం రావడం ఇదే మొదటిసారి. 
 
పురచ్చి తలైవి మృతికి సంతాప సూచకంగా తమిళనాడులోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డారుయి. చెన్నైలోని రాజాజీ హాల్ ఉన్న ఉత్తర భాగం ఇసుకేస్తే రాలని రీతిలో జనంతో నిండిపోయింది. రాజాజీ హాల్‌కు దారితీసే రోడ్లన్నింటినీ పోలీసులు బారికేడ్లు వేసి కిలోమీటరు దూరంలోనే పోలీసులు బంధించి వేశారు. అన్నాశాలైలో సుమారు ఐదు కిలోమీటర్ల పరిసరాల్లోని రోడ్లన్నీ వాహనాల పార్కింగ్ ప్రదేశాలుగా మారిపోయాయి. 10.30 గంటల నుండి వీవీఐపీల తాకిడి ప్రారంభం కావడంతో రాజాజీహాల్ ప్రాంగణం మరింత కిక్కిరిసి పోయింది. రాజాజీ హాల్ లోపల, బయట పలుమార్లు తొక్కిసలాట జరుగగా పోలీసులు లాఠీ చార్జి చేసి జనాన్ని అదుపు చేశారు. అమ్మా వాళ్గ (అమ్మ వర్ధిల్లాలి) అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రజలు క్యూలలో ముందుకు సాగారు. ఆమె పార్థివదేహాన్ని చూడగానే నాయకులు, ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అమ్మ కడసారి చూపుకోసం వృద్ధులు, మహిళలు సైతం కిలోమీటర్ల దూరం నడిచి వచ్చారు. దూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారికి తినేందుకు ఆహారం, తాగేందుకు  నీళ్లు కూడా దొరకలేదు. అంత్యక్రియలకు నేరుగా హాజరుకాలేని ప్రజలు అన్ని వీధుల్లోనూ అమ్మ చిత్రపటాలను పెట్టి అంజలి ఘటించారు. అనేక చోట్ల మహిళలు జయలలిత భారీ చిత్రపటం వద్ద ఒకరి చేతులను ఒకరు పట్టుకుని  (తమిళ సంప్రదాయ ‘వప్పారీ’) బిగ్గరగా రోదించారు. 
 
పుదుచ్చేరీ రాష్ట్రంలో సైతం బస్సులు, ఆటోలు తిరగలేదు. జైళ్లలోని జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. రాష్ట్రంలోని టోల్‌గేట్లలో వసూళ్లను స్వచ్ఛందంగా నిలిపివేశారు. సిటీ బస్సులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు  బస్ డిపోల్లోనే నిలిచిపోయాయి. అమ్మ మరణం తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా 30 మంది తనువు చాలించారు. చెన్నై అలందరూరు జంక్షన్‌లో బందోబస్తు విధుల్లో ఉన్న అన్బు (48) స్పృహ తప్పి కింద పడి మరణించారు. అమ్మ మరణంతో ఆవేశానికి లోనైన అభిమానులు కున్రత్తూరులో బస్సును పాక్షికంగా ధ్వంసం చేశారు.   అంత్యక్రియలను అందరూ చూసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరల్లో జయ పార్థివ దేహాన్ని చూపించినప్పుడల్లా జనాలు ’అమ్మా.. పురచ్చి తలైవీ’ అంటూ కన్నీరుపెట్టారు.
 
 ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం
 రాజాజీ హాలు నుంచి మంగళవారం సాయంత్రం 4.20కి జయలలిత అంతిమయాత్ర ప్రారంభమైంది. బంగారువన్నెను పోలిన పేటికలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివ దేహాన్ని ఉంచారు. గంధపు చెక్కలతో తయారు చేసిన ఆ పేటికపై ’పురచ్చి తలైవి శెల్వి జె.జయలలిత’ అని తమిళం, ఇంగ్లీషులో రాసి ఉంది. వివిధ రకాల పూలతో అలంకరించిన వాహనంలో జయలలిత భౌతికకాయాన్ని ఉంచారు. వెనుక ఉన్న వాహనంలో సీఎం పన్నీర్‌సెల్వం, జయనెచ్చలి శశికళ, ఆమె బంధువులు ఆసీనులయ్యారు. ఆ వాహనాల ముందు మొదటి వరుసలో మంత్రులు, వారి వెనుక తమిళనాడు పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, త్రివిద దళాలు నడిచారు. అంతిమయాత్రను పురస్కరించుకుని దారిపొడవునా అక్కడక్కడ తెరలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీ అన్నాడీఎంకే జెండాలను ఏర్పాటు చేశారు. 
 
జయలలిత అంతిమయాత్ర అన్నాశాలై, వాలాజా రోడ్డు మీదుగా చేపాక్ క్రీడామైదానం దాటుకుని స్వర్గీయ ఎంజీ రామచంద్రన్ ఘాట్‌కు చేరుకుంది. అక్కడ అంతిమ సంస్కారానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట జయలలిత పార్థివదేహాన్ని ఉంచారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పొన్‌రాధాకృష్ణన్, తమిళనాడు సీఎం పన్నీరుసెల్వం, లోక్‌సభ డిప్యుటీ స్పీకర్ తంబిదురై, తమిళనాడు స్పీకర్ ధనపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, మాజీ గవర్నర్ రోశయ్య, త్రివిద దళాలు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ అజాద్ ఒక్కొక్కరుగా నివాళులర్పించారు. అనంతరం త్రివిద దళాల ప్రతినిధులు జయ పార్థివదేహంపై కప్పి ఉన్న జాతీయపతాకాన్ని శశికళకు అప్పగించారు. అనంతరం తెలుపు, ఎరుపు రంగుల అన్నాడీఏంకే జెండాను కప్పారు. వేదపండితుల సూచనల మేరకు శశికళ, జయ మేనల్లుడు దీపక్ పార్థివ దేహం చుట్టూ చందనం ముక్కలు ఉంచారు. ఆ తరువాత జయ భౌతికకాయాన్ని చందనంతో తయారుచేసిన పేటికలో ఉంచి సాయంత్రం 6.30 గంటల సమయంలో ఖననం చేశారు. సరిగ్గా అదే సమయంలో గౌరవసూచకంగా 12 మంది భద్రతాదళాలు తుపాకులతో ఐదు రౌండ్లు గాలిలోకి పేల్చారు. అంతటితో జయలలిత అంత్యక్రియలు ముగిసారుు. జయలలిత పుట్టిన అయ్యంగార్ సంప్రదాయాల ప్రకారం దహనం చేయాల్సి ఉన్నప్పటికీ ఆమెకు సినీ, రాజకీయ జీవితాలనిచ్చిన ద్రవిడ సంప్రదాయాలను పాటిస్తూ ఖననం చేశారు.  
 
 
ఆకుపచ్చ చీరలోనే..
చెన్నై: జయలలితకు ఆకుపచ్చ రంగు అంటే ఎంతో ఇష్టం. అందుకని ఆమెకు ఇష్టమైన ఆ రంగు చీరలోనే అంతిమయాత్ర నిర్వహించారు. పోయెస్ గార్డెన్ నుంచి రాజాజీ హాల్‌కు మారిన ఆమె భౌతికకాయాన్ని ఎరుపు రంగు బోర్డరు ఉన్న ఆకుపచ్చ రంగు చీరతోనే సందర్శనార్థం ఉంచారు. ఈ సంవత్సరం మే 16న ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణస్వీకారం చేసేటప్పుడు, గతేడాది ఐదోసారి చేసేటప్పుడు కూడా ఆమె ఆకుపచ్చ చీరనే ధరించారు. అక్రమాస్తుల కేసు నుంచి బయటకు వచ్చాక గత ఎనిమిది నెలల నుంచి ఆమె ప్రజలకు కనిపించిన ప్రతీసారి ఆకుపచ్చ చీరనే ధరించారు. ఆమె ప్రమాణస్వీకారం చేసిన మద్రాసు వర్సిటీ ఆడిటోరియంను కూడా ఆకుపచ్చ రంగులోనే అలంకరించారు. అప్పటి గవర్నర్ కె. రోశయ్య ఆమెకు అందించిన పూల బొకేకు కూడా ఆకుపచ్చ కవర్లే చుట్టారు. ఆమె ఆకుపచ్చరంగు పెన్నునే ఉపయోగించేవారు. వేలికున్న ఉంగరంలో కూడా ఆకుపచ్చ రారుు ఉండేది. పార్టీ మహిళల్లో కూడా చాలామంది ఆకుపచ్చ రంగు చీరల్లో కనిపించేవారు. 
 
చెక్కుచెదరని ముఖారవిందం 
వెండితెర వేలుపుగా నాటి యువతరం కలలరాణి జయలలిత. ఆ తరువాత తిరుగులేని రాజకీయధీశాలిగా నిలబెట్టింది కూడా అదే చరిష్మా. ప్రజల హృదయాల్లో చిరస్థారుుగా నిలిచిపోయారు జయలలిత. మరణించిన తరువాత కూడా ఆమె ముఖారవిందంలో ఏమాత్రం మార్పులేదు. మరణశయ్యపై సైతం చెక్కుచెదరలేదు. దాని వెనుక దాగిన రహస్యం ఏమిటంటే.. ఎంబాల్మింగ్ ప్రక్రియ. తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు చికిత్స పొందుతూ మృతి చెందినపుడు వారి బంధువులు కోరితే ఎంబాల్మింగ్ అనే రసాయన ప్రక్రియ ద్వారా దేహాన్ని పాడవకుండా చేస్తారు. మృతి చెందినా.. మునుపటి కళ మారకుండా ఉండేందుకు ప్రయోగించే ఈ విధానాన్ని గతంలో పుట్టపర్తి సత్యసారుుబాబాకు, నేడు జయలలితకు కూడా ప్రయోగించినట్లు వైద్యవర్గాలు తెలిపారుు. అరుుతే ఇది కొంచెం ఖరీదైన వ్యవహారం కావడంతో ప్రతి ఒక్కరూ ఇందుకు మొగ్గుచూపరని తెలిపారు.  ఆకర్షణీయమైన ముఖం, మాటలతో తమిళ ప్రజలను ఆకట్టుకున్న జయలలిత.. ప్రజల మదిలో అదేరీతిలో నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఎంబాల్మింగ్ చేసినట్లు వైద్యులు అంగీకరించారు.
 
జయసంద్రం
చెన్నై అపోలో ఆసుపత్రిలో సోమవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూసిన జయలలిత పార్థివ దేహాన్ని మంగళవారం తెల్లవారు జామున 2:30 గంటలకు అంబులెన్‌‌సలో ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌‌సకు తరలించారు. ఆ సమయంలో కూడా రోడ్డు వెంట జనం బారులు తీరి అమ్మకు వీడ్కోలు పలికారు. ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం మంగళవారం ఉదయం ఆరు గంటలకు పోయెస్ గార్డెన్ నుండి జయ భౌతికకాయాన్ని నగరంలోని రాజాజీహాల్ ప్రాంగణంలో ఉంచారు. రాజాజీ హాల్, మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి లక్షలాది మంది జనం అమ్మ చివరి దర్శనం కోసం తరలి వచ్చారు. తమిళనాడు నలుచెరగుల నుంచే  కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా అమ్మ అభిమానులు లారీలు, ఇతర వాహనాల్లో  తరలి వచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,  ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు జయ భౌతిక కాయానికి నివాళులర్పించారు.  
 
జయ అంత్యక్రియలకు హరీశ్, నాయిని  
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు నారుుని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు హాజరై ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వారిద్దరూ ప్రత్యేక హెలికాప్టర్‌లో చెన్నైకి చేరుకున్నారు. మరోవైపు జయలలిత మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమ్మగా, పురచ్చి తలైవిగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అమెను కీర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. జయలలిత రాజకీయ ప్రస్థానం సాహసోపేతమైందని ముఖ్యమంత్రి కొనియాడారు. మహిళలు రాజకీయాల్లోకి రావటమే అరుదుగా ఉన్న కాలంలో రాజకీయ చైతన్యమున్న తమిళనాడులో ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షురాలిగా అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలదొక్కుకోవడమే విశేషమన్నారు. ఎంజీఆర్ వారసురాలిగా రాజకీయ రంగప్రవేశం చేసిన జయలలిత అంచెలంచెలుగా ఎదిగారని, ఆమె సారథ్యంలో పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడం తమిళ రాజకీయాల్లో గొప్ప విషయమన్నారు.
 
ప్రముఖుల సంతాపాలు..  
సాక్షి, హైదరాబాద్: జయలలిత మృతి పట్ల పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు సంతాపాన్ని ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో ఒక ధ్రువతారగా వెలుగొంది, తనదైన ముద్రతో లక్షలాది హృదయాలను గెలుచుకున్న గొప్ప వ్యక్తి జయలలిత అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.  జయలలిత అస్తమయం తమిళ రాజకీయాలకు, ప్రజలకు తీరని లోటని సంతాపాన్ని వ్యక్తంచేశారు. సీఎం పదవి చేపట్టాక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అహర్నిశలు పేదలకోసం జయలలిత పనిచేశారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివాళులర్పించారు. తమిళనాట మహిళా సీఎంగా గెలిచి, వివిధ పథకాల ద్వారా పేదలకు చేరువయ్యారని, ఆమె మరణం ఆ రాష్ట్ర ప్రజలకు తీరని లోటని సీపీఎం నేత జి.నాగయ్య పేర్కొన్నారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement