దివంగత సీఎం జయలలిత జీవితం సినిమా రంగం నుంచే ప్రారంభమైంది. ఇష్టం లేకపోయిన డబ్బు కోసమే ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆమె చెప్పేవారు. అలా సినిమాల్లో స్టార్‌గా ఉన్నప్పుడే 1982లో రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత అక్కడ కూడా తన సత్తా చాటారు. సినిమా రంగంలో ఉన్నప్పుడే భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆమె రాజకీయాల్లో తన ఆస్తులపై పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చెందిన ఆభరణాలు, ఆస్తులను వేలం వేసి కోర్టుకు ఆమె చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
వివరాలు.. అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, చిన్నమ్మ బంధువులు ఇలవరసి, సుధాకరన్‌కు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇందులో అమ్మ జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 100 కోట్లు జరిమానా విధించారు. మిగిలిన వారికి తలా రూ. పది కోట్లు జరిమానా, జైలు శిక్ష విధించారు. దీనిని వ్యతిరేకిస్తూ అప్పీల్‌కు వెళ్లగా నిర్దోషులుగా బయటపడ్డారు.
అయితే ఈ తీర్పుపై దాఖలైన పునర్ సమీక్ష పిటిషన్‌పై విచారణ ముగియక ముందే జయలలిత మరణించారు. 2017లో వెలువడ్డ ఈ తీర్పులో జయలలితను దోషిగానే పరిగణించారు. ఆమె జీవించి లేకపోవడంతో శిక్ష నుంచి తప్పించారు. అయితే జరిమానాలో మార్పు చేయలేదు. జయలలిత మరణించి 6 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు జరిమానా చెల్లింపు జరగలేదు. ఈ జరిమానా వసూలుపై కోర్టు దృష్టి పెట్టింది. అదే సమయంలో జయలలిత వద్ద సీజ్ చేసిన బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
28 కేజీల నగలు, 800 కేజీల వెండితో పాటు ఇతర వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి మార్చి 6,7 తేదీలలో అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. దీనిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించినానంతరం జరిమానా చెల్లింపునకు సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. జయలలితకు చెందిన ఆభరణాలను ట్రెజరీకి పంపించి విలువ లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపడుతుండడం గమనార్హం.
దీని ఆధారంగా రూ. 40 కోట్లు వచ్చేందుకు వీలుందని, మరో 60 కోట్లు ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి అందించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి అందజేయాల్సి ఉండడంతో ముందస్తు లెక్కలతో జయలలిత ఆస్తుల వేలానికి కార్యాచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment