eco-friendly
-
ఖననంలోనూ పర్యావరణహితం
చనిపోకముందే సమాధులు కట్టించుకోవడం గురించి విన్నాం. పిల్లల్లేని వారు, పోయాక ఎవరూ పట్టించుకురని భావించేవారు ముందుచూపుతో అలా చేస్తుంటారు. ఈ ధోరణి బ్రిటన్‌లోనూ ఉంది. కాకపోతే అందులోనూ పర్యావరణ హితానికి వాళ్లు పెద్దపీట వేస్తుండటం విశేషం. యూకే వాసులు తమ అంత్యక్రియల కోసం ఎకో ఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు. యూకేలో అంత్యక్రియల్లో 80 శాతం దాకా ఖననాలే ఉంటాయి. అందుకు వాడే శవపేటికలు హానికర రసాయనాలతో తయారవుతున్నాయి. పైగా వాటిలో మృతదేహాల నిల్వకు వాడే ఫార్మాల్డిహైడ్ పర్యావరణానికి హానికారకమే. అది నేరుగా మట్టిలో కలుస్తుంది. కార్బన్ కన్సల్టెన్సీ సంస్థ ప్లానెట్ మార్క్ అధ్యయనం ప్రకారం ఒక్కో శవపేటిక నుంచి ఏకంగా లండన్–పారిస్ విమానం వదిలే కర్బన ఉద్గారాలకు సమానమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. శవపేటికను ఆరడుగుల లోతున పాతేస్తారు. ఇది మట్టిలో కలవడానికి వందేళ్లు పడుతోందట. కళాకృతి నుంచి వ్యాపారం వైపు బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తరువాత పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధానంపై బ్రిటన్వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఎకోఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ‘ఎకో ఫ్రెండ్లీ’ అంత్యక్రియలను కోరుకుంటున్నట్లు ఇటీవల యూగవ్ నిర్వహించిన కో–ఆప్ ఫ్యునరల్ కేర్ సర్వేలో తేలింది. స్వతహాగా కళాకారిణి అయిన వెస్ట్ యార్క్‌షైర్‌లోని హెబ్డెన్ బ్రిడ్జికి చెందిన రేచల్ చావు, దుఃఖం, ప్రకృతి ఇతివృత్తంతో క్రియేటివ్‌గా శవపేటికను చేశారు. దాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. స్నేహితుడికోసం ఊలు, చెట్ల ఆకులు, నార, ఇతర పదార్థాలతో పర్యావరణహితమైన శవపేటికను తయారు చేయడంతో అది ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. యూకే అంతటా వ్యాపారం.. ఈ ఎకోఫ్రెండ్లీ శవపేటికలను కేవలం మూడు అడుగుల లోతులో మాత్రమే పాతేస్తారు. అయినా.. భూమి పైపొరల్లో ఉండే క్రిముల వల్ల, శవపేటికల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో శరీరాలు కుళ్లిపోవడానికి 20 నుంచి 30 ఏళ్లు మాత్రమే పడుతుందట. అందుకే మరణానంతరమూ తమవల్ల భూమి కాలుష్యం కాకూడదనుకుంటున్న వ్యక్తులు వీటిని ఎంచుకుంటున్నారు. రేచల్ 2016లో ప్రారంభించిన ఈ వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు యూకే అంతటా ఈ ఎకో ఫ్రెండ్లీ స్మశాన వాటికలున్నాయి. భూమికి మేలు చేయాలనుకునేవారు తమను సంప్రదిస్తున్నారని రేచల్ చెప్పారు. ఇతర పర్యావరణ అనుకూల పరిశ్రమల మాదిరిగా, సహజ సమాధులకు ఎక్కువ ఖర్చు అవుతుంది.‘‘ఈ భూమ్మీద నా చివరి చర్య కాలుష్య కారకమైనదిగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. జీవితమంతా పర్యావరణహితంగా జీవించిన తాను.. మరణం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్న’’ అని చెప్పే 50 ఏళ్ల రేచల్ సొంతంగా శ్మశానవాటికను తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తీవ్ర కాలుష్యం నడుమ..ఓ జంట అద్భుతాన్ని ఆవిష్కరించింది!
ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొంది. కాలుష్య స్థాయి పెరుగుతోందని, పొగమంచు సమస్య అంతకంతకు తీవ్రతరం అవుతోందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది కూడా. అంతలా తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశా రాజధాని నడిబొడ్డున పాశ్చాత్య దేశాల కంటే నాణ్యమైన గాలితో కూడిన పరిశుభ్రమైన ఇల్లు ఒకటి ఉంది. అదెలా సాధ్యం అనుకోకండి. ఎందుకంటే ఈ జంట సాధ్యం చేసి చూపించి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆ జంట ఏం చేశారంటే..మన దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా మరింత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్లో కాలుష్యం, పొగమంచు కారణంగా ఢిల్లీలోని స్కూళ్లు, కాలేజ్‌లు కూడా మూతపడుతున్నాయి. అంతలా ఘోరంగా ఉందక్కడ పరిస్థితి. పీల్చుకునే గాలిలోనే నాణ్యతలేకపోవడంతో అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల పాలవ్వుతున్నారు. ఇలాంటి ఘోరమైన స్థితిలో ఓ జంట ఇల్లు వంద శాతం గాలి నాణ్యతో అందంగా ఉంది. అది ఇల్లు పర్యావరణానికి స్వర్గధామమా..! అన్నట్లుగా పచ్చదనంతో అలుముకుని ఉంది. ఢిల్లీకి చెందిన పీటర్ సింగ్, నీనో కౌర్ దంపుతులది ఆ ఇల్లు. ఢిల్లీలోనే ఇలాంటి ఇల్లు కూడా ఉందా అని విస్తుపోయాలా అత్యంత పరిశుభ్రంగా ఉంది. మండు వేసవిలో సైతం ఆ ఇంటిలో కేవలం 25 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుందట. ఈ విధమైన పర్యావరణానుకుల జీవనశైలిని నీనా కేన్సర్‌తో బాధపడుతున్నప్పటి నుంచి ప్రారంభించారట.ప్రస్తుతం నీనోకి 75 ఏళ్లు. ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకునేందుకు సాగిన ప్రయాణం ఇలా పర్యావరణానికి పెద్దపీటవేసేలా దారితీసిందని చెబుతున్నారు పీటర్ సింగ్, నీనో దంపతులు. ఇంట్లోనే చేపల పెంపంక, కూరగాయల మొక్కల పెంపకం. ఈ రెండింటినీ ఏకీకృతం చేసేలా వ్యవసాయం చేస్తోంది ఆ జంట. వారికి నాలుగు పెద్దపెద్ద చేపల ట్యాంకులు ఉన్నాయి. ఆ చెరువుల్లోని చేపలు అమ్మోనియా అధికంగా ఉంటే నీటిని ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఫిల్టర్ చేసి మొక్కలకు సరఫరా చేస్తారు. మళ్లీ మొక్కలు నీటిలోని పోషకాలను గ్రహించగా మిగిలిని నీటిని శుద్ధిచేసి తిరిగి చేపల ట్యాంకులోకి పంపిస్తారు. అంతేగాదు వర్మికంపోస్ట్, కోకో పీట్ ఉపయోగించి దాదాపు పదివేల నుంచి 15 వేల దాక వివిధ రకాల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. తాము దుకాణానికి వెళ్లాల్సిన పనిలేదంటున్నారు. ఇంట్లోకి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయాలను తామే పండిస్తామని సగర్వంగా చెప్పారు. అలాగే తమ వంటగది వ్యర్థాలను సేంద్రీయ కంపోస్ట్‌గా రీసైకిల్ చేసేలా ఏర్పాట్ల తోపాటు రెయిన్ వాటర్‌ని శుద్ది చేసి ఉపయోగించుకునేలా ప్రత్యేకంగా రూపొందించారట. ఇలా పర్యావరణ హితంగా జీవించడానికి కార్యకర్తనో, సెలబ్రిటీనో కానవసరం లేదని చాటిచెప్పారు. బురదలో తామర పువ్వు వికసించినట్లుగా.. అత్యంత కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీలో ఈ పచ్చదనంతో కూడిన ఇల్లు ఓ కొత్త ఆశను రేకెత్తించింది!. నిజానికి అందరూ ఇలా పర్యావరణానుకూలంగా జీవించడం ప్రారంభిస్తే కాలుష్యం క్లీన్ అయిపోతుంది ఆరోగ్యం సొంతమవుతుంది కదూ..!.(చదవండి: కేరళ సంప్రదాయ ‘కసావు చీర’తో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం..!) -
Rajiv Kumar Sharma: ప్రతికూలతకు... పచ్చటి జవాబు
పాత వస్తువులను చూస్తూ కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్త ఆవిష్కరణకు బీజం పడుతుంది. సమాజానికి మేలు జరుగుతుంది. రసాయనాలతో కూడిన ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా అనారోగ్యానికి గురైన రాజీవ్ శర్మ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాడు. ‘జీరో ప్లాస్టిక్, జీరో ట్యాక్సిన్స్’ నినాదంతో ఎకో–ఫ్రెండ్లీ ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను డిజైన్ చేశాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్స్’ స్టార్టప్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు జంషెడ్‌పూర్‌కు చెందిన రాజీవ్ కుమార్ శర్మ.... కోవిడ్ సమయంలో రాజీవ్‌శర్మ కుటుంబం శానిటైజర్లతో పాటు ఎయిర్ ఫ్రెష్నర్లను ఉపయోగించేది. ఒకరోజు వాంతులు, తలనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు రాజీవ్. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగివచ్చిన తరువాత ‘ఎందుకు ఇలా జరిగింది?’ అంటూ ఆలోచించాడు. ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఎయిర్ ఫ్రెష్నర్ వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలప, పూలవ్యర్థాలతో సహజమైన ఎయిర్ ఫ్రెష్నర్ తయారుచేశాడు. ఈ ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా ఇనోవేటర్ కాస్తా ఎంటర్ప్రెన్యూర్ అయ్యాడు. ‘ఆల్వే–గ్రీన్ సోల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ ప్రారంభించి విజయం సాధించాడు. ‘ఎయిర్ ఫ్రెష్‌నర్‌లలో ఇబ్బంది కలిగించే రసాయనాలు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఏదైనా ఎయిర్ ఫ్రెష్నర్ తయారీలో ఉపయోగించిన ఇన్‌గ్రేడియెంట్స్ గురించి తెలుసుకోవడం. పిల్లలు, జంతువులకు ఇవి సురక్షితం కాదు. ఈ నేపథ్యంలో పర్యావరణానికి హాని కలిగించని, మనుషులకు, జంతువులకు సురక్షితమైన ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను తయారుచేయాలనుకున్నాను’ అంటాడు రాజీవ్‌శర్మ. ఈ ప్రాజెక్ట్‌పై తల్లితో కలిసి ఎనిమిది నెలలకు పైగా శ్రమించాడు. ఎన్నో ట్రయల్స్ తరువాత ఫైనల్ ప్రాజెక్ట్ ఓకే అయింది. ‘మా ఫ్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. ఇది మరింత ఎక్కువమందికి చేరువ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కాలేజీలోని యంత్రాలతో ఎయిర్ ఫ్రెష్నర్ పర్ఫెక్ట్గా రావడానికి సహాయం చేశారు’ అంటాడు రాజీవ్. జంషెడ్పూర్(ఝార్ఖండ్)లోని ఆలయాల నుంచి రాజీవ్ ప్రతిరోజూ కనీసం మూడు కిలోల పూలవ్యర్థాలను సేకరిస్తాడు. ప్రస్తుతం ఇంటి నుంచే కంపెనీని నడుతున్న రాజీవ్ దాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్’ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరుతో కలిసి పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి రాజీవ్ కొత్త కొత్త వస్తువులు తయారుచేసేవాడు. కోవిడ్ సమయంలో సౌకర్యవంతమైన పీపీఇ కిట్లను రూపొందించాడు. ‘ఝార్ఖండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’ సభ్యుడిగా గాయపడిన శునకాల కోసం ప్రత్యేకమైన వీల్చైర్లను తయారుచేశాడు. ‘మనకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే కాదు పర్యావరణానికి హాని కలిగించని పరికరాలను తయారు చేయడం నా లక్ష్యం’ అంటున్నాడు రాజీవ్ కుమార్ శర్మ. -
మోదీ ప్రశంసలు అందుకున్న ఎంట్రప్రెన్యూర్ వర్ష..
‘‘ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటే మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు. వాటిలో ఒకటి నన్ను ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. ఈరోజు నేను ఆర్గానిక్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాను. అదే మన్‌కీ బాత్ కార్యక్రమంలో నన్ను ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతూ తెగ మురిసిపోతోంది వర్ష. కర్ణాటకలోని చామరాజన్ నగర్ జిల్లా ఆలహళ్లీ గ్రామానికి చెందిన వర్ష ఎమ్‌టెక్ చదివింది. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం కోసం చూడకుండా సరికొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వర్ష.. ఓ రోజు అనుకోకుండా మన్‌కీబాత్ వినింది. ఆ కార్యక్రమంలో అరటి ఆకులను ఉపయోగపడే వనరులుగా ఎలా మారుస్తున్నారో మోదీ ప్రస్తావించారు. ప్రకృతిని ఇష్టపడే వర్షకు ఇది బాగా నచ్చడంతో.. అరటి బోదె, ఆకులతో హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. వీడియో చూసి... అరటి కాండాలను ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చాలో వర్షకు తొలుత అర్థం కాలేదు. తరువాత యూట్యూబ్‌లో వెతికి ఒక వీడియో ద్వారా కొంత సమాచారం తెలుసుకుంది. కోయంబత్తూరు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా ఎలా మారుస్తున్నారో వివరంగా తెలుసుకుంది. ఆ తరవాత వ్యాపారానికి కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేసి ఉమ్మతూరు సమీపంలో ‘ఆకృతి ఇకోఫ్రెండ్లీ’ పేరిట ఎంటర్ప్రైజ్ను ఏర్పాటు చేసింది. అరటికాండాలు, ఆకులను సేకరించి యంత్రాలతో ప్రాసెస్ చేసి నారతీసి, ఫ్లోర్‌మ్యాట్స్, బ్యాగ్స్, పర్సులు, హ్యాండీ క్రాఫ్ట్స్, అరటి గుజ్జు నుంచి తీసిన రసంతో సహజసిద్ధమైన ఎరువులు తయారు చేసి విక్రయిస్తోంది. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆర్గానిక్ షాపులు, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపుల్లో సైతం ఆకృతి వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా మారుస్తూ కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రైతులకు ఆదాయం వచ్చేలా చేస్తోంది వర్ష. వర్ష తన భర్త శ్రీకాంత్ సాయంతో చేస్తున్న ఈ ఇకో–ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలియడంతో కొన్ని కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు వçస్తున్నాయి. ‘‘భవిష్యత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించి ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తాను’’ అని వర్ష చెబుతోంది. గ్రామాల్లోని మహిళలు సైతం వ్యాపారవేత్తలుగా మారేందుకు, ఉద్యోగం దొరకనివారు ఉపాధిని ఇలా సృష్టించుకోవచ్చని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది వర్ష. నవంబర్ నెల మన్‌కీ బాత్ కార్యక్రమంలో వర్ష ఎంట్రప్రెన్యూర్ జర్నీ గురించి మోదీ ప్రస్తావించడం విశేషం. -
మరింత పర్యావరణహితంగా అచ్యుతాపురం సెజ్
సాక్షి, అమరావతి: ఫార్మా, రసాయనాలు తదితర రెడ్ కేటగిరీ యూనిట్లకు ప్రధాన ఆకర్షణగా ఉన్న అచ్యుతాపురం సెజ్‌ను మరింత పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద 5,595.47 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఏపీ సెజ్‌లో ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫార్మా, రసాయన యూనిట్లు ఏర్పాటు కావడమే కాకుండా.. మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండడంతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే మౌలికవసతులను భారీస్థాయిలో కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.540 కోట్లతో డిజైన్ బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ విధానంలో (డీబీఎఫ్‌వోటీ) కామన్ ఇఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌తో (సీఈటీపీ) పాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం అచ్యుతాపురం వద్ద 825కేఎల్డీ సామర్థ్యంతో సీఈటీపీని ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ ఉన్న పరిశ్రమలకు పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు. ఇందుకోసం కొత్తగా 5 ఎంఎల్డీ సీఈటీపీని ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న 850 కేఎల్‌డీని 2000 కేఎల్డీ సామర్థ్యానికి చేరేలా ఆధునికీకరించాలని నిర్ణయించారు. సీఈటీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిలో కనీసం 50 శాతం పరిశ్రమలు తిరిగి కొనుగోలు చేసి వినియోగించుకోవాలని కంపెనీలను కోరుతున్నది. దీంతోపాటు 10 ఎంఎల్డీ కెపాసీటీతో నీటి శుద్ధి యూనిట్‌ను, ఘన వ్యర్థాలను నిర్వహించే యాజమాన్య వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. డీబీఎఫ్‌వోటీ విధానంలో రూ.540 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ యూనిట్‌ను 33 ఏళ్లపాటు లీజు విధానంలో నిర్వహించడానికి ప్రవేటు సంస్థకు పారదర్శక విధానంలో అప్పగించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ బిడ్లను న్యాయపరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు ఏపీఐఐసీ పంపించింది. అచ్యుతాపురం సెజ్‌తో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు పారిశ్రామిక పార్కులు విశాఖ, విజయవాడ, గుంటూరు ఆటోనగర్లు, ఒంగోలు గ్రోత్ సెంటర్లలోమౌలికవసతుల అభివృద్ధికి ఏపీఐఐసీ ప్రాధాన్యత ఇస్తున్నది. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఆధునికీకరణలో భాగంగా రెండో దశ పనుల కింద ఏపీసెజ్‌లో పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను ఏపీఐఐసీ చేపట్టింది. -
స్పృహ: పర్యావరణ రక్షాబంధన్
ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు? అని గట్టిగా అనుకోవచ్చు. అయితే ముంజేతి రాఖీకి అద్దం అక్కర లేకపోవచ్చుగానీ... అర్థం మాత్రం ఉంటుంది. బంధాల గురించి రాఖీ ఎన్నో మాటలు చెప్పకనే చెబుతుంది. ఇప్పుడది పర్యావరణహిత వచనాలు కూడా అందంగా చెబుతోంది. ‘మమ్మల్ని చల్లగా చూడు తల్లీ’ అంటూ చెట్లకు రాఖీ కట్టే ఆచారం ఉంది. ‘అయితే మనం చల్లగా ఉండాలంటే చెట్టు చల్లగా ఉండాలి. పర్యావరణం బాగుండాలి’ అంటున్నారు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళలు. పైన్ చెట్ల పత్రాలతో ఎకో–ఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఊరూరు తీసుకువెళుతున్నారు.... పైన్ చెట్ల నుంచి నేల రాలిన పత్రాల వలన ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నకు ఉపయోగపడే సమాధానం ఒకప్పుడు ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. బోలెడు సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిఫామ్స్ ప్రయోగాత్మకంగా 22 మంది మహిళలకు పైన్ పత్రాలతో రాఖీల తయారీ నేర్పించింది. ఆ తరువాత సిమ్లా, సోలన్ జిల్లాలో 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఒక కోణం అయితే, పర్యావరణానికి మేలు జరగడం మరో కోణం. ఎండిపోయిన పైన్ పత్రాల వల్ల అడవుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య చాలావరకు తగ్గింది. ‘గతంలో పైన్ పత్రాలపై దృష్టి ఉండేది కాదు. అయితే ఇప్పుడు అవి మాకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యావరణ ప్రయోజన కార్యక్రమాల్లో భాగం అయ్యేలా చేస్తున్నాయి’ అంటుంది ప్రియదర్శిని కుమారి. రకరకాల మొక్కల విత్తనాలు కూర్చి ఈ రాఖీలను తయారు చేయడం ప్రత్యేకతగా నిలుస్తుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణప్రాంతాల్లో చిన్నస్థాయిలో అయినా ఉపాధి దొరకడం కష్టం అయ్యేది. ఈ రాఖీల తయారీ వల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణానికి సంబంధించిన మంచి విషయాలను జనాలలో ప్రచారం చేయగలుగుతున్నాం’ అంటుంది 42 సంవత్సరాల హేమావతి. ట్రైనర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చిన హేమావతి నెలకు ముప్పై వేలకు పైగా సంపాదిస్తుంది. ‘పర్యావరణ స్పృహ పెరిగిన తరువాత ఎకో–ఫ్రెండ్లీ రాఖీలకు డిమాండ్ పెరిగింది. రెగ్యులర్ రాఖీల కంటే భిన్నంగా ఉండడం కూడా వీటి డిమాండ్‌కు మరో కారణం’ అంటుంది నేహా. ఊరూరూ తిరిగి ఎకో–ఫ్రెండ్లీ రాఖీలను అమ్మడమే కాదు పర్యావరణ స్పృహకు సంబంధించిన అంశాలను ప్రజా బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకు వెళుతున్నారు. ‘ఈ సంవత్సరం నా సోదరులకు ఎకో ఫ్రెండ్లీ రాఖీలు కట్టాలని నిర్ణయించుకున్నాను. నా స్నేహితులకు కూడా వీటి ప్రత్యేకతను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది కాలేజి స్టూడెంట్ శ్వేత. దిల్లీకి చెందిన తోరాని బ్రాండ్ రాఖీలు కూడా పర్యావరణ స్పృహతో తయారుచేయబడుతున్నాయి. పాత దుస్తులు, బట్టలతో తయారుచేసిన పాతబ్యాగులు... మొదలైన వాటిని ఉపయోగించి అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంగళూరు(కర్నాటక)లోని ‘పేపర్‌సీడ్ కో’ అనే సామాజిక సంస్థ రకరకాల మొక్కల విత్తనాలను కూర్చి పర్యావరణహిత రాఖీలను తయారు చేస్తుంది. పండగ తరువాత చేతికి ఉన్న రాఖీలోని విత్తనాలు భూమిలోకి వెళ్లి పచ్చటి భవిష్యత్‌ను ఇస్తాయి. ఈ రాఖీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను ‘పేపర్‌సీడ్ విలేజి’ కోసం కేటాయిస్తున్నారు. ఇది మహిళలకు పర్యావరణహిత బొమ్మల తయారీలో శిక్షణ ఇచ్చే సంస్థ. ఎకో–ఫ్రెండ్లీ రాఖీల గురించి సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. -
నేడు ‘లైఫ్’ను ప్రారంభించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పర్యావరణహిత జీవన శైలి(లైఫ్) అనే ప్రపంచస్థాయి కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్’ను ప్రకటిస్తారు. దీనిద్వారా పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబించేలా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు, సంఘాలను ఒప్పించడానికి, ప్రభావితం చేయడానికి అవసరమైన ఆలోచనలను, సలహాలను విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు నుంచి ఆయన ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రధానోపన్యాసం చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది. కార్యక్రమంలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్ బిల్ గేట్స్, క్లైమేట్ ఎకనమిస్ట్ లార్డ్ నికొలస్ స్టెర్న్, నడ్జ్ థియరీ కర్త కాస్ సన్స్టీయిన్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ సీఈవో, ప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్‌గుప్తా, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తదితరులు పాల్గొంటారు. 10న ‘ఇన్–స్పేస్’ప్రారంభం ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) ప్రధాన కార్యాలయాలను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. అంతరిక్ష కార్యకలాపాలను, అంతరిక్ష శాఖకు చెందిన వివిధ సంస్థలను ప్రభుత్వేతర ప్రైవేట్ సంస్థలు ఉపయోగించుకునేందుకు, ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు ఇవి నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి. -
సక్సెస్‌స్టోరీ..:ఎకో–ఫ్రెండ్లీ ఫ్రెండ్స్
‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది’ అనే మాటను వింటూనే ఉన్నాం. ఈ ముగ్గురు కుర్రాళ్ల జీవితాన్ని మార్చేసి, అంకుర దిగ్గజాలుగా మార్చింది మాత్రం ఒక చాక్లెట్ రేపర్. అదేలా అంటే... ‘విజయానికి దారి ఏమిటి?’ అని మల్లగుల్లాలు పడుతుంటాంగానీ కొన్నిసార్లు పరిస్థితులే విజయానికి దారి చూపుతాయి. ముగ్గురు మిత్రులు, మూడు సంవత్సరాల క్రితం... అక్షయ్ వర్మ, ఆదిత్య రువా, అంజు రువా ఆరోజు చెమటలు కక్కుతూ ముంబైలో బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ ఎండలో వారికి తళతళ మెరుస్తూ ఒక ఒక చాక్లెట్ బ్రాండ్ ప్లాస్టిక్ రేపర్ కనిపించింది. ఆ బ్రాండ్ తన ఉత్పత్తులను 1990లోనే ఆపేసింది. రేపర్ మాత్రం ‘నిను వీడని నీడను నేను’ అన్నట్లుగా చూస్తోంది. కాలాలకు అతీతంగా పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్‌పై ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి చర్చ, ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘బెకో’ అనే స్టార్టప్. వెదురు, ప్లాంట్ బేస్డ్ ఇన్‌గ్రేడియంట్స్‌తో పర్యావరణహితమైన వస్తువులు, ఫ్లోర్ క్లీనర్స్, డిష్‌వాషింగ్ లిక్విడ్లాంటి కెమికల్ ఫ్రీ డిటర్జెంట్స్, గార్బేజ్ సంచులు, రీయూజబుల్ కిచెన్ టవల్స్, టూత్‌బ్రష్‌లు... మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది బెకో. దీనికి ముందు... పెట్ యాజమానుల కోసం ‘పెట్ ఇట్ అప్’ అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు అక్షయ్ వర్మ. కో–ఫౌండర్ జారుకోవడంతో ఒక సంవత్సరం తరువాత అది మూతపడింది. ఇక ఆదిత్య కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్–ఆర్గనైజేషన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ వెంచర్‌ను అమ్మేశాడు. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. ఈ ముగ్గురు కలిసి ప్రారంభించిన ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ మొదట్లో తడబడినా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఊపందుకుంది. ఆన్లైన్ మార్కెట్ప్లేసులతో పాటు, ముంబై, బెంగళూర్లలో దీనికి ఆఫ్‌లైన్ స్టోర్లు ఉన్నాయి. ‘బెకో’లో క్లైమెట్ ఎంజెల్స్ ఫండ్, టైటాన్ క్యాపిటల్, రుకమ్ క్యాపిటల్...మొదలైన సంస్థలు పెట్టుబడి పెట్టాయి. ‘లాభాల కోసం ఆశించి ప్రారంభించిన వ్యాపారం కాదు. ఒక లక్ష్యం కోసం ప్రారంభించింది. వీరి తపన చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరనే నమ్మకం కలుగుతుంది’ అంటున్నారు ‘రుకమ్ క్యాపిటల్’ ఫౌండర్ అర్చన జాహగిర్దార్. పర్యావరణ ప్రేమికురాలు, ప్రసిద్ధ నటి దియా మీర్జా ఈ ముగ్గురి భుజం తట్టడమే కాదు, కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు. ముగ్గురు మిత్రులు అక్షయ్ (26), ఆద్యిత (26), అంజు (27) ముక్తకంఠంతో ఇలా అంటున్నారు... ‘భూగోళాన్ని పరిరక్షించుకుందాం అనేది పర్యావరణ దినోత్సవానికి పరిమితమైన నినాదం కాదు. పర్యావరణ స్పృహ అనేది మన జీవనశైలిలో భాగం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకో–సెన్సిటివ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారుల్లో 85 శాతం యువతరమే. పర్యావరణహిత వస్తువులను ఆదరించే ధోరణి పెరిగింది’ పర్యావరణహిత ఉత్పత్తుల మార్కెట్ రంగంలో ‘బెకో’ లీడింగ్ ప్లేయర్ పాత్ర పోషించనుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో ‘బెకో’ను 500 కోట్ల రూపాయల బ్రాండ్‌గా చేయాలనేది ముగ్గురు మిత్రుల ఆశయం. అది ఫలించాలని ఆశిద్దాం. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. -
పండుగ వేళ.. గృహ కళ!
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో–ఫ్రెండ్లీగా మారుతుందంటున్నారు. ► సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ► ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ► రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ► చేతితో తయారు చేసిన మట్టి దీపాంతలు, లాంతర్లు చాలా కామన్. వీటికి బదులుగా అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్య రశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి. ► ఈ మధ్య కాలంలో నీళ్లల్లో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్‌పూల్, ఫౌంటేన్ వంటి మీద అమర్చుకోవచ్చు. -
తేనెలూరే కొవ్వొత్తులు
ఎలక్ట్రిసిటి అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో వీధి దీపాలు, కిరసనాయిల్ బుడ్డి(దీపం) వెలుతురులో... చదువుతోబాటు పనులన్ని చక్కబెట్టేవాళ్లం. ఆ తరువాత కొవ్వొత్తి (క్యాండిల్) అందుబాటులోకి వచ్చాక కిరసనాయిల్ దీపాలు పక్కన పెట్టి క్యాండిల్స్ వాడుతున్నాం. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో పనులు చేసుకోవడం మీదే మన దృష్టంతా ఉంటుంది. కానీ ఆ క్యాండిల్ దేనితో తయారు చేశారు? దానివల్ల మనకేమైనా ప్రమాదం ఉందా? అని ఎవరు ఆలోచిస్తారు కష్టమే కాదా! కానీ ఇలా ఆలోచించిన రాజస్థా¯Œ అమ్మాయి తనుశ్రీ జై¯Œ కొవ్వొత్తులు కూడా కాలుష్యకారకాలని, వాటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని గుర్తించి... ఏకంగా ఇకోఫ్రెండ్లీ క్యాండిల్స్‌ను తయారు చేసి విక్రయిస్తోంది. పర్యావరణానికి హాని చేయని క్యాండిల్స్ తయారు చేస్తూ స్థానికంగా ఉన్న 250 మంది మహిళలకు ఉపాధిని కల్పించడం విశేషం. జైపూర్‌లోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది తనుశ్రీ జై¯Œ . నాన్న ఆర్మీలో పనిచేస్తుండగా, అమ్మ టీచర్. చదువులో చురుకుగా ఉండే తనుశ్రీ 2017లో బీటెక్ కంప్యూటర్స్ పూర్తయ్యాక, ఢిల్లీలోని ఇండియ¯Œ స్కూల్ ఆఫ్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (ఐఎస్డీఎమ్)లో మాస్టర్స్ చేసింది. మాస్టర్స్ చేసే సమయంలో ఢిల్లీలోని కాలుష్యభరిత వాతావరణం సరిపడక ఆమెకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. ప్రారంభంలో పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ సమస్య తీవ్రమవడంతో.. ఆసుపత్రిలో చేరక తప్పలేదు. చికిత్స చేయించుకుని కోలుకుని ఇంటికి వచ్చాక.. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి పీల్చుకోడానికి ప్రయత్నించింది. కానీ అంతా కాలుష్యంతో కూడిన వాతావరణం. దీంతో పర్యావరణంలో ఉన్న కాలుష్య కారకాలను ఎలాగైనా తగ్గించాలనుకుంది. ఈ క్రమంలోనే రసాయనాలతో తయారయ్యే కొవ్వొత్తులు కాలుష్యానికి కారణమతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా ప్రకృతిసిద్ధంగా లభించే పదార్థాలతో తయారు చేయాలనుకుంది. తేనె తుట్టెతో... క్యాండిల్స్ తయారీ కంపెనీలన్నీ... క్యాండిల్స్‌ను పారఫి¯Œ తో తయారు చేస్తున్నట్లు తెలుసుకుంది. పారఫి¯Œ లో అధికమొత్తంలో కార్బ¯Œ ఉంటుంది. దాంతో క్యాండిల్స్‌ని వెలిగించినప్పుడు, అవి వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తాయి. ఇది జరగకుండా ఉండాలంటే పారఫి¯Œ తో కాకుండా వేరే పదార్థంతో తయారు చేయాలని నిర్ణయించుకుని... 2018లో ‘నుషౌరా’ పేరుతో పారాఫి¯Œ కు బదులు తేనె తుట్టె నుంచి తీసిన మైనంతో క్యాండిల్స్‌ను రూపొందించడం మొదలుపెట్టింది. లక్షన్నర పెట్టుబడి, పదిమంది మహిళలతో.. సహజసిద్ధమైన మైనం, సువాసన భరిత నూనెలు, దూదితో క్యాండిల్స్ తయారు చేయించింది. గుజరాత్ రైతుల నుంచి మైనాన్ని, సేంద్రియ సాగు రైతుల నుంచి ఆయిల్స్‌ను సేకరిస్తోంది. వివిధ రంగులతో చక్కటి సువాసనతో ఉన్న ఈ క్యాండిల్స్‌కు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తుతం ఇరవై రకాల కొవ్వొత్తులను అరవై గ్రాముల నుంచి కేజీ పరిమాణంలో తయారు చేస్తోంది. నుషౌరా క్యాండిల్స్‌ను ఇండియాలోనేగాక కెనడా, అమెరికా, జర్మనీ, ఫ్రా¯Œ ్సలకు ఎగుమతి చేస్తోంది. ఉపాధినిస్తోంది.. క్యాండిల్స్ తయారీలో రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ మహిళలంతా తమ ఇళ్లలో క్యాండిల్స్ రూపొందించి వాటిని తనుశ్రీకి పంపుతారు. క్యాండిల్స్ తయారు చేసిన మహిళలకు పనికి తగ్గ వేతనం ఇస్తోంది. ఈ క్యాండిల్స్ తయారీ ద్వారా ప్రస్తుతం 250 మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది. నుషౌరా క్యాండిల్స్‌ను కొన్నవాళ్లు బంధువులు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వడం.. వారు ఆ క్యాండిల్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీటి గురించి అందరికీ తెలిసి విక్రయాలు బాగా పెరిగాయి. సవ్యంగా క్యాండిల్స్ విక్రయాలు జరుగుతోన్న సమయంలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. దీంతో విక్రయాలు ఆగిపోయాయి. ఆ సమయంలో మూడు పొరలతో కూడిన మాస్కులు, వివిధ రకాల నిల్వ పచ్చళ్లు, చాక్లెట్లు, సబ్బులు, శానిటైజర్లు, డయపర్లు తయారు చేసి విక్రయించేది. ఈ విధంగా మహిళలు ఉపాధిని కోల్పోకుండా చేసింది. పరిస్థితులు ప్రస్తుతం కాస్త కుదుటపడుతుండడంతో మళ్లీ క్యాండిల్స్ తయారీని పెంచింది. -
మట్టి కాని గట్టి బొమ్మలు
బంక మట్టితో చేసిన బొమ్మలు ఎక్కువసేపు నిలబడవు. ఎండిపోగానే పగుళ్లు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు రసాయనాలతో తయారైన మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకుంటారు. ఆ మట్టిలో ప్రమాదకరమైన కిరసనాయిల్, బొరాక్స్ వంటివి ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. తన యేడాది వయసున్న కొడుకు మట్టితో ఆడుతుంటే దీప్తికి భయంగా ఉండేది. పిల్లవాడి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని బొమ్మలు తయారు చేయాలనుకుంది దీప్తి. ఆ ఆలోచన నుంచి వచ్చినదే పర్యావరణ హితమైన మట్టి. పిల్లల కోసం బెంగళూరుకు చెందిన దీప్తి భండారీ హాని కలిగించని కృత్రిమ మట్టిని తయారు చేయడం ద్వారా ఆ మట్టితో ఆడుకునే పిల్లలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.. తాను ఆర్థికంగా ఎదుగుతున్నారు దీప్తి. బయో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దీప్తి.. టీచింగ్ మీద ఆసక్తి పెంచుకున్నారు దీప్తి. బంధువుల పిల్లలకు పాఠాలు చెబుతూ టీచింగ్ లో అనుభవం సంపాదించారు. ఆ అనుభవంతో పిల్లల కోసం ‘మిల్క్ టీత్ యాక్టివిటీ సెంటర్’ను బెంగళూరులోని చామరాజ్‌పేట్‌లో ప్రారంభించారు. పిల్లలకు పాఠాలు చెబుతూ, వృత్తి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద అవగాహన ఏర్పడింది దీప్తికి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, వాళ్లకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నారు దీప్తి. ‘‘పసి వయసులో నేర్చుకున్న విద్య జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులో నైపుణ్యం కూడా వస్తుంది’’ అంటారు దీప్తి. ఆటల్లోనే అన్నీ... పిల్లలకు బొమ్మలతో ఆటలు నేర్పుతూ, రంగులు, ఆకారాలు, పరిమాణాల గురించి కూడా నేర్పించటం దీప్తి ప్రత్యేకత. ‘‘మా అబ్బాయి చేతి రాత బాగుండేది కాదు. కాని మట్టితో బొమ్మలు చేయడం ద్వారా అందమైన రాత అలవాటయ్యింది. అంతకుముందు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోయేవాడు. ఇలా మట్టితో ఆటలు మొదలుపెట్టాక, చేతి వేళ్లు, కండరాలు బలంగా తయారు కావడంతో పెన్సిల్ చక్కగా పట్టుకోగలిగాడు. చక్కగా రాయగలుగు తున్నాడు. టీచర్‌గా నాకున్న అనుభవం మా అబ్బాయిని పెంచుకోవటానికి ఉపయోగపడింది’’ అంటారు దీప్తి. అందరూ ఆసక్తి చూపించారు ‘‘నేను పిల్లల కోసం టాడ్లర్ క్లాసులు ప్రారంభించాను. ఆ క్లాసులో పిల్లలంతా మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు చేసిన బొమ్మలు చూసిన తల్లిదండ్రులు ఆ మట్టి గురించి సమాచారం అడిగారు’’ అంటూ ఆనందంగా చెబుతారు దీప్తి. సాధారణంగా మార్కెట్ లో దొరికే మట్టితో చేసిన బొమ్మలు చాలా త్వర గా ఎండిపోతాయి. ఆ మట్టి ని మళ్లీ ఇంక ఉపయోగించలేం. కాని దీప్తి.. ఉప్పు, పిండి, నూనె, ఫుడ్ గ్రేడ్ కలర్స్, నీళ్లు కలిపి తయారు చేసిన మట్టి ఆరునెలల వరకు గట్టి పడకుండా ఉంటుంది. ‘‘నేను చేసిన మట్టి చూసి తల్లిదండ్రులంతా చాలా సంతోషించారు. వాళ్లకి కూడా ఈ మట్టి కావాలి అని అడిగి కొని తీసుకు వెళ్తున్నారు’’అంటున్న దీప్తి 20 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు నెలకు 35 వేలు సంపాదిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యంతోపాటు, తనకు ఆదాయం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటారు దీప్తి భండారీ. -
తెలుగు రాష్ట్రాల్లో మట్టి గణపయ్యల సందడి
-
ఎకోదంతా నమస్తుభ్యం
-
నీళ్లలో తేలినట్టుందే!
విహంగం పట్టణ జీవితం ఎలా ఉంటుంది? ‘ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల... బిజీ బిజీ బ్రతుకుల.. గజిబిజి ఉరుకుల పరుగులతో...’లాగే ఉంటుంది. అందుకే ఆ జీవితం అంటే మొహం మొత్తింది ఆడమ్స్, క్యాథరీన్ దంపతులకి. ఇద్దరూ కళాకారులు. వారు తయారుచేసే కళాకృతులకు కెనడాలో మంచి మార్కెట్ ఉంది. కానీ రణగొణ ద్వనులు, ఉరుకులు పరుగులు వారి కళాహృదయానికి సరిపడలేదు. వాటికి దూరంగా, ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశానికి పారిపోవాలని అనుకున్నారు. వెంటనే కెనడాలోని వాంకోవర్ ఐల్యాండ్ గుర్తొచ్చింది. అక్కడికి వెళ్లి నదీ జలాల మధ్య ఓ అందమైన ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టారు. ‘నేలంతా వదిలేసి నీటిలో ఇల్లు కట్టుకుంటున్నారేంటి’ అంటూ చాలా మంది ఆ దంపతుల్ని చూసి నవ్వారు. కానీ ఆ నవ్వినవాళ్లే అవాక్కయ్యేలా ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించారు క్యాథరీన్, ఆడమ్స్. పన్నెండు ఇంటర్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటుచేసి వాటిపై లివింగ్ హౌజ్, గ్రీన్‌హౌజ్, లైబ్రరీ, లైట్‌హౌజ్, డ్యాన్స్ స్టూడియో మొదలైనవి నిర్మించారు. కూరగాయలు, పండ్లు, పూల తోటలను నాటారు. కోళ్లఫామ్తో పాటు మరికొన్ని జంతువులతో చిన్నపాటి జూను ఏర్పాటు చేశారు. గులాబి, ఆకుపచ్చ కలర్ థీమ్‌తో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ నిర్మాణానికి ‘ఫ్రీడమ్ కోవ్’ అని పేరు పెట్టారు. అంటే ‘స్వేచ్ఛా నివాసం’ అని అర్థం. ఫ్రీడమ్ కోవ్ నీటిపై తేలుతుంది. కానీ నీటితో పాటు సాగిపోదు. అలా ఉండేలా బల మైన బేస్‌తో పక్కాగా నిర్మించారు దాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... ఇక్కడ అంతా ఎకో ఫ్రెండ్లీ. పర్యావరణానికి హాని చేసే ఏ వస్తువునూ వాడరు ఆడమ్స్ దంపతులు. ‘ఫ్రీడం కోవ్’కు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ అందుతుంది. చలికాలంలో వర్షపు నీటిని భద్రపరచి తాగు నీటిగా వాడుకుంటారు. పట్టణ జీవితంలో ఉండే కాలుష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వరు. ఫ్రీడమ్ కోవ్‌కు మీడియా ద్వారా బోలెడు ప్రచారం లభించడంతో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు రావడం మొదలైంది. కెనడాలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటిగా నిలిచింది. -
కాగితం నగషీ
మగువ అందానికి పొందికగా ఒదిగిపోతాయి ఈ నగలు. ఆ ఆభరణాలు ఎక్కువ డబ్బు ఖర్చు, బరువు లేకుండా... ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు అల్లాణి రాధిక. అదీ పర్యావరణహితంగా! ఖాళీ సమయాన్ని క్రియేటివ్‌గా మార్చుకుని పేపర్‌తో జ్యువెలరీ చేస్తున్నారు ఈమె. ‘పర్యావరణాన్ని కాపాడటమంటే సింపుల్‌గా ఉండటం కాదు. ఎకోఫ్రెండ్లీగా ఉంటూనే చక్కని అలంకరణతో అందంగా కనిపించవచ్చు. ఆసక్తి ఉంటే ఏ శిక్షణా అవసరం లేదు’ అంటున్న రాధిక... ఇంటర్నెట్ ముందు కూర్చునే ఈ పేపర్ ఆర్ట్ వర్క్ నేర్చుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న ఈమె భర్త ప్రైవేటు ఉద్యోగి. కాలేజీ లైఫ్‌లో పిల్లలు బిజీ. ఇంట్లో పని అయిపోయాక ఖాళీగా ఉన్న రాధిక... ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతో నెట్టింట్లో సెర్చ్ మొదలు పెట్టారు. అప్పుడు తట్టిందే ఈ ఐడియా. నాలుగు నెలల్లోనే చేయి తిరిగిన ఆర్టిస్టుగా మారిపోయారు. ఫిల్లింగ్ పేపర్‌తో కమ్మలు, గొలుసుల వంటివి ఎంతో ఆకర్షణీయంగా, ముచ్చటగా రూపొందించారామె. చూడ్డానికి ఫ్యాన్సీ జ్యువెలరీలా ఉన్న ఈ ఐటెమ్స్ ఖరీదు కూడా తక్కువే. అన్నింటి కంటే ముఖ్యంగా పర్యావరణానికి హాని చేయని ప్రొడక్ట్స్. వీటన్నింటినీ లామకాన్లోని ‘ఆర్గానిక్ బజార్’లో ప్రదర్శనకు ఉంచారు ఆమె. వచ్చిన వారందరూ వీటిని అపురూపంగా చూస్తున్నారు. ‘మనమేం చేయగలమనే కంటే ఆలోచనను ఆసక్తి ఉన్న వైపు మళ్లిస్తే ఇలా పర్యావరణం కోసం అందరూ ఎంతో కొంత చేయవచ్చు’ అనేది రాధిక అభిప్రాయం. -
మట్టివిగ్రహాలు.. ఎక్కడికక్కడే నిమజ్జనాలతో హుస్సేన్‌సాగర్‌కు రక్షణ
వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో గణేశ విగ్రహాలను ఈసారి హైదరాబాద్ నగరంలో నెలకొల్పుతున్నారు. అయితే.. ఈసారి చవితి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా ఈసారి మట్టి విగ్రహాలను నెలకొల్పడం, హుస్సేన్ సాగర్‌లో మరీ ఎక్కువ సంఖ్యలో విగ్రహాల నిమజ్జనాలు చేయకుండా చూడటం లాంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈసారి మట్టి విగ్రహాలను భారీ సంఖ్యలో.. అంటే దాదాపు రెండు లక్షలకు పైగా విగ్రహాలను పంచిపెట్టారు. నగరం నలుమూలలా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వీటి పంపకాలు చేపట్టారు. ప్రతిసారీ వినాయకచవితి వచ్చిందంటే హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాలను భారీ సంఖ్యలో నిమజ్జనం చేస్తుంటారు. వాటితోపాటే పూజా సామగ్రి.. పూలు, అన్నింటినీ సాగర్‌లో వేయడం ప్రతిసారీ జరిగే విషయమే. అయితే.. తర్వాత ఆ వ్యర్థాలను తొలగించడానికి మాత్రం జీహెచ్ఎంసీ వర్గాలకు తలకు మించిన పని అవుతుంటుంది. దీంతో ఈసారి ఉత్సవాల తీరులో చిన్నచిన్న మార్పులను అధికారులు సూచించారు. భారీ స్థాయిలో కూడా మట్టి విగ్రహాలను నెలకొల్పడం, వాటిని అక్కడికక్కడే నిమజ్జనం చేయడం ద్వారా జలవనరులను సంరక్షించడం, ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించడం సాధ్యమన్నది అధికారుల యోచన. విగ్రహాల పరిమాణాన్ని తగ్గించాలని, వాటిని ఇళ్ల దగ్గర్లోనే.. ఇంకా వీలైతే బక్కెట్ నీళ్లలోనే నిమజ్జనం చేయాలని హెచ్ఎండీఏ సభ్యుడు (పర్యావరణం) ఆర్.పి. ఖజూరియా సూచించారు. ఆ నీటిని మొక్కలకు పోస్తే శుభం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. కాలనీల్లోని విగ్రహాలు అన్నింటినీ కలిపి తాత్కాలికంగా చిన్నపాటి చెరువుల్లాంటివి ఏర్పాటుచేసి అక్కడ నిమజ్జనం చేసినా మంచిదేనన్నారు. పాఠశాలలకు కూడా బంక మట్టిని, అచ్చులను పంపిణీ చేశామని, వాటిద్వారా విద్యార్థులు స్వయంగా మట్టి విగ్రహాలు తయారుచేసుకుని ఇళ్లకు తీసుకెళ్లేలా వారిని ప్రోత్సహించామని అధికారులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ లేక్ క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు.. ఇలా అన్ని వర్గాల సాయంతో మట్టి విగ్రహాలు, ఎక్కడికక్కడ నిమజ్జనం లాంటివాటిని ప్రచారం చేయడం వల్ల ఈసారి హుస్సేన్ సాగర్ మీద భారం తగ్గుతుందనే భావిస్తున్నారు.