వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో గణేశ విగ్రహాలను ఈసారి హైదరాబాద్ నగరంలో నెలకొల్పుతున్నారు. అయితే.. ఈసారి చవితి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా ఈసారి మట్టి విగ్రహాలను నెలకొల్పడం, హుస్సేన్ సాగర్లో మరీ ఎక్కువ సంఖ్యలో విగ్రహాల నిమజ్జనాలు చేయకుండా చూడటం లాంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈసారి మట్టి విగ్రహాలను భారీ సంఖ్యలో.. అంటే దాదాపు రెండు లక్షలకు పైగా విగ్రహాలను పంచిపెట్టారు. నగరం నలుమూలలా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వీటి పంపకాలు చేపట్టారు.
ప్రతిసారీ వినాయకచవితి వచ్చిందంటే హుస్సేన్సాగర్లో విగ్రహాలను భారీ సంఖ్యలో నిమజ్జనం చేస్తుంటారు. వాటితోపాటే పూజా సామగ్రి.. పూలు, అన్నింటినీ సాగర్లో వేయడం ప్రతిసారీ జరిగే విషయమే. అయితే.. తర్వాత ఆ వ్యర్థాలను తొలగించడానికి మాత్రం జీహెచ్ఎంసీ వర్గాలకు తలకు మించిన పని అవుతుంటుంది. దీంతో ఈసారి ఉత్సవాల తీరులో చిన్నచిన్న మార్పులను అధికారులు సూచించారు. భారీ స్థాయిలో కూడా మట్టి విగ్రహాలను నెలకొల్పడం, వాటిని అక్కడికక్కడే నిమజ్జనం చేయడం ద్వారా జలవనరులను సంరక్షించడం, ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించడం సాధ్యమన్నది అధికారుల యోచన. విగ్రహాల పరిమాణాన్ని తగ్గించాలని, వాటిని ఇళ్ల దగ్గర్లోనే.. ఇంకా వీలైతే బక్కెట్ నీళ్లలోనే నిమజ్జనం చేయాలని హెచ్ఎండీఏ సభ్యుడు (పర్యావరణం) ఆర్.పి. ఖజూరియా సూచించారు. ఆ నీటిని మొక్కలకు పోస్తే శుభం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. కాలనీల్లోని విగ్రహాలు అన్నింటినీ కలిపి తాత్కాలికంగా చిన్నపాటి చెరువుల్లాంటివి ఏర్పాటుచేసి అక్కడ నిమజ్జనం చేసినా మంచిదేనన్నారు.
పాఠశాలలకు కూడా బంక మట్టిని, అచ్చులను పంపిణీ చేశామని, వాటిద్వారా విద్యార్థులు స్వయంగా మట్టి విగ్రహాలు తయారుచేసుకుని ఇళ్లకు తీసుకెళ్లేలా వారిని ప్రోత్సహించామని అధికారులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ లేక్ క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు.. ఇలా అన్ని వర్గాల సాయంతో మట్టి విగ్రహాలు, ఎక్కడికక్కడ నిమజ్జనం లాంటివాటిని ప్రచారం చేయడం వల్ల ఈసారి హుస్సేన్ సాగర్ మీద భారం తగ్గుతుందనే భావిస్తున్నారు.
మట్టివిగ్రహాలు.. ఎక్కడికక్కడే నిమజ్జనాలతో హుస్సేన్సాగర్కు రక్షణ
Published Mon, Sep 9 2013 1:11 PM | Last Updated on Fri, Sep 1 2017 10:35 PM
Advertisement