రాజధానిలో అంగరంగ వైభవంగా జరిగే గణేశ్ ఉత్సవాల్లో తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. బుధవారం జరగనున్న సామూహిక ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఘట్టం ఆలస్యం కాకుండా గతం కంటే వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు పది లక్షల మంది పాల్గొనే ప్రధాన ఊరేగింపు కోసం పోలీసులు నగరవ్యాప్తంగా 15 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 66 చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
భక్తుల కోసం ఆర్టీసీ 360 స్పెషల్ బస్సులను, దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది భాగ్యనగరంలో సుమారు 50 వేల విగ్రహాలు ప్రతిష్టించగా మంగళవారం నాటికి 15 వేలకుపైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారుల అంచనా. మిగతా విగ్రహాలను క్రమపద్ధతిలో నిమజ్జనం చేయించేందుకు అధికారులు మైత్రీ సంఘాల సమన్వయంతో కృషి చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా నగరవ్యాప్తంగా 21 జలాశయాల వద్ద 71 క్రేన్లను ఏర్పాటు చేశారు.
హుస్సేన్‌సాగర్ వద్ద గత ఏడాది 25 క్రేన్లను ఏర్పాటు చేయగా... ఈసారి 40 సిద్ధం చేశారు. వీటితోపాటు పోలీసుస్టేషన్ల వారీగా మరో 70 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంటాయి. వీటిని విగ్రహాలను లారీల్లోకి ఎక్కించడానికి వాడనున్నారు. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు పెద్దఎత్తున హ్యాండ్‌హెల్డ్ కెమెరాల్నీ వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు కేంద్రం, రాష్ట్ర సాయుధ బలగాలనూ మోహరిస్తున్నారు. కీలక ప్రాంతమైన ట్యాంక్‌బండ్‌కు అదనపు పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. నిమజ్జనం గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని భావిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని రోటేషన్ పద్ధతిలో మోహరించనున్నారు. రద్దీ, పరిస్థితులను బట్టి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎప్పుడనేది నిర్ణయించనున్నారు.