idols immersion
-
సిటీలో 17నే నిమజ్జనం.. ఆరోజే కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలు: సీపీ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17వ తేదీన తెలంగాణలో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ జరుగనుంది. ఈనేపథ్యంలో నిమజ్జనాలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరలోపే నిమజ్జనం జరుగుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఇదే సమయంలో నిమజ్జనాల కోసం హైదరాబాద్‌లో రూట్స్ పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.కాగా, సీపీ సీవీ ఆనంద్ శనివారం నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ..విగ్రహాల కోసం అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. బాలాపూర్ గణేషుడి కోసం రూట్ పరిశీలిస్తున్నాం. చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్లు అన్నీ పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లను తొలగించారు.నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పెండింగ్ పనులు అన్ని ఈరోజు పూర్తవుతాయి. నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. 15వేల సిటీ పోలీసులు, 10వేల మంది డీజీపీ, జిల్లాల నుండి పోలీసులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రై కమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశాం. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 1.30లోపు అవుతుంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకే పూజలు అన్నీ పూర్తి చేసుకుని విగ్రహాన్ని తరలిస్తాం. విగ్రహా నిమజ్జనం కోసం క్రెయిన్‌ను తరలించనున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అలాగే, సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వపరంగా పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుంది. బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో మరో కార్యక్రమం జరుగుతుంది. ఇక, ఎంఐఎం ఆధ్వర్యంలో సౌత్ జోన్లో ర్యాలీ కొనసాగనుంది. పలు కార్యక్రమాలు, ర్యాలీలు, నిమజ్జనాల కోసం బందోబస్తు ఏర్పాటు చేశాం. అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం: అమ్రపాలి -
ఇదే చివరిసారి.. గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అదికూడా ఈ ఏడాది నిమజ్జనానికే అను మతి ఇస్తున్నామని స్పష్టంచేసింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన వేడుకలకు ఇదే చివరి అవకాశమని, ఇది పునరావృతం కారాదని తేల్చిచెప్పింది. హుస్సేన్‌సాగర్, చిన్నచిన్న ఇతరత్రా చెరువుల్లో పీఓపీతో చేసిన వినాయక ప్రతిమల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ధర్మాసనంలో జస్టిస్ హిమాకోహ్లి ఉన్నప్పటికీ గతంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ అంశంలో ఆదేశాలు ఇచ్చిన కారణంగా ఈ కేసు విచారణలో భాగస్వామ్యం కాలేనని చెప్పారు. చదవండి: 2nd ICT Policy: ఐదు అంశాలు.. పన్నెండు రంగాలు తరచూ ఈ సమస్య వస్తోంది... తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. గణేశ్ విగ్రహాల నిమజ్జనం వల్ల పర్యావరణ కాలుష్యం కానీయబోమని చెప్పారు. ప్రతిమ నిమజ్జనం ఒక క్రేన్‌తో చేస్తామని, వెంటనే మరో క్రేన్‌తో వాటిని బయటకు తీసి ఘనవ్యర్థాల నిర్వహణ నిమిత్తం తరలించి రీసైక్లింగ్ చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయబోమని నివేదించారు. ‘‘దురదృష్టవశాత్తు ఈ సమస్య హైదరాబాద్‌లో తరచూ వస్తూ ఉంటుంది. కోర్టు అనేక మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అన్నింటినీ పాటించడం లేదు. ఏటా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం నిర్వహిస్తున్నారు. అది కాలుష్యానికి కారణమవుతోంది. సొలిసిటర్ జనరల్ వాదనలు పరిగణనలోకి తీసుకుంటే పీవోపీ ప్రతిమల నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం అయిన వెంటనే విగ్రహాలను తీసేస్తామని అంటున్నారు. ఈ దిశగా నిమజ్జనం రోజున కార్యక్రమాలపై హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఇదే చివరి అవకాశం’అని ధర్మాసనం పేర్కొంది. పీఓపీ విగ్రహాల తయారీపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చదవండి: మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు చివరి నిమిషంలో వస్తారు.. ‘హుస్సేన్‌సాగర్ పరిశుభ్రతకు ఏటా ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్న విషయం మీకు (తుషార్ మెహతా) తెలియదు. ఏటా నిమజ్జనానికి అనుమతినిస్తే సుందరీకరణ కోసం వెచ్చించడం ఎందుకు? దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. చివరి నిమిషంలో వస్తారు. అసలు ఏం జరుగుతోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఇకపై సమర్థవంతంగా ప్రణాళిక చేపడతామని అఫిడవిట్లో హామీ ఇచ్చామని, వేడుకల మధ్య తలెత్తిన సమస్యలకు ఓ పరిష్కారం గుర్తించామని తుషార్ మెహతా తెలిపారు. ఈ సమయంలో హైకోర్టులో పిటిషన్‌దారు వేణుమాధవ్ అభిప్రాయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ అడిగారు. 2005 నుంచి పిటిషన్లు వేసుకుంటూ వస్తున్నానని వేణుమాధవ్ తెలిపారు. ‘క్రమశిక్షణ, ప్రజల మద్దతు ఎంతో అవసరం. లక్షలాది మంది ప్రజలు వచ్చినప్పుడు ఈ సరస్సుకు వెళ్లు ఆ సరస్సుకి వెళ్లు అని చెప్పడం సాధ్యమేనా? ప్రజలు వారంతట వారే వస్తారు. భారీ ప్రతిమలు అనుమతించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పీవోపీ నిషేధానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తిగా లేం. చివరి నిమిషంలో అసాధ్యమైన వాటిని అమలు చేయాలని మేం ఆదేశించలేం. ఈ ఏడాదికి మాత్రం అనుమతి ఇస్తున్నాం. వచ్చే ఏడాది తప్పకుండా కోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి’అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఫిర్యాదులోని ఇతరత్రా అంశాల్లో జోక్యం చేసుకోబోమని వాటిని హైకోర్టు పరిష్కరిస్తుందన్నారు. -
గంగ ఒడికి.. గౌరీ తనయుడు
సాక్షి, హైదరాబాద్: మహానగర దారులన్నీ భక్తజనసంద్రమయ్యాయి. గల్లీలన్నీ జైగణేష నినాదాలతోహోరెత్తిపోయాయి. కోలాటాలు, కీర్తనలు, నృత్యాల నడుమ గణపయ్యలను గంగ ఒడికి సాగనంపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గణేషుడినిఉంచి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు హుస్సేన్ సాగర్ తీరానికి తరలివచ్చారు. పలు చోట్ల లడ్డూప్రసాదాన్ని సొంతం చేసుకునేందుకు భారీఎత్తున పోటీ పడ్డారు. ఆదివారం ఉదయమే ప్రారంభమైన శోభాయాత్ర, నిమజ్జనక్రతువులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మూడు కమిషనరేట్లలో సుమారు ఇరవై వేల సీసీకెమెరాలను డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించగా, కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, వీసీ సజ్జన్నార్ పాలుపంచుకున్నారు. సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, కమిషనర్లు దానకిషోర్, అంజనీకుమార్ ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఏరియల్ వ్యూ చేసి పరిస్థితిని సమీక్షించారు. ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర ఉదయం 7:05 గం.కే ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:50గం.కు హుస్సేన్‌సాగర్‌లోని ఆరవ నంబర్ క్రేన్ వద్దకు చేరుకోగా.. ప్రత్యేక క్రేను సాయంతో నిమజ్జనాన్ని పూర్తిచేశారు. ఖైరతాబాద్ గణేషుడి చరిత్రలో ఇంత త్వరగా నిమజ్జనం చేయటం ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెప్పారు. బాలాపూర్ లడ్డూరూ.16.60 లక్షలకు శ్రీనివాసగుప్తా, ఫిలింనగర్ శివాజీనగర్ లడ్డూ రూ.15 లక్షలకు తన్నీరు రాములు, కూకట్పల్లి హౌజింగ్ బోర్డు సర్దార్ పటేల్ నగర్లో రూ.11.76 లక్షలకు పీవీ రమణారెడ్డిలు దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని శ్రీనివాస గుప్తా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ వినాయకుని లడ్డూను వేలంలో రూ. 16లక్షల 1001లకు చేవెళ్లకు చెందిన ఆగిరెడ్డి డీవీఆర్ గ్రూపు సభ్యులు దక్కించుకున్నారు. -
ఘనంగా దేవీ నిమజ్జనం
మహబూబాబాద్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవార్ల నిమజ్జనం సందర్భంగా బుధవారం రాత్రి అమ్మవార్ల ఊరేగింపులు ఆయా ఉత్సవకమిటీల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వాసవి సేవా ట్రస్ట్ మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవీశరన్నవరాత్సోవాల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాతను భద్రాచలంలోని గోదావరినదిలో గురువారం ఉదయం నిమజ్జనం చేశారు. అనంతరం భక్తులు సీతారామచంద్రస్వామివారి దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహణాధికారి ఒబిలిశెట్టి రామకృష్ణ, కొత్త సోమన్న, సోమ శ్రీనివాస్, కందిమల్ల జగత్, నర్సింహస్వామి, కల్పన, మౌనిక, ఉమారాణి, రమాదేవి, అఖిల్, సురేష్, ఒబిలిశెట్టి రవికుమార్, గోపురాము, నాగమల్ల నరేష్, మారెపల్లి కౌశిక్, శివనాథుల శ్రీనివాస్, వెలిశాల భద్రీనాథ్ పాల్గొన్నారు. -
బైబై గణేషా
ఘట్కేసర్ టౌన్: మండలంలోని ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువువద్ద ఆదివారం వినాయక విగ్రహాల నిమజ్జనం జోరుగా కొనసాగింది. సమీప గ్రామాలతో పాటు నగరశివారులోని పలు కాలనీల్లో ప్రతిష్ఠించిన స్వామివారి ప్రతిమలను ట్రాలీలు, ఆటోలు, డీసీఎంలు, కార్లు తదితర వాహనాల్లో ఒక్కడకు తెచ్చి నిమజ్జనం చేశారు. బ్యాండ్ మేళాలతో నృత్యం చేస్తూ గణేషుడికి వీడ్కోలు పలికారు. విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి.. చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న పులిహోరా, ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ ప్రకాష్, సర్పంచ్ మూసీ శంకరన్న తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
నేడే గణేశ నిమజ్జనం
రాజధానిలో అంగరంగ వైభవంగా జరిగే గణేశ్ ఉత్సవాల్లో తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. బుధవారం జరగనున్న సామూహిక ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ఘట్టం ఆలస్యం కాకుండా గతం కంటే వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాదాపు పది లక్షల మంది పాల్గొనే ప్రధాన ఊరేగింపు కోసం పోలీసులు నగరవ్యాప్తంగా 15 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 66 చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల కోసం ఆర్టీసీ 360 స్పెషల్ బస్సులను, దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది ఎంఎంటీఎస్ రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది భాగ్యనగరంలో సుమారు 50 వేల విగ్రహాలు ప్రతిష్టించగా మంగళవారం నాటికి 15 వేలకుపైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారుల అంచనా. మిగతా విగ్రహాలను క్రమపద్ధతిలో నిమజ్జనం చేయించేందుకు అధికారులు మైత్రీ సంఘాల సమన్వయంతో కృషి చేస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా నగరవ్యాప్తంగా 21 జలాశయాల వద్ద 71 క్రేన్లను ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ వద్ద గత ఏడాది 25 క్రేన్లను ఏర్పాటు చేయగా... ఈసారి 40 సిద్ధం చేశారు. వీటితోపాటు పోలీసుస్టేషన్ల వారీగా మరో 70 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంటాయి. వీటిని విగ్రహాలను లారీల్లోకి ఎక్కించడానికి వాడనున్నారు. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు పెద్దఎత్తున హ్యాండ్‌హెల్డ్ కెమెరాల్నీ వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు కేంద్రం, రాష్ట్ర సాయుధ బలగాలనూ మోహరిస్తున్నారు. కీలక ప్రాంతమైన ట్యాంక్‌బండ్‌కు అదనపు పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. నిమజ్జనం గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని భావిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని రోటేషన్ పద్ధతిలో మోహరించనున్నారు. రద్దీ, పరిస్థితులను బట్టి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎప్పుడనేది నిర్ణయించనున్నారు. -
నిమజ్జనం సందర్భంగా 18న సెలవు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు వర్తింపు 18కి బదులుగా నవంబర్ 9 రెండో శనివారం పనిదినం హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 18న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. 18వ తేదీ సెలవుకు బదులుగా నవంబర్ 9వ తేదీ రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన ఫైలును సాధారణ పరిపాలన శాఖ సోమవారం ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది. మంగళవారం దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. అక్టోబర్ నెల రెండో శనివారం దుర్గాష్టమి పండుగ కావడంతో నవంబర్ నెల రెండో శనివారాన్ని సాధారణ పరిపాలన శాఖ పనిదినంగా ప్రతిపాదించింది. 18న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు ఈ సెలవు వర్తించనుంది. నిమజ్జనం భద్రతపై డీజీపీ సమీక్ష జంటనగరాల్లో బుధవారం వినాయక నిమజ్జనం నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ వి.దినేష్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా భద్రతాచర్యలపై పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టు నేపథ్యంలో విధ్వంసాలు చోటుచేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ ఆదేశించారు. గణేష్ మండపాల పరిసరాలలో నిఘా పెంచాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణతోపాటు పారా మిలటరీ బలగాల మోహరించాలని నిర్ణయించారు.