
సాక్షి, హైదరాబాద్: మహానగర దారులన్నీ భక్తజనసంద్రమయ్యాయి. గల్లీలన్నీ జైగణేష నినాదాలతోహోరెత్తిపోయాయి. కోలాటాలు, కీర్తనలు, నృత్యాల నడుమ గణపయ్యలను గంగ ఒడికి సాగనంపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గణేషుడినిఉంచి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు హుస్సేన్ సాగర్ తీరానికి తరలివచ్చారు. పలు చోట్ల లడ్డూప్రసాదాన్ని సొంతం చేసుకునేందుకు భారీఎత్తున పోటీ పడ్డారు. ఆదివారం ఉదయమే ప్రారంభమైన శోభాయాత్ర, నిమజ్జనక్రతువులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మూడు కమిషనరేట్లలో సుమారు ఇరవై వేల సీసీకెమెరాలను డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించగా, కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, వీసీ సజ్జన్నార్ పాలుపంచుకున్నారు. సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, కమిషనర్లు దానకిషోర్, అంజనీకుమార్ ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఏరియల్ వ్యూ చేసి పరిస్థితిని సమీక్షించారు.
ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర ఉదయం 7:05 గం.కే ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:50గం.కు హుస్సేన్‌సాగర్‌లోని ఆరవ నంబర్ క్రేన్ వద్దకు చేరుకోగా.. ప్రత్యేక క్రేను సాయంతో నిమజ్జనాన్ని పూర్తిచేశారు. ఖైరతాబాద్ గణేషుడి చరిత్రలో ఇంత త్వరగా నిమజ్జనం చేయటం ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెప్పారు. బాలాపూర్ లడ్డూరూ.16.60 లక్షలకు శ్రీనివాసగుప్తా, ఫిలింనగర్ శివాజీనగర్ లడ్డూ రూ.15 లక్షలకు తన్నీరు రాములు, కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు సర్దార్ పటేల్ నగర్‌లో రూ.11.76 లక్షలకు పీవీ రమణారెడ్డిలు దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని శ్రీనివాస గుప్తా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ వినాయకుని లడ్డూను వేలంలో రూ. 16లక్షల 1001లకు చేవెళ్లకు చెందిన ఆగిరెడ్డి డీవీఆర్ గ్రూపు సభ్యులు దక్కించుకున్నారు.