సాక్షి, హైదరాబాద్: ఈనెల 17వ తేదీన తెలంగాణలో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ జరుగనుంది. ఈనేపథ్యంలో నిమజ్జనాలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరలోపే నిమజ్జనం జరుగుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఇదే సమయంలో నిమజ్జనాల కోసం హైదరాబాద్‌లో రూట్స్ పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
కాగా, సీపీ సీవీ ఆనంద్ శనివారం నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ..విగ్రహాల కోసం అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. బాలాపూర్ గణేషుడి కోసం రూట్ పరిశీలిస్తున్నాం. చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్‌లు అన్నీ పరిశీలిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లను తొలగించారు.
నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పెండింగ్ పనులు అన్ని ఈరోజు పూర్తవుతాయి. నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. 15వేల సిటీ పోలీసులు, 10వేల మంది డీజీపీ, జిల్లాల నుండి పోలీసులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రై కమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశాం. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 1.30లోపు అవుతుంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకే పూజలు అన్నీ పూర్తి చేసుకుని విగ్రహాన్ని తరలిస్తాం. విగ్రహా నిమజ్జనం కోసం క్రెయిన్‌ను తరలించనున్నారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అలాగే, సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వపరంగా పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుంది. బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో మరో కార్యక్రమం జరుగుతుంది. ఇక, ఎంఐఎం ఆధ్వర్యంలో సౌత్ జోన్‌లో ర్యాలీ కొనసాగనుంది. పలు కార్యక్రమాలు, ర్యాలీలు, నిమజ్జనాల కోసం బందోబస్తు ఏర్పాటు చేశాం. అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం: అమ్రపాలి
Comments
Please login to add a commentAdd a comment