Immersion of Khairatabad Ganesh Idol Turns in to a Challenge- Sakshi
Sakshi News home page

నాడు 15 రోజులపాటు వాహనంపైనే ఖైరతాబాద్‌ గణేషుడు.. కారణం ఇదే!

Published Wed, Sep 15 2021 4:50 PM | Last Updated on Thu, Sep 16 2021 11:37 AM

Immersion of Khairatabad Ganesh Idol Turns a Challenge - Sakshi

2021 : 40 అడుగులు, 1986: ట్యాంక్‌బండ్‌పై నిలిచిపోయిన ఖైరతాబాద్‌ వినాయకుడు 

సాక్షి, ఖైరతాబాద్‌: ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌తోపాటు చెరువుల్లో నిమజ్జనం చేయనివ్వొద్దని హైకోర్టు సూచనలు చేసిన నేపథ్యంలో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా వినాయకుడు కొలువుదీరాడు. ప్రతి ఏటా మహాగణపతిని అత్యంత వైభవంగా..హంగూ ఆర్భాటాలతో ఖైరతాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌కు తరలించి అక్కడే నిమజ్జనం చేస్తున్నారు.

పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన క్రేన్లు 

వేలాది మంది భక్తులు పాల్గొనే నిమజ్జన శోభార్యాలీ మొత్తం గణేష్‌ ఉత్సవాల్లోనే హైలెట్‌గా నిలుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులతోపాటు అధికారులు, పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపడుతుంది. అయితే..ఈసారి నిమజ్జనంపై కోర్టు సూచనల నేపథ్యంలో అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అసలు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తారా..లేకుంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాట్లు చేస్తారనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.  

సాగర్‌లోనే నిమజ్జనం: ఉత్సవ కమిటీ 
ఈసారి కూడా మహాగణపతి నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే జరగాలని, 66 సంవత్సరాలుగా ఇది సంప్రదాయంగా కొనసాగుతోందని ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఒక వేళ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతివ్వకుంటే, ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మహాగణపతి విగ్రహాన్ని ఇక్కడే ఉంచుతామని పేర్కొన్నారు.  

1986లో ఇలా... 
1986లో 20 అడుగుల ఎత్తులో తయారుచేసిన వినాయకుడిని సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు ట్యాంక్‌బండ్‌పైకి వెళ్లగా అక్కడ తగిన సౌకర్యాలు కల్పించ లేదు. దీంతో 15 రోజుల పాటు వినాయకుడ్ని అక్కడే వాహనంపైనే ఉంచారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక  క్రేన్‌ ఏర్పాటు చేయడంతో  విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. 

తలసానికి విన్నపం 
అఫ్జల్‌గంజ్‌: హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విధించిన ఆంక్షల నేపథ్యంలో మంగళవారం భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి చర్చించారు. గణేష్‌ విగ్రహాల సామూహిక నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో జరిపేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షులు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ భగవంత్‌రావు, ఉపాధ్యక్షులు కరోడీమాల్, కోశాధికారి శ్రీరామ్‌వ్యాస్, రామరాజు, కార్యదర్శులు మహేందర్, శశి, ఆలె భాస్కర్, రూప్‌రాజ్‌ తదితరులు ఉన్నారు. 

అంబారీపై ఊరేగింపు..

వచ్చేసారి 70 అడుగుల మట్టి వినాయకుడు 
వచ్చే సంవత్సరం..2022లో ఖైరతాబాద్‌ మహాగణపతిని మట్టితో 70 అడుగుల ఎత్తులో తయారుచేస్తాం. ఈ భారీ వినాయకుడిని ఉన్నచోటే నిమజ్జనం చేస్తాం. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని..ఖైరతాబాద్‌ మహాగణపతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.  
– సింగరి సుదర్శన్, ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ 

1954 : ఒక అడుగు

వేరేచోట కష్టమే... 
40 అడుగుల ఎత్తులో ఉన్న భారీ వినాయకుడిని హుస్సేన్‌సాగర్‌లో కాకుండా వేరేచోట నిమజ్జనం చేయడం కష్టమేనని నిపుణులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. మహాగణపతిని నిమజ్జనం చేసేంత విశాలమైన, లోతైన కొలనులు సమీపంలో ఎక్కడా లేవు. ఒకవేళ అంతపెద్ద పాండ్‌ను రూపొందించాలన్నా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అంత సమయమూ లేదు. మరోవైపు మహాగణపతి విగ్రహం మరో ప్రాంతానికి తీసుకెళ్లాలంటే రహదారిలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి. ఫ్లై ఓవర్లు, మెట్రో మార్గంలో పిల్లర్లు, విద్యుత్‌ కేబుళ్లు దాటుకుంటూ తరలించడం అసాధ్యం. ఇది చాలా ఇబ్బందులతో కూడుకున్న పనిగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మహాగణపతి నిమజ్జనం ఎక్కడ, ఎలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో నెలకొంది.  

గణేష్‌ మండపాల డిమాండ్‌ మేరకు వాహనాలు 
సాక్షి, సిటీబ్యూరో: వినాయక నిమజ్జన ఉత్సవాలపై రవాణాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న నిమజ్జనం కోసం ప్రస్తుతం వెయ్యి భారీ వాహనాలను సిద్ధం చేసినట్లు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌  పాండురంగ నాయక్‌ తెలిపారు. గణేష్‌ మండపాల డిమాండ్‌ మేరకు అవసరమైన వివిధ రకాల  వాహనాలను అందుబాటులో ఉంచనున్నట్లు  పేర్కొన్నారు. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సూచన మేరకు నగరంలోని ప్రధాన మండపాల నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు భారీ ట్రాలీ వాహనాలు మొదలుకొని టాటాఏస్‌ వంటి చిన్న వాహనాల వరకు అందజేయనున్నారు. నిమజ్జన వాహనాల కోసం వచ్చే మండపాల నిర్వాహకులకు నగరంలోని 12 చోట్ల  వాహనాలను సిద్ధంగా ఉంచుతారు.

►  నెక్లెస్‌రోడ్డు. మేడ్చల్, టోలీచౌకి, జూపార్కు, మలక్‌పేట్, కర్మన్‌ఘాట్, నాగోల్, గచ్చిబౌలి, మన్నెగూడ, పటాన్‌చెరు, ఆటోనగర్‌ నుంచి వాహనాలను తీసుకోవచ్చు. 
►  19వ తేదీన నిమజ్జనంజరుగనున్న దృష్ట్యా మండపాల నిర్వాహకులు 18వ తేదీనే  వాహనాలను తీసుకెళ్లవచ్చు.  
►  మరోవైపు వాహనాలను అందజేసేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాంతీయ రవాణా అధికారుల నేతృత్వంలో  ప్రత్యేక  బృందాలను  ఏర్పాటు చేసినట్లు జేటీసీ  వెల్లడించారు.  

వాహనాల అద్దె.. 
►  నిమజ్జనానికి తరలి వచ్చే వాహనాల అద్దెలను సైతం అధికారులు ఖరారు చేశారు.  
►  భారీ ట్రాలీ లేదా టస్కర్‌లకు  రూ.20 వేలు. (డీజిల్‌ ఖర్చు, డ్రైవర్‌ బత్తాతో కలిపి) 
►  10 నుంచి 12 టైర్ల  సామర్ధ్యం ఉన్న హెవీగూడ్స్‌ వెహికల్స్‌కు రూ. రూ.4000. డీజిల్‌ ఖర్చు, డ్రైవర్‌కు రూ.500 బత్తా అదనం. 
►  6 టైర్ల సామర్ధ్యం కలిగిన  లారీలకు  రూ.2500,  
►  మిడిల్‌ గూడ్స్‌ వెహికల్స్‌కు రూ.1600,   
►   డీసీఎం వంటి లైట్‌గూడ్స్‌ వెహికల్స్‌కు రూ.1300,  
►  టాటాఏసీలకు రూ.1000 చొప్పున  అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.  
►   వీటితో పాటు ప్రతి వాహనం డ్రైవర్‌కు బత్తా తప్పనిసరిగా ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement