Clay idols
-
కీలక నిర్ణయం: మట్టితోనే ఖైరతాబాద్ మహాగణపతి
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని మట్టితోనే 50 అడుగుల మేర రూపొందించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్, కన్వీనర్ సందీప్ రాజ్, ఆర్గనైజర్ సింగరి రాజ్‌కుమార్, వైస్ ప్రసిడెంట్ మహేష్‌యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా ఖైరతాబాద్ మండపం వద్ద కర్ర పూజ నిర్వహించారు. మట్టి మహాగణపతి నిమజ్జనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చని, ఆ సమయంలో నిరాటంకంగా 4 గంటల పాటు వర్షం వచ్చినా ఎలాంటి సమస్య ఉండదని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. (క్లిక్: నిఘా నీడలో కేబీఆర్ పార్క్ వాక్‌వే..) గణేశ్ ఉత్సవాలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోండి వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు కోరారు. విగ్రహాలు పెద్దగా తయారు చేయవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గణేశ్ విగ్రహాల తయారీదారులను వేధిస్తున్నారన్నారు. ఏడాది పొడవునా కేవలం విగ్రహాల తయారీపైనే ఆధారపడి జీవిస్తారని, అలాంటి వారిపై వేధింపులకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు కరోడిని మాలి, కార్యదర్శులు బుచ్చిరెడ్డి, మహేందర్, శశిధర్ తదితరులు మాట్లాడారు. పదేళ్లుగా గణేశ్ ఉత్సవాలపై వివాదం సృష్టిస్తున్నారని, హిందూ పండుగలను అణచివేస్తే సహించబోమని హెచ్చరించారు. ఉత్సవాలు ఎలా జరుపుకోవాలనే విషయమై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రభుత్వం ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నిమజ్జనం చేయనీయడం లేదని తెలిపారు. దీనిపై తాము కోర్టు ధిక్కరణ కేసు వేశామని, కానీ ప్రభుత్వం కోర్టుకు హాజరుకావడం లేదని చెప్పారు. ఈనెల 24న మరోమారు కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించాలని కోరారు. (క్లిక్: కరోనా కథ అయిపోలేదు.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్) -
లాక్డౌన్ వేళ.. ఏఈఓ హోంవర్క్
సాక్షి, నర్సాపూర్ : లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో సైతం పలువురు అధికారులు తమదైన రీతిలో ఆఫీస్ పనులు చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్‌గౌడ్ శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి మట్టి నమూనాలు సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని వెంకటాపూర్(ఆర్) గ్రామం పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడంతో గ్రామంలో సేకరించిన మట్టి నమూనాలను సేకరించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉన్న ఏఈఓ ప్యాకెట్లలో రైతుల పేర్లు, సర్వే నంబర్ ఇతర వివరాలను చీటిపై రాసి సేకరించిన మట్టిని ప్యాకెట్లలో భద్రపరిచారు. సేకరించిన మట్టి నమూనాలను ల్యాబ్‌కు పంపించనున్నట్లు ఈ మేరకు ఆయన పేర్కొన్నారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయడంవల్ల ఖర్చు తగ్గుతుందని సూచనలు చేశారు. (లాక్డౌన్ : విషం పెట్టి కోతులను చంపారు) -
మట్టి విగ్రహాలను పూజించాలని ఇంటింటా ప్రచారం
నంగునూరు:వినాయకుని మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారం నిర్వహిస్తూ తండా విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏటా మట్టి విగ్రహాలను తయారు చేసి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. బద్దిపడగ మధిర జేపి తండా పాఠశాల హెచ్ఎం సంగు రామకృష్ణ సూచనల మేరకు స్కూల్ విద్యార్థులు ఏటా మట్టి వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తూ అక్కడే ప్రతిష్ఠించడం ఆనవాయితీగా మారింది. తాజాగా పాఠశాల విద్యార్థులు బానోత్ అరుణ్, మాలోత్ రాంచరణ్, లౌడ్య చరణ్, బుక్యా అంజలి, బానోత్ అరుణ చెరువులో నుంచి మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో సోమవారం మట్టి వినాయకుని విగ్రహాన్ని నెలకొల్పి నవరాత్రులు ముగియగానే నిమజ్జనం చేస్తామన్నారు. రంగురంగుల విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి చెరువులో నిమజ్జనం చేయడం వలన నీరంతా కలుషితం కావడమే కాక, మట్టితో చెరువు పూడుకుపోతుందన్నారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
మట్టివిగ్రహాలు.. ఎక్కడికక్కడే నిమజ్జనాలతో హుస్సేన్‌సాగర్‌కు రక్షణ
వినాయక చవితి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో గణేశ విగ్రహాలను ఈసారి హైదరాబాద్ నగరంలో నెలకొల్పుతున్నారు. అయితే.. ఈసారి చవితి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా ఈసారి మట్టి విగ్రహాలను నెలకొల్పడం, హుస్సేన్ సాగర్‌లో మరీ ఎక్కువ సంఖ్యలో విగ్రహాల నిమజ్జనాలు చేయకుండా చూడటం లాంటి చర్యల ద్వారా పర్యావరణాన్ని కాపాడే చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈసారి మట్టి విగ్రహాలను భారీ సంఖ్యలో.. అంటే దాదాపు రెండు లక్షలకు పైగా విగ్రహాలను పంచిపెట్టారు. నగరం నలుమూలలా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వీటి పంపకాలు చేపట్టారు. ప్రతిసారీ వినాయకచవితి వచ్చిందంటే హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాలను భారీ సంఖ్యలో నిమజ్జనం చేస్తుంటారు. వాటితోపాటే పూజా సామగ్రి.. పూలు, అన్నింటినీ సాగర్‌లో వేయడం ప్రతిసారీ జరిగే విషయమే. అయితే.. తర్వాత ఆ వ్యర్థాలను తొలగించడానికి మాత్రం జీహెచ్ఎంసీ వర్గాలకు తలకు మించిన పని అవుతుంటుంది. దీంతో ఈసారి ఉత్సవాల తీరులో చిన్నచిన్న మార్పులను అధికారులు సూచించారు. భారీ స్థాయిలో కూడా మట్టి విగ్రహాలను నెలకొల్పడం, వాటిని అక్కడికక్కడే నిమజ్జనం చేయడం ద్వారా జలవనరులను సంరక్షించడం, ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరించడం సాధ్యమన్నది అధికారుల యోచన. విగ్రహాల పరిమాణాన్ని తగ్గించాలని, వాటిని ఇళ్ల దగ్గర్లోనే.. ఇంకా వీలైతే బక్కెట్ నీళ్లలోనే నిమజ్జనం చేయాలని హెచ్ఎండీఏ సభ్యుడు (పర్యావరణం) ఆర్.పి. ఖజూరియా సూచించారు. ఆ నీటిని మొక్కలకు పోస్తే శుభం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. కాలనీల్లోని విగ్రహాలు అన్నింటినీ కలిపి తాత్కాలికంగా చిన్నపాటి చెరువుల్లాంటివి ఏర్పాటుచేసి అక్కడ నిమజ్జనం చేసినా మంచిదేనన్నారు. పాఠశాలలకు కూడా బంక మట్టిని, అచ్చులను పంపిణీ చేశామని, వాటిద్వారా విద్యార్థులు స్వయంగా మట్టి విగ్రహాలు తయారుచేసుకుని ఇళ్లకు తీసుకెళ్లేలా వారిని ప్రోత్సహించామని అధికారులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ లేక్ క్లబ్బులు, పాఠశాలలు, కళాశాలలు.. ఇలా అన్ని వర్గాల సాయంతో మట్టి విగ్రహాలు, ఎక్కడికక్కడ నిమజ్జనం లాంటివాటిని ప్రచారం చేయడం వల్ల ఈసారి హుస్సేన్ సాగర్ మీద భారం తగ్గుతుందనే భావిస్తున్నారు.