మట్టి విగ్రహాలను పూజించాలని ఇంటింటా ప్రచారం
నంగునూరు:వినాయకుని మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారం నిర్వహిస్తూ తండా విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏటా మట్టి విగ్రహాలను తయారు చేసి తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. బద్దిపడగ మధిర జేపి తండా పాఠశాల హెచ్‌ఎం సంగు రామకృష్ణ సూచనల మేరకు స్కూల్ విద్యార్థులు ఏటా మట్టి వినాయకుని విగ్రహాన్ని తయారు చేస్తూ అక్కడే ప్రతిష్ఠించడం ఆనవాయితీగా మారింది.
తాజాగా పాఠశాల విద్యార్థులు బానోత్ అరుణ్, మాలోత్ రాంచరణ్, లౌడ్య చరణ్, బుక్యా అంజలి, బానోత్ అరుణ చెరువులో నుంచి మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో సోమవారం మట్టి వినాయకుని విగ్రహాన్ని నెలకొల్పి నవరాత్రులు ముగియగానే నిమజ్జనం చేస్తామన్నారు.
రంగురంగుల విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి చెరువులో నిమజ్జనం చేయడం వలన నీరంతా కలుషితం కావడమే కాక, మట్టితో చెరువు పూడుకుపోతుందన్నారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.