‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది’ అనే మాటను వింటూనే ఉన్నాం. ఈ ముగ్గురు కుర్రాళ్ల జీవితాన్ని మార్చేసి, అంకుర దిగ్గజాలుగా మార్చింది మాత్రం ఒక చాక్లెట్ రేపర్.
అదేలా అంటే...
‘విజయానికి దారి ఏమిటి?’ అని మల్లగుల్లాలు పడుతుంటాంగానీ కొన్నిసార్లు పరిస్థితులే విజయానికి దారి చూపుతాయి. ముగ్గురు మిత్రులు, మూడు సంవత్సరాల క్రితం...
అక్షయ్ వర్మ, ఆదిత్య రువా, అంజు రువా ఆరోజు చెమటలు కక్కుతూ ముంబైలో బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ ఎండలో వారికి తళతళ మెరుస్తూ ఒక ఒక చాక్లెట్ బ్రాండ్ ప్లాస్టిక్ రేపర్ కనిపించింది. ఆ బ్రాండ్ తన ఉత్పత్తులను 1990లోనే ఆపేసింది. రేపర్ మాత్రం ‘నిను వీడని నీడను నేను’ అన్నట్లుగా చూస్తోంది. కాలాలకు అతీతంగా పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్‌పై ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి చర్చ, ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘బెకో’ అనే స్టార్టప్.
వెదురు, ప్లాంట్ బేస్డ్ ఇన్‌గ్రేడియంట్స్‌తో పర్యావరణహితమైన వస్తువులు, ఫ్లోర్ క్లీనర్స్, డిష్‌వాషింగ్ లిక్విడ్‌లాంటి కెమికల్ ఫ్రీ డిటర్‌జెంట్స్, గార్బేజ్ సంచులు, రీయూజబుల్ కిచెన్ టవల్స్, టూత్‌బ్రష్‌లు... మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది బెకో.
దీనికి ముందు...
పెట్ యాజమానుల కోసం ‘పెట్ ఇట్ అప్’ అనే సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు అక్షయ్ వర్మ. కో–ఫౌండర్ జారుకోవడంతో ఒక సంవత్సరం తరువాత అది మూతపడింది. ఇక ఆదిత్య కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్–ఆర్గనైజేషన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ వెంచర్‌ను అమ్మేశాడు.
మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది.
రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది.
మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు.
ఈ ముగ్గురు కలిసి ప్రారంభించిన ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ మొదట్లో తడబడినా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఊపందుకుంది. ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేసులతో పాటు, ముంబై, బెంగళూర్‌లలో దీనికి ఆఫ్‌లైన్ స్టోర్‌లు ఉన్నాయి. ‘బెకో’లో క్లైమెట్ ఎంజెల్స్ ఫండ్, టైటాన్ క్యాపిటల్, రుకమ్ క్యాపిటల్...మొదలైన సంస్థలు పెట్టుబడి పెట్టాయి.
‘లాభాల కోసం ఆశించి ప్రారంభించిన వ్యాపారం కాదు. ఒక లక్ష్యం కోసం ప్రారంభించింది. వీరి తపన చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరనే నమ్మకం కలుగుతుంది’ అంటున్నారు ‘రుకమ్ క్యాపిటల్’ ఫౌండర్ అర్చన జాహగిర్దార్. పర్యావరణ ప్రేమికురాలు, ప్రసిద్ధ నటి దియా మీర్జా ఈ ముగ్గురి భుజం తట్టడమే కాదు, కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు.
ముగ్గురు మిత్రులు అక్షయ్ (26), ఆద్యిత (26), అంజు (27) ముక్తకంఠంతో ఇలా అంటున్నారు... ‘భూగోళాన్ని పరిరక్షించుకుందాం అనేది పర్యావరణ దినోత్సవానికి పరిమితమైన నినాదం కాదు. పర్యావరణ స్పృహ అనేది మన జీవనశైలిలో భాగం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకో–సెన్సిటివ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారుల్లో 85 శాతం యువతరమే. పర్యావరణహిత వస్తువులను ఆదరించే ధోరణి పెరిగింది’
పర్యావరణహిత ఉత్పత్తుల మార్కెట్ రంగంలో ‘బెకో’ లీడింగ్ ప్లేయర్ పాత్ర పోషించనుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు.
రాబోయే అయిదు సంవత్సరాల్లో ‘బెకో’ను 500 కోట్ల రూపాయల బ్రాండ్‌గా చేయాలనేది ముగ్గురు మిత్రుల ఆశయం. అది ఫలించాలని ఆశిద్దాం.
మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు.
సక్సెస్‌స్టోరీ..:ఎకో–ఫ్రెండ్లీ ఫ్రెండ్స్
Published Fri, Apr 1 2022 12:33 AM | Last Updated on Fri, Apr 1 2022 12:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment