‘‘ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటే మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు. వాటిలో ఒకటి నన్ను ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. ఈరోజు నేను ఆర్గానిక్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాను. అదే మన్‌కీ బాత్ కార్యక్రమంలో నన్ను ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతూ తెగ మురిసిపోతోంది వర్ష.
కర్ణాటకలోని చామరాజన్ నగర్ జిల్లా ఆలహళ్లీ గ్రామానికి చెందిన వర్ష ఎమ్‌టెక్ చదివింది. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం కోసం చూడకుండా సరికొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వర్ష.. ఓ రోజు అనుకోకుండా మన్‌కీబాత్ వినింది. ఆ కార్యక్రమంలో అరటి ఆకులను ఉపయోగపడే వనరులుగా ఎలా మారుస్తున్నారో మోదీ ప్రస్తావించారు. ప్రకృతిని ఇష్టపడే వర్షకు ఇది బాగా నచ్చడంతో.. అరటి బోదె, ఆకులతో హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది.
వీడియో చూసి...
అరటి కాండాలను ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చాలో వర్షకు తొలుత అర్థం కాలేదు. తరువాత యూట్యూబ్‌లో వెతికి ఒక వీడియో ద్వారా కొంత సమాచారం తెలుసుకుంది. కోయంబత్తూరు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా ఎలా మారుస్తున్నారో వివరంగా తెలుసుకుంది. ఆ తరవాత వ్యాపారానికి కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేసి ఉమ్మతూరు సమీపంలో ‘ఆకృతి ఇకోఫ్రెండ్లీ’ పేరిట ఎంటర్‌ప్రైజ్‌ను ఏర్పాటు చేసింది.
అరటికాండాలు, ఆకులను సేకరించి యంత్రాలతో ప్రాసెస్ చేసి నారతీసి, ఫ్లోర్‌మ్యాట్స్, బ్యాగ్స్, పర్సులు, హ్యాండీ క్రాఫ్ట్స్, అరటి గుజ్జు నుంచి తీసిన రసంతో సహజసిద్ధమైన ఎరువులు తయారు చేసి విక్రయిస్తోంది. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆర్గానిక్ షాపులు, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్‌లైన్ షాపుల్లో సైతం ఆకృతి వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా మారుస్తూ కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రైతులకు ఆదాయం వచ్చేలా చేస్తోంది వర్ష.
వర్ష తన భర్త శ్రీకాంత్ సాయంతో చేస్తున్న ఈ ఇకో–ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలియడంతో కొన్ని కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు వçస్తున్నాయి. ‘‘భవిష్యత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించి ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తాను’’ అని వర్ష చెబుతోంది. గ్రామాల్లోని మహిళలు సైతం వ్యాపారవేత్తలుగా మారేందుకు, ఉద్యోగం దొరకనివారు ఉపాధిని ఇలా సృష్టించుకోవచ్చని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది వర్ష. నవంబర్ నెల మన్‌కీ బాత్ కార్యక్రమంలో వర్ష ఎంట్రప్రెన్యూర్ జర్నీ గురించి మోదీ ప్రస్తావించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment