
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం దేశ, విదేశీ ఆయిల్, గ్యాస్ కంపెనీల చీఫ్‌లతో భేటీ కానున్నారు. గోవాలో ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు నిర్వహించే ఇండియా ఎనర్జీ వీక్‌లో భాగంగా ఈ సమావేశం చోటుచేసుకోనుంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాపై, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధాని దృష్టి సారించనున్నారు. ఈ విషయాన్ని పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి ప్రకటించారు.
ఆయిల్ అండ్ గ్యాస్‌కు సంబంధించి గతంలో సీఈఆర్‌ఏ ఇండియా వీక్ పేరిట నిర్వహించే కార్యక్రమం ఇప్పుడు ఇండియా ఎనర్జీ వీక్ పేరుతో జరగనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా హౌతి మిలిటెంట్లు ఎర్ర సుమద్రంలో రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న తరుణంలో ఈ ఏడాది సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలో మాదిరే ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈవోలతో ప్రధాని సమావేశం కానున్నారు. ఇండియా–యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌టేబుల్ సమావేశం కూడా జరగనుంది. ఎర్ర సముద్రం సంక్షోభం మన చమురు సరఫరాలకు విఘాతం కలిగించకపోయినా, దారి మళ్లింపు వల్ల రవాణా వ్యయం పెరిగినట్టు పురి చెప్పారు. మొత్తం మీద సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తున్నట్టు తెలిపారు.