
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పర్యావరణహిత జీవన శైలి(లైఫ్) అనే ప్రపంచస్థాయి కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ‘లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్’ను ప్రకటిస్తారు. దీనిద్వారా పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబించేలా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలు, సంఘాలను ఒప్పించడానికి, ప్రభావితం చేయడానికి అవసరమైన ఆలోచనలను, సలహాలను విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు నుంచి ఆయన ఆహ్వానిస్తారు.
ఈ కార్యక్రమంలో మోదీ ప్రధానోపన్యాసం చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తెలిపింది. కార్యక్రమంలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో చైర్మన్ బిల్ గేట్స్, క్లైమేట్ ఎకనమిస్ట్ లార్డ్ నికొలస్ స్టెర్న్, నడ్జ్ థియరీ కర్త కాస్ సన్‌స్టీయిన్, వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో, ప్రెసిడెంట్ అనిరుద్ధ దాస్‌గుప్తా, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ తదితరులు పాల్గొంటారు.
10న ‘ఇన్–స్పేస్’ప్రారంభం
ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) ప్రధాన కార్యాలయాలను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. అంతరిక్ష కార్యకలాపాలను, అంతరిక్ష శాఖకు చెందిన వివిధ సంస్థలను ప్రభుత్వేతర ప్రైవేట్ సంస్థలు ఉపయోగించుకునేందుకు, ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు ఇవి నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment