నీళ్లలో తేలినట్టుందే! | Self-sufficient couple builds their own floating off-grid island | Sakshi
Sakshi News home page

నీళ్లలో తేలినట్టుందే!

Published Sun, Sep 13 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

నీళ్లలో తేలినట్టుందే!

నీళ్లలో తేలినట్టుందే!

విహంగం
పట్టణ జీవితం ఎలా ఉంటుంది? ‘ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల... బిజీ బిజీ బ్రతుకుల.. గజిబిజి ఉరుకుల పరుగులతో...’లాగే ఉంటుంది. అందుకే ఆ జీవితం అంటే మొహం మొత్తింది ఆడమ్స్, క్యాథరీన్ దంపతులకి. ఇద్దరూ కళాకారులు. వారు తయారుచేసే కళాకృతులకు కెనడాలో మంచి మార్కెట్ ఉంది. కానీ రణగొణ ద్వనులు, ఉరుకులు పరుగులు వారి కళాహృదయానికి సరిపడలేదు. వాటికి దూరంగా, ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశానికి పారిపోవాలని అనుకున్నారు. వెంటనే కెనడాలోని వాంకోవర్ ఐల్యాండ్ గుర్తొచ్చింది. అక్కడికి వెళ్లి నదీ జలాల మధ్య ఓ అందమైన ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టారు.
 
‘నేలంతా వదిలేసి నీటిలో ఇల్లు కట్టుకుంటున్నారేంటి’ అంటూ చాలా మంది ఆ దంపతుల్ని చూసి నవ్వారు. కానీ ఆ నవ్వినవాళ్లే అవాక్కయ్యేలా ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించారు క్యాథరీన్, ఆడమ్స్. పన్నెండు ఇంటర్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటుచేసి వాటిపై లివింగ్ హౌజ్, గ్రీన్‌హౌజ్, లైబ్రరీ, లైట్‌హౌజ్, డ్యాన్స్ స్టూడియో మొదలైనవి నిర్మించారు. కూరగాయలు, పండ్లు, పూల తోటలను నాటారు.

కోళ్లఫామ్‌తో పాటు మరికొన్ని జంతువులతో చిన్నపాటి జూను ఏర్పాటు చేశారు. గులాబి, ఆకుపచ్చ కలర్ థీమ్‌తో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ నిర్మాణానికి ‘ఫ్రీడమ్ కోవ్’ అని పేరు పెట్టారు. అంటే ‘స్వేచ్ఛా నివాసం’ అని అర్థం.
 
ఫ్రీడమ్ కోవ్ నీటిపై తేలుతుంది. కానీ నీటితో పాటు సాగిపోదు. అలా ఉండేలా బల మైన బేస్‌తో పక్కాగా నిర్మించారు దాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... ఇక్కడ అంతా ఎకో ఫ్రెండ్లీ. పర్యావరణానికి హాని చేసే ఏ వస్తువునూ వాడరు ఆడమ్స్ దంపతులు. ‘ఫ్రీడం కోవ్’కు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ అందుతుంది. చలికాలంలో వర్షపు నీటిని భద్రపరచి తాగు నీటిగా వాడుకుంటారు. పట్టణ జీవితంలో ఉండే కాలుష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వరు. ఫ్రీడమ్ కోవ్‌కు మీడియా ద్వారా బోలెడు  ప్రచారం లభించడంతో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు రావడం మొదలైంది.  కెనడాలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటిగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement