Vihangam
-
బాలికా విద్యపై దృష్టిపెట్టండి
వారణాసి: భావి భారత పౌరులైన బాలికల భవిష్యత్‌ను నిర్దేశించే వారి విద్యపై, నైపుణ్యాభివృద్ధిపై ప్రజలు ప్రధానంగా దృష్టిసారించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. మంగళవారం వారణాసిలో సద్గురు సదాఫల్దేవ్ విహంగం యోగా సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాశీలోని ఉమ్రాహాలో ఉన్న స్వర్వేద్ మహామందిర్ ఆలయంలో సద్గురు సదాఫల్దేవ్, స్వతంత్రదేవ్ మహరాజ్, విజ్ఞాన్‌దేవ్ మహరాజ్‌లకు నివాళులర్పించారు. ‘స్వాతంత్య్ర సంగ్రామంలో సద్గురు సదాఫల్దేవ్ వంటి ఎందరో సాధువులు ఎంతగానో తోడ్పాటునందించారు. కానీ, వారి కృషికి చరిత్రలో సరైన గుర్తింపు లభించ లేదు’అని మోదీ వ్యాఖ్యానించారు. ‘భారత్ అద్భుతమైంది. సమయం అనుకూ లించని వేళా సమకాలిన ప్రపంచ గతిని మార్చే అసమాన సద్గురువులు ఇక్కడ నడయాడారు. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుండి నడిపించిన నేతను ‘మహాత్మా’గా ప్రపంచం కీర్తించిం ది’అని మోదీ గాంధీజీని ప్రస్తావించారు. ‘సబ్కా ప్రయాస్’స్ఫూర్తిని అందరూ స్వీకరించాలన్నారు. తమ కుటుంబంతోపాటు సమాజ బాధ్యతను తమదిగా భావించే వారు తోచినంతలో ఒకరిద్దరు నిరుపేద బాలికల విద్య, నైపుణ్యాభివృద్ధి బాధ్యతలను తీసుకో వాలన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న వేళ.. స్వపరిపాలన ఎంత ముఖ్యమో సుపరిపాలనా అంతే ప్రధానమన్నారు. సోమవారం అర్ధరాత్రి దాటా క మోదీ కాశీ సుందరీకరణ పనులను స్వయం గా వెళ్లి పర్యవేక్షించారు. బెనారస్ రైల్వేస్టేషన్ నవీకరణ పనులపై ఆరాతీశారు. సుపరిపా లనపై 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కాశీలో చర్చించారు. -
ఆత్మీయుల ఆనవాళ్లు
విహంగం గ్రీకు తాత్వికుడు నికోవాస్ కజాన్జాకీ సమాధి పలకంపై ఇలా రాసి ఉంటుంది... ‘ఇక నేను ఏ కోరిక గురించీ తపించ నక్కర్లేదు. ఇక నేను దేని గురించీ భయపడనక్కర్లేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛకు ప్రతిరూపాన్ని’! మరణం కొందరికి దుఃఖభరితం... కొందరికి స్వేచ్ఛాగీతం. నికోవాస్కి అది కచ్చితంగా స్వేచ్ఛాగీతమే. అందుకే తన సమాధిపై అలా రాయమని కోరారు. మృత్యువులాగే మనిషి పుర్రెపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్మశానాల్లో కనిపించే పుర్రెల్ని చూసి కొందరు భయపడతారు. కొందరు మాత్రం అవి ఆత్మీయుల ఆనవాళ్లు. మిగతావాళ్లు ఏమోగానీ... ఆస్ట్రియా వాళ్లు మాత్రం పుర్రెల్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. అందుకే హాల్‌స్టాట్ ప్రాంతంలో వాటి కోసం ఏకంగా ఓ ఆలయాన్నే నిర్మించారు. అదే... బోన్హౌస్. బంధం కంటే బలమైనదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఒక వ్యక్తితో ముడి పడిన బంధం మనకు ఎంతో బలాన్ని స్తుంది. అందుకే ఆ ముడి వీడినప్పుడు, ఆ మనిషి మనల్ని వీడి వెళ్లిపోయినప్పుడు మనం కుమిలిపోతాం. మనశ్శాంతిని కోల్పోయి అల్లాడిపోతాం. కానీ ఆ వెళ్లిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అయితే ఆస్ట్రియాలోని హాల్‌స్టాట్ గ్రామస్తులు కేవలం కోరుకుని ఊరుకోరు. దానికోసం ఓ పెద్ద కార్యక్రమమే చేస్తారు. తమవాళ్లు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత, సమాధిని తవ్వి పుర్రెను బయటకు తీస్తారు. దాన్ని బ్లీచ్‌తో శుభ్రం చేసి, రంగురంగుల డిజైన్లు వేస్తారు. ఆ వ్యక్తి పేరు, చనిపోయిన సంవత్సరాన్ని ఆ పుర్రెపై రాసి, తీసుకెళ్లి ‘బోన్ హౌస్’లో దేవుడి పాదాల దగ్గర పెడతారు. అలా చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి విశ్వాసం! హాల్స్టాట్లో సెయింట్ మైఖేల్ చర్చ్ అనే ఓ ప్రసిద్ధ క్రైస్తవ దేవాలయం ఉంది. దాన్ని ఆనుకునే ఓ శ్మశానం ఉంది. అక్కడ అండర్‌గ్రౌండ్‌లో ఉంది బోన్ హౌస్. లైబ్రరీ అరల్లో పుస్తకాలు ఉన్నట్టు, ఈ బోన్ హౌస్‌లో ఉన్న అల్మరాల అరల నిండా పుర్రెలు ఉంటాయి. వాటిపై రంగులతో వేసిన పూల కిరీటాలు, ఇతరత్రా అలంకరణలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఆ పుర్రెలు... మనిషి జీవితాన్ని ప్రతిబింబించే చారిత్రక శకలాల్లా కనిపిస్తాయి. పుర్రెల మధ్యలో వెలుగుతున్న కొవ్వొత్తులు జీవనతత్వాన్ని బోధించే మహానీయుల్లా ఉంటాయి. ఇక్కడ రాజు-పేదా అనే తేడా లేదు. ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా అన్ని పుర్రెలూ ఒకే వరుసలో ఉంటాయి. ‘బోన్ హౌస్’లోకి వెళితే ఒక వింత అనుభూతి కలుగుతుంది. చీకటి ఎక్కువ, వెలుగు తక్కువగా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడి వాతావరణం జీవితపు చివరి మజిలీని గురించి నర్మగర్భంగా గుర్తు చేస్తున్నట్లుగా ఉంటుంది. హాల్‌స్టాట్ స్మశానం చిన్నది కావడం వల్ల, కొత్త సమాధులకు స్థలం చాలక... పది సంవత్సరాలకోసారి పాత సమాధుల్ని ఖాళీ చేస్తుంటారు. ఆ సమయంలోనే పాత సమాధిలోని పుర్రెలను ఇలా భద్ర పరుస్తారు అని కొందరు అంటుంటారు. కానీ దాన్ని అంగీకరించనివాళ్లు చాలామందే ఉన్నారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ మని, దానితో ఓ బలమైన విశ్వాసం ముడిపడి ఉందని వాళ్లు అంటారు. అది కచ్చితంగా నిజమే అయ్యుండాలి. ఎందుకంటే, ఇలా పుర్రెలను భద్రపరిచే పనిని వాళ్లు ఎంతో నిష్టగా పాటిస్తారు. ఓ పవిత్ర కార్యంగా భావించి ఆచరిస్తారు. ఏది ఏమైనా... ఈ ఆచారం ఏ నమ్మకంతో ముడిపడి ఉన్నా... బోన్ హౌస్ మాత్రం ఓ పెద్ద టూరిస్టు అట్రాక్షన్ అయ్యిందన్నది మాత్రం వాస్తవం. యేటా కొన్ని లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. మరణించిన తమవాళ్ల ఆత్మలు కూడా శాంతించాలని ప్రార్థిస్తున్నారు -
భేషూగ్గా వెళ్లొచ్చు!
విహంగం ‘‘ఎందుకు ఆ పాత షూస్‌ను అలా మూటగడుతున్నావ్?’’ ‘‘న్యూజిలాండ్‌కు వెళుతున్నానులే’’ ‘‘ఓహో... ‘వాయిహోల’కు వెళు తున్నావా? ఏం వదులుకుంటున్నావు?’’ ‘‘బద్దకాన్ని!’’ న్యూజిలాండ్‌కు వెళ్లే పర్యాటకులలో చాలామంది వాయిహోల గురించి ఆరా తీస్తారు. అక్కడి ‘షూ ఫెన్స్’ గురించి వివరాలు తెలుసుకుంటారు. దాన్ని వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ ఉన్న తీగెకు తమతో తీసుకెళ్లిన బూట్లు, చెప్పులను తగిలిస్తారు. ఎందుకలా చేస్తారు అంటే... దాని వెనుక ఎన్నో నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవా లంటే ఒక్కసారి ‘చెప్పుల స్వర్గం’ అని పిలిచే వాయిహోలకు వెళ్లి రావాల్సిందే. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లో డునెడిన్, మిల్టన్ పట్టణాల మధ్య స్టేట్ హైవే-1ను ఆనుకొని ఉంటుంది వాయిహోల టౌన్షిప్. ఇక్కడి టూరిజం అట్రాక్షన్ లేక్ వాయిహోల. వాటర్ స్కైయింగ్, రోయింగ్ మొదలైన జల క్రీడాలకు అది ప్రసిద్ధి. ఇంతకు మించి వాయిహోల గురించి చెప్పుకోవడానికి పర్యాటక ఆకర్షణలేవీ లేకపోయినప్పటికీ, ఆ ప్రాంతం టూరిస్టు కేంద్రం కావడానికి ప్రధాన కారణం మాత్రం... షూ ఫెన్స్! న్యూజిలాండ్ వచ్చే పర్యాటకుల్లో చాలామంది, షూ ఫెన్స్ని చూడటానికి పని గట్టుకుని వాయిహోలకు వస్తారు. హైవేకు ఒక పక్క... పొడవాటి కంచెకు రకరకాల బూట్లు కట్టి ఉంటాయి. వాటికి తమతో తెచ్చిన బూట్లను కూడా జత చేస్తుంటారు సందర్శకులు. ఇలా కట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ‘ఇక్కడ ప్రతి చెప్పుకు ఒక ఆత్మ ఉంటుంది’ అంటారు స్థానికులు. ఆ ఆత్మ ఏం చెప్తుంది అంటే, చెడు అలవాట్లను వదిలేయమంటుంది అంటారు. అందుకే చాలామంది వచ్చి, బూట్ల జతను కంచెకు వేళ్లాడదీసి, తమకున్న చెడు అలవాట్ల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థించి వెళ్తుంటారు. అలాగే... వాడేసిన పాత బూట్లను ఈ రకంగా దూరం చేసుకుంటే, తమను వెంటాడుతోన్న దురదృష్టం కూడా దూరమవుతుందని నమ్ముతారు. అయితే ఈ సంప్రదాయం ఎలా మొదలైంది అనేదాని గురించి స్పష్టత లేదు. కాకపోతే ఇమెల్డా మార్కోస్ లాంటి అభిరుచిని పోలిన వ్యక్తి ఎవరో వాయి హోల చుట్టుపక్కల ఉండి ఉండొచ్చనేది ఒక అంచనా. ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ భార్య అయిన ఇమెల్డా, ఎంత రేటు పెట్టి కొన్న పాద రక్షలనైనా ఒక్కరోజు మాత్రమే వేసుకొనే దట. దాంతో ఆమె దగ్గర వందలాది పాద రక్షలుండేవి. వీటిని ‘ఇమెల్డా సంపద’ అని పిలిచేవారు. ఆమె సేకరించిన చెప్పులన్నీ ప్రసుత్తం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఫిలిప్పైన్స్, మార్కిన నగరంలోని షూ మ్యూజియమ్‌లలో ఉన్నాయి. న్యూజి లాండ్లో కూడా ఇమెల్డా లాంటి వ్యక్తి ఎవరైనా తాను సేకరించిన షూస్‌ను సరదాగా ఈ కంచెకు కట్టి ఉండొచ్చు, కాలక్రమంలో ఆ సరదా కాస్తా సంప్ర దాయమై ఉండొచ్చు అనేది ఒక కథనం. కంచెకు షూ కడితే... నేషనల్ హైవే మీద ప్రయాణించే వాళ్లకు ఎలాంటి ప్రమాదాలూ జరగవనే నమ్మకం కూడా షూ ఫెన్స్‌కు డిమాండ్‌ను పెంచింది. నమ్మకం కావచ్చు, మూఢనమ్మకం కావచ్చు. వాస్తవం కావచ్చు, కల్పన కావచ్చు. షూ ఫెన్స ఏర్పడటానికి కారణం ఏదైనా, అది ఓ సెంటిమెంటుగా మారింది. చెడును, దురలవాట్లను దూరం చేసే ప్రదేశంగా పేరొందింది. ఓ ప్రముఖ సందర్శనీయ స్థలంగానూ ఖ్యాతికెక్కింది. ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫుట్‌వేర్ డిజైనర్ క్రిస్టియన్ లోబోటిన్ ఒక చక్కని మాట చెప్పాడు... ‘షూ అంటే కేవలం డిజైన్ మాత్రమే కాదు. అది మన శరీరభాషలో ఒక భాగం. దారి చూపే నేస్తం’ అని! న్యూజిలాండ్‌లోని షూ ఫెన్స్‌ను చూస్తే... షూ అనేది దారి చూపే నేస్తమే కాదు, మనసులోని కోరికను తీర్చే సాధనం అని కూడా అనిపిస్తుంది. -
నీళ్లలో తేలినట్టుందే!
విహంగం పట్టణ జీవితం ఎలా ఉంటుంది? ‘ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల... బిజీ బిజీ బ్రతుకుల.. గజిబిజి ఉరుకుల పరుగులతో...’లాగే ఉంటుంది. అందుకే ఆ జీవితం అంటే మొహం మొత్తింది ఆడమ్స్, క్యాథరీన్ దంపతులకి. ఇద్దరూ కళాకారులు. వారు తయారుచేసే కళాకృతులకు కెనడాలో మంచి మార్కెట్ ఉంది. కానీ రణగొణ ద్వనులు, ఉరుకులు పరుగులు వారి కళాహృదయానికి సరిపడలేదు. వాటికి దూరంగా, ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశానికి పారిపోవాలని అనుకున్నారు. వెంటనే కెనడాలోని వాంకోవర్ ఐల్యాండ్ గుర్తొచ్చింది. అక్కడికి వెళ్లి నదీ జలాల మధ్య ఓ అందమైన ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టారు. ‘నేలంతా వదిలేసి నీటిలో ఇల్లు కట్టుకుంటున్నారేంటి’ అంటూ చాలా మంది ఆ దంపతుల్ని చూసి నవ్వారు. కానీ ఆ నవ్వినవాళ్లే అవాక్కయ్యేలా ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించారు క్యాథరీన్, ఆడమ్స్. పన్నెండు ఇంటర్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటుచేసి వాటిపై లివింగ్ హౌజ్, గ్రీన్‌హౌజ్, లైబ్రరీ, లైట్‌హౌజ్, డ్యాన్స్ స్టూడియో మొదలైనవి నిర్మించారు. కూరగాయలు, పండ్లు, పూల తోటలను నాటారు. కోళ్లఫామ్తో పాటు మరికొన్ని జంతువులతో చిన్నపాటి జూను ఏర్పాటు చేశారు. గులాబి, ఆకుపచ్చ కలర్ థీమ్‌తో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ నిర్మాణానికి ‘ఫ్రీడమ్ కోవ్’ అని పేరు పెట్టారు. అంటే ‘స్వేచ్ఛా నివాసం’ అని అర్థం. ఫ్రీడమ్ కోవ్ నీటిపై తేలుతుంది. కానీ నీటితో పాటు సాగిపోదు. అలా ఉండేలా బల మైన బేస్‌తో పక్కాగా నిర్మించారు దాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే... ఇక్కడ అంతా ఎకో ఫ్రెండ్లీ. పర్యావరణానికి హాని చేసే ఏ వస్తువునూ వాడరు ఆడమ్స్ దంపతులు. ‘ఫ్రీడం కోవ్’కు సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ అందుతుంది. చలికాలంలో వర్షపు నీటిని భద్రపరచి తాగు నీటిగా వాడుకుంటారు. పట్టణ జీవితంలో ఉండే కాలుష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానివ్వరు. ఫ్రీడమ్ కోవ్‌కు మీడియా ద్వారా బోలెడు ప్రచారం లభించడంతో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు రావడం మొదలైంది. కెనడాలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటిగా నిలిచింది.