ఆత్మీయుల ఆనవాళ్లు | Loved persons Landmarks | Sakshi
Sakshi News home page

ఆత్మీయుల ఆనవాళ్లు

Published Sun, Oct 18 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

ఆత్మీయుల ఆనవాళ్లు

ఆత్మీయుల ఆనవాళ్లు

విహంగం
గ్రీకు తాత్వికుడు నికోవాస్ కజాన్జాకీ  సమాధి పలకంపై ఇలా రాసి ఉంటుంది...
 ‘ఇక  నేను ఏ కోరిక గురించీ తపించ నక్కర్లేదు. ఇక నేను దేని గురించీ భయపడనక్కర్లేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛకు ప్రతిరూపాన్ని’!
 మరణం కొందరికి దుఃఖభరితం... కొందరికి స్వేచ్ఛాగీతం. నికోవాస్‌కి అది కచ్చితంగా స్వేచ్ఛాగీతమే. అందుకే తన సమాధిపై అలా రాయమని కోరారు.
  మృత్యువులాగే మనిషి పుర్రెపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

శ్మశానాల్లో కనిపించే పుర్రెల్ని చూసి కొందరు భయపడతారు. కొందరు మాత్రం అవి ఆత్మీయుల ఆనవాళ్లు. మిగతావాళ్లు ఏమోగానీ... ఆస్ట్రియా వాళ్లు మాత్రం పుర్రెల్ని చాలా ప్రత్యేకంగా చూస్తారు. అందుకే హాల్‌స్టాట్ ప్రాంతంలో వాటి కోసం ఏకంగా ఓ ఆలయాన్నే నిర్మించారు. అదే... బోన్‌హౌస్.
   
 బంధం కంటే బలమైనదేదీ ఈ ప్రపంచంలో లేదు. ఒక వ్యక్తితో ముడి పడిన బంధం మనకు ఎంతో బలాన్ని స్తుంది. అందుకే ఆ ముడి వీడినప్పుడు, ఆ మనిషి మనల్ని వీడి వెళ్లిపోయినప్పుడు మనం కుమిలిపోతాం. మనశ్శాంతిని కోల్పోయి అల్లాడిపోతాం. కానీ ఆ వెళ్లిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
 
 అయితే ఆస్ట్రియాలోని హాల్‌స్టాట్ గ్రామస్తులు కేవలం కోరుకుని ఊరుకోరు. దానికోసం ఓ పెద్ద కార్యక్రమమే చేస్తారు. తమవాళ్లు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత, సమాధిని తవ్వి పుర్రెను బయటకు తీస్తారు. దాన్ని బ్లీచ్‌తో శుభ్రం చేసి, రంగురంగుల డిజైన్లు వేస్తారు. ఆ వ్యక్తి పేరు, చనిపోయిన సంవత్సరాన్ని ఆ పుర్రెపై రాసి, తీసుకెళ్లి ‘బోన్ హౌస్’లో దేవుడి పాదాల దగ్గర పెడతారు. అలా చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి విశ్వాసం!

 హాల్‌స్టాట్‌లో సెయింట్ మైఖేల్ చర్చ్ అనే ఓ ప్రసిద్ధ క్రైస్తవ దేవాలయం ఉంది. దాన్ని ఆనుకునే ఓ శ్మశానం ఉంది. అక్కడ అండర్‌గ్రౌండ్‌లో ఉంది బోన్ హౌస్. లైబ్రరీ అరల్లో పుస్తకాలు ఉన్నట్టు, ఈ బోన్ హౌస్‌లో ఉన్న అల్మరాల అరల నిండా పుర్రెలు ఉంటాయి. వాటిపై రంగులతో వేసిన పూల కిరీటాలు, ఇతరత్రా అలంకరణలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఆ పుర్రెలు... మనిషి జీవితాన్ని ప్రతిబింబించే చారిత్రక శకలాల్లా కనిపిస్తాయి.

పుర్రెల మధ్యలో వెలుగుతున్న కొవ్వొత్తులు జీవనతత్వాన్ని  బోధించే మహానీయుల్లా ఉంటాయి. ఇక్కడ రాజు-పేదా అనే తేడా లేదు. ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా అన్ని పుర్రెలూ ఒకే వరుసలో ఉంటాయి.
 ‘బోన్ హౌస్’లోకి వెళితే ఒక వింత అనుభూతి కలుగుతుంది. చీకటి ఎక్కువ, వెలుగు తక్కువగా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడి వాతావరణం జీవితపు చివరి మజిలీని గురించి నర్మగర్భంగా గుర్తు చేస్తున్నట్లుగా ఉంటుంది.
 
హాల్‌స్టాట్ స్మశానం చిన్నది కావడం వల్ల, కొత్త సమాధులకు స్థలం చాలక... పది సంవత్సరాలకోసారి పాత సమాధుల్ని ఖాళీ చేస్తుంటారు. ఆ సమయంలోనే పాత సమాధిలోని పుర్రెలను ఇలా భద్ర పరుస్తారు అని కొందరు అంటుంటారు. కానీ దాన్ని అంగీకరించనివాళ్లు చాలామందే ఉన్నారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ మని, దానితో ఓ బలమైన విశ్వాసం ముడిపడి ఉందని వాళ్లు అంటారు. అది కచ్చితంగా నిజమే అయ్యుండాలి. ఎందుకంటే, ఇలా పుర్రెలను భద్రపరిచే పనిని వాళ్లు ఎంతో నిష్టగా పాటిస్తారు. ఓ పవిత్ర కార్యంగా భావించి ఆచరిస్తారు.

ఏది ఏమైనా... ఈ ఆచారం ఏ నమ్మకంతో ముడిపడి ఉన్నా... బోన్ హౌస్ మాత్రం ఓ పెద్ద టూరిస్టు అట్రాక్షన్ అయ్యిందన్నది మాత్రం వాస్తవం. యేటా కొన్ని లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. మరణించిన తమవాళ్ల ఆత్మలు కూడా శాంతించాలని ప్రార్థిస్తున్నారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement