
న్యూఢిల్లీ: పాలనపరమైన లోపాల వల్లే కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు వెనుకబడ్డాయని.. ఆలోచనలు, వనరులు, సామర్థ్యం లేకపోవడం వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌లో 48వ గవర్నర్ల సదస్సు ముగింపు సమావేశంలో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ.. ఉత్తమ పాలన అమలవుతున్న రాష్ట్రాల్లో పేదల సంక్షేమ పథకాలు సమర్థంగా అమలవుతున్నాయని చెప్పారు.
మిషన్ ఇంద్రధనుష్, ఇతర ప్రభుత్వ పథకాల వివరాల్ని ప్రధాని ఉదహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా గవర్నర్లు సహకరించాలని కోరారు. దేశ ఐక్యత, సమగ్రత బలోపేతం చేసేందుకు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, ఐక్యతా పరుగు వంటి వాటిలో గవర్నర్లు పాలుపంచుకోవాలని ప్రధాని కోరారు. రాజ్యాంగ పవిత్రతను పరిరక్షిస్తూనే గవర్నర్లు సమాజంలో మార్పు కోసం ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని గురువారం సదస్సు ప్రారంభోత్సవంలో మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
యువతరానికి మార్గదర్శకులుగా వ్యవహరించాలి: రాష్ట్రపతి
రాష్ట్రాలు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో చేసిన సమాలోచనలు.. రాష్ట్రాల సమాఖ్య మధ్య సహకారానికి దిక్సూచిలా ఉపయోగపడతాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. గవర్నర్లు యువతరానికి మార్గదర్శకులుగా ఉండడంతో పాటు, దేశ భవిష్యత్తు రూపకల్పనలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రతి రాష్ట్రం పురోగమించినప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు.
వివాదాలకు గవర్నర్లు దూరంగా ఉండాలి: వెంకయ్య
రాజ్యాంగ నియమావళికి కట్టుబడి గవర్నర్లు వివాదాలకు దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. గవర్నర్ల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. భారత రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్లది కీలక పాత్రని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజా సేవ, సంక్షేమానికి అంకితమవ్వాలని కోరారు. సమాంతర అధికార కేంద్రాలుగా కాకుండా... కేంద్ర ప్రభుత్వం, రాజ్యాంగానికి గవర్నర్లు ప్రతినిధులుగా వ్యవహరించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలే అంతిమమని వెంకయ్య పేర్కొన్నారు.
పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని, ఫలితాలతో కూడిన పనితనమనే కొత్త ఒరవడికి నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల ఆలోచనా ధోరణిని సానుకూల దృక్పథం వైపు మళ్లించేందుకు మార్గదర్శకులు, సలహాదారులుగా గవర్నర్లు వ్యవహరించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల బలోపేతం, మొక్కల పెంపకం, స్వచ్ఛ భారత్, జల వనరులకు పునరుజ్జీవం, సాంఘిక దురాచారాల నిర్మూలన, యోగాకు ప్రాచుర్యం, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, బేటీ పడావో– బేటీ బచావో వంటి కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ఖాదీ, చేనేతకు ప్రాచుర్యం కల్పించాలని, మాతృ భాష, భారతీయ భాషల్ని ప్రోత్సహించాలని గవర్నర్లను ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment