మూణ్నెళ్లకొకసారి ఎన్నికలేంటి?
సీతాదేవి శీలాన్ని పరీక్షించినట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం స్వాగతిస్తానని, సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అన్న ప్రధాన మంత్రి మోదీ ప్రతిపాదన గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో చేయాలని తొందరపడి గతంలో ఎన్నికలప్పుడు పరుగెత్తడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఈసారి అలా కాకుండా సుస్థిరమైన పాలన కోసం ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళతానన్నారు.
కియా సంస్థతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి కనీసం ద్విచక్రవాహనం, లేదా కారు ఉండాలని నాలుగు రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో టీమిండియా నిర్ణయించినట్లు తెలిపారు. గ్లోబల్ ఆటోమొబైల్ జెయింట్‌గా కియా మోటార్స్ రాష్ట్రానికి రావడం ఎంతో శుభ సూచకమని సీఎం అన్నారు. అనంతపురం జిల్లాలోని ఎర్రమంచి గ్రామంలో ఈ సంస్థ రూ. 12,900 కోట్ల పెట్టుబడితో కార్ల తయారీ ప్లాంట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు.