Nieti Ayog
-
రుణ నిర్వహణకు స్వతంత్ర సంస్థ
ప్రభుత్వ రుణ నిర్వహణ వ్యవహారాల కోసం రిజర్వ్ బ్యాంక్ కాకుండా స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అమలు చేయటానికి సమయం ఆసన్నమైందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వ రుణ నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ఇది స్వతంత్రంగా ఉంటేనే మరింతగా దృష్టి సారించేందుకు సాధ్యపడుతుంది. రుణ సమీకరణ వ్యయాలు తగ్గించుకోవడానికి ప్రభుత్వానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది‘ అని నీతి ఆయోగ్ శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ నుంచి నిధుల సమీకరణ సహా ప్రభుత్వ రుణ సమీకరణ కార్యకలాపాలన్నీ ఆర్బీఐ నిర్వహణలోనే ఉంటున్నాయి. అయితే, దీన్ని రిజర్వ్ బ్యాంక్ పరిధి నుంచి తప్పించి ప్రభుత్వ రుణ నిర్వహణ ఏజెన్సీని (పీడీఎంఏ) ఏర్పాటు చేసి దాని చేతికివ్వాలని 2015 ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇది అమల్లోకి రాలేదు కానీ.. తాజాగా రాజీవ్ కుమార్ మరోసారి దీన్ని బైటికి తెచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నిర్వర్తించే వేర్వేరు విధులను ఏ విధంగా విభజించాలన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాజీవ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆర్బీఐకే అప్పగించింది. మరి వృద్ధి, ఉద్యోగాల కల్పన, రుణ నిర్వహణ, ఇతరత్రా చట్టపరమైన అంశాల నిర్వహణ మొదలైనవి ఎవరు పర్యవేక్షిస్తారు? ఇదిగో ఇలాంటి అంశాలన్నింటిపైనా చర్చ జరగాలి‘ అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి బ్యాంకింగ్ భారీ అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలను అందుకోవాలంటే భారత్‌కు ప్రపంచ స్థాయి పెద్ద బ్యాంకులు అవసరమని రాజీవ్ కుమార్ చెప్పారు. వృద్ధికీ ఇది దోహదపడే అంశమని తెలిపారు. 2040 నాటికి 650 బిలియన్ డాలర్లకు రియల్టీ మార్కెట్.. ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2040 నాటికి అయిదు రెట్లు వృద్ధితో 650 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న ఏడు శాతం నుంచి రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన వివరించారు. ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన అంతర్జాతీయ లగ్జరీ రియల్టీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ కుమార్ ఈ విషయాలు చెప్పారు. బ్యాంకుల్లో లోపాల్లేకుండా చేయడం పెద్ద సవాలు:రాజీవ్‌కుమార్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వంటి ఆర్థిక సంస్థలను పూర్తి దోష రహిత విధానంలో పనిచేసేలా చూడడం అన్నది అతిపెద్ద సవాలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలను మరింత జవాబుదారీగా మార్చడం కూడా మరో సవాలుగా ఆయన అభివర్ణించారు. ఇక డిపాజిట్లపై సెంట్రల్ రిపాజిటరీ అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా నడిచే డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నేపథ్యంలో... డిపాజిట్లను స్వీకరించేందుకు అనుమతి ఉన్న సంస్థల వివరాలతో సెంట్రల్ రిపాజిటరీ ఏర్పాటు చేయటానికి మార్గం సుగమమైందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ రిపాజిటరీ వల్ల సామాన్యులు, ఆర్థిక అవగాహన లేని వారు మోసపోకుండా కాపాడుతుందన్నారు. -
ఏకకాలంలో ఓకేనా?
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం యోచనలో స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దేశమంతటా ఏకకాలంలో నిర్వహించే విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రం కోరనుంది. ఇందుకోసం లా కమిషన్ న్యాయ శాఖకు నివేదిక అందించనుంది. లా కమిషన్‌తోపాటు నీతి ఆయోగ్ దేశమంతా ఏకకాలంలో 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే మేలని భావిస్తోంది. ఈ నివేదికలను కేంద్రం ఈసీకి పంపి, అభిప్రాయం తెలపాల్సిందిగా కోరనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఒకటే జాతి, ఒకటే ఎన్నిక’ అన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా లా కమిషన్ ముసాయిదా పత్రంలో దేశమంతా ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు మొదటి దశ 2019లో, రెండో దశ 2024లో ఎన్నికలు జరపాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించటంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అసెంబ్లీల కాలపరిమితిని కుదించటం లేదా పొడిగించటం చేయాలని సూచించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ ఇటీవల మాట్లాడుతూ..‘ఏకకాలంలో ఎన్నికల విధానాన్ని ఆచరణలోకి తేవటానికి చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. ఇందుకు సమయం పడుతుంది. అన్నీ పూర్తయితే, ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. రాజ్యాంగం చెప్పిందే ఎన్నికల కమిషన్ చేస్తుంది’ అని అన్నారు. -
మీడియా సూచీని బట్టి రాష్ట్రాలకు ర్యాంకింగ్
న్యూఢిల్లీ: సులభ వ్యాపార విధానాల ప్రాతిపదిక తరహాలోనే మీడియా, వినోదం సూచీ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో మెరుగైన ర్యాంకింగ్ కోసం రాష్ట్రాలు పోటీపడతాయి కాబట్టి మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం కూడా వృద్ధి చెందగలదని ఆయన పేర్కొన్నారు. ‘యూరప్‌లోని 24 దేశాలకన్నా కూడా భారత్ చాలా పెద్ద దేశం. మీడియా, ఎంటర్టైన్మెంట్ విషయంలో మన రాష్ట్రాల్లో విధానాలు మరింత సులభతరంగా ఉండటంపై దృష్టి పెట్టాలి. ఈ రెండింటితో పాటు గేమింగ్, డిజిటైజేషన్ మొదలైన అంశాల సూచీల ప్రాతిపదికగా ర్యాంకింగ్ ఇవ్వాలి‘ అని సీఐఐ బిగ్ పిక్చర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ పేర్కొన్నారు. -
అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా సీసీఎంబీ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతకు ప్రోత్సాహించే లక్ష్యంతో కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఎంపికైనట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. వినూత్నమై ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు సీసీఎంబీలోని సౌకర్యాలన్నీ అందుబాటులోకి తేవడం, తద్వారా సామాజిక ప్రయోజనాలున్న ఉత్పత్తి లేదా సేవగా అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపు 3,780 సంస్థలు వరకూ ఈ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయగా నీతి ఆయోగ్ పదింటిని ఎంపిక చేసిందని, ఇందులో సీసీఎంబీ ఒకటని మిశ్రా తెలిపారు. ఈ కేంద్రంలో బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తామని, సీసీఎంబీ అనెక్స్–2లో దాదాపు పదివేల చదరపు అడుగుల స్థలం, రెండు – మూడు కోట్ల విలువైన యంత్ర సామాగ్రి అందుబాటులో ఉంటుందన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను అంచనా వేయడం మొదలుకొని.. మేధోహక్కుల పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఫార్మా, ప్రిస్కిప్షన్ మెడిసన్, స్టెమ్‌సెల్ వైద్య రంగాల్లో స్టార్టప్‌లపై తాము దృష్టిపెడతామని చెప్పారు. దీని కోసం నీతి ఆయోగ్ ఏడాదికి గరిష్టంగా రూ.పది కోట్ల వంతున ఐదేళ్లపాటు నిధులు అందిస్తుందని.. ఆ తరువాత సంస్థ తనంతట తానే మనుగడ సాగించాలన్నారు. సీసీఎంబీలో ఇప్పటికే ఇలాంటి ఇన్క్యుబేషన్ కేంద్రం ఒకటి పనిచేస్తోందని.. అటల్ ఇన్నొవేషన్ సెంటర్ దీనికి అదనమని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సీసీఎంబీ ఒక సెక్షన్ –8 కంపెనీని ఏర్పాటు చేస్తోందని.. వ్యాపార సంస్థ మాదిరిగానే దీనికి సీఈవో, బోర్డ్ ఆఫ్డైరెక్టర్లు తదితరులు ఉంటారని తెలిపారు. ఔత్సాహికుల ఐడియాలను మదింపు చేసేందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతోపాటు ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రైవేట్ వ్యక్తుల సేవలను తీసుకుంటామని తెలిపారు.