సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతకు ప్రోత్సాహించే లక్ష్యంతో కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఎంపికైనట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. వినూత్నమై ఆలోచనలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు సీసీఎంబీలోని సౌకర్యాలన్నీ అందుబాటులోకి తేవడం, తద్వారా సామాజిక ప్రయోజనాలున్న ఉత్పత్తి లేదా సేవగా అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం ప్రయత్నిస్తుందని ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన దాదాపు 3,780 సంస్థలు వరకూ ఈ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయగా నీతి ఆయోగ్ పదింటిని ఎంపిక చేసిందని, ఇందులో సీసీఎంబీ ఒకటని మిశ్రా తెలిపారు.
ఈ కేంద్రంలో బయోటెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు అవకాశం కల్పిస్తామని, సీసీఎంబీ అనెక్స్–2లో దాదాపు పదివేల చదరపు అడుగుల స్థలం, రెండు – మూడు కోట్ల విలువైన యంత్ర సామాగ్రి అందుబాటులో ఉంటుందన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను అంచనా వేయడం మొదలుకొని.. మేధోహక్కుల పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఫార్మా, ప్రిస్కిప్షన్ మెడిసన్, స్టెమ్‌సెల్ వైద్య రంగాల్లో స్టార్టప్‌లపై తాము దృష్టిపెడతామని చెప్పారు. దీని కోసం నీతి ఆయోగ్ ఏడాదికి గరిష్టంగా రూ.పది కోట్ల వంతున ఐదేళ్లపాటు నిధులు అందిస్తుందని.. ఆ తరువాత సంస్థ తనంతట తానే మనుగడ సాగించాలన్నారు.
సీసీఎంబీలో ఇప్పటికే ఇలాంటి ఇన్‌క్యుబేషన్ కేంద్రం ఒకటి పనిచేస్తోందని.. అటల్ ఇన్నొవేషన్ సెంటర్ దీనికి అదనమని అన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సీసీఎంబీ ఒక సెక్షన్ –8 కంపెనీని ఏర్పాటు చేస్తోందని.. వ్యాపార సంస్థ మాదిరిగానే దీనికి సీఈవో, బోర్డ్ ఆఫ్‌డైరెక్టర్లు తదితరులు ఉంటారని తెలిపారు. ఔత్సాహికుల ఐడియాలను మదింపు చేసేందుకు సీసీఎంబీ శాస్త్రవేత్తలతోపాటు ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రైవేట్ వ్యక్తుల సేవలను తీసుకుంటామని తెలిపారు.
అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌గా సీసీఎంబీ ఎంపిక
Published Fri, Jun 23 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
Advertisement
Advertisement