డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై : జమిలి ఎన్నికల ప్రతిపాదనను డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తోసిపుచ్చారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదన పూర్తిగా దుస్సాహసమని ఆయన అభివర్ణించారు. గతంలో ఎన్డీఏ హయాంలోనే జమిలి ఎన్నికల ప్రతిపాదనను పక్కనపెట్టినందున మళ్లీ దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించడం వృధా ప్రయాస అన్నారు. ఏకకాల ఎన్నికలు పాత సూచనేనని, దీన్ని గతంలో పూర్తిగా తిరస్కరించారని చెప్పుకొచ్చారు.
ఏకకాల ఎన్నికలతో సమయం, డబ్బు ఆదా అవుతాయని, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురుకాబోవని నరేంద్ర మోదీ సర్కార్ ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ చేపడుతున్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలు ఏమాత్రం మేలు చేయబోవని స్పష్టం చేస్తూ స్టాలిన్ తమ పార్టీ తరపున లా కమిషన్‌కు లేఖ రాశారు.
జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలకు లా కమిషన్ లేఖ రాసింది. లా కమిషన్ ప్రచురించిన వర్కింగ్ పేపర్‌లో కొన్ని అంశాలు రాజ్యాంగం నిర్ధేశించిన సమాఖ్య స్ఫూర్తికి భంగకరంగా ఉన్నాయని ఈ సందర్భంగా స్టాలిన్ లా కమిషన్‌కు రాసిన లేఖలో నివేదించారు. ఈ క్రమంలో జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టడం సంక్లిష్టమవుతుందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment