
పార్టీ మొట్టమొదటి జనరల్ బాడీ సమావేశంలో విజయ్
బీజేపీ, డీఎంకేలది ఫాసిస్ట్ వైఖరంటూ మండిపాటు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి 2026లో జరిగే ఎన్నికలు వేరే విధంగా ఉండబోతున్నాయని సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ వ్యాఖ్యానించారు. ఈసారి టీఎంకే, అధికార డీఎంకే మధ్యనే పోటీ ఉండనుందన్నారు. శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ప్రప్రథమ జనరల్ కౌన్సిల్ సమావేశంలో విజయ్ మాట్లాడారు.
సీఎం ఎంకే స్టాలిన్‌ను గౌరవనీయులైన రాచరిక ముఖ్యమంత్రిగా అభివర్ణించిన విజయ్.. డీఎంకే కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అంటూ పూర్తి పేరును ఘనంగా చెప్పుకుంటే సరిపోదు, అది చేతల్లో, పాలనలో కనిపించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ అంటూ తిట్టిపోసే డీఎంకే కూడా అంతకంటే తక్కువేం కాదు, అదే ఫాసిస్ట్ వైఖరిని అనుసరిస్తోందని మండిపడ్డారు.
ప్రజలు, కార్యకర్తలను కలుసుకోకుండా నన్ను ఆపడానికి మీరెవరు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తనపై విధించిన ఆంక్షలను అనుసరించానన్నారు. సహజ వనరులు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం కలుగజేసే ప్రాజెక్టులను మాత్రమే తన పార్టీ వ్యతిరేకిస్తుందంటూ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఉంటామన్నారు.
రాబోయే టీవీకే ప్రభుత్వంలో ప్రజలే పాలకులుగా ఉంటారని, మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో విజయ్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి జీఎస్‌టీ రూపంలో పన్నులు వసూలు చేస్తూ రాష్ట్రానికి తగు విధంగా నిధులను కేటాయించడం లేదని ఆరోపించారు. త్రిభాషా విధానాన్ని రాష్ట్రంపై రుద్ద వద్దని, పార్లమెంట్‌లో ప్రాతినిథ్యాన్ని తగ్గించే డీలిమిటేషన్ అమలును ఆపాలని కోరారు. జమిలి ఎన్నికల విధానం వద్దన్నారు.
ముస్లింల హక్కులను లాగేసుకునేలా ఉన్న వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని విజయ్ కోరారు. ఎన్నికల సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని విజయ్‌కు కట్టబెడుతూ ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. అదే సమయంలో, 543 లోక్‌సభ నియోజకవర్గాలను ఎప్పటికీ కొనసాగించాలన్నదే టీవీకే విధానమని పేర్కొంది. ఈ సందర్భంగా విజయ్‌ను దళపతికి బదులుగా ‘వెట్రి తలైవార్’అని సంబోధించాలంటూ సీనియర్ నేత ఆధవ్ అర్జున ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపింది.