tamil nadu assembly elections
-
విద్యార్థులతో రాహుల్ గాంధీ స్టెప్పులు : వైరల్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల హడావిడి జోరందుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన వేగాన్ని పెంచారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళనాడులో మూడురోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ర్యాలీలు, సభలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులతో ఆడిపాడారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసారు. పుష్-అప్స్, 'ఐకిడో' తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణుల్లో, అభిమానుల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులో జోరుగా పర్యటిస్తున్న రాహుల్‌కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా నాగర్‌కోయిల్ వెళ్లేటప్పుడు ఆచంగులం గ్రామ రహదారి వద్ద తాటి ముంజెలను ఆస్వాదిస్తూ అక్కడి ప్రజలతో కలిసిపోయారు. సోమవారం కన్యాకుమారిలో ప్రచారం చేస్తున్న రాహుల్ తమిళ ప్రజలు తప్ప మరెవరూ తమిళనాడును నడపలేరు అనేది చరిత్ర చెబుతోంది. ఈ ఎన్నికల్లో కూడా ఇదే రుజువు కానుంది. తమిళనాడు ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. కన్యాకుమారిలో రోడ్‌షోలో పాల్గొన్న రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు సంస్కృతిని కేంద్రం గౌరవించదు. ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి మోదీకి ప్రతినిధి ఉంటూ ఆయన ఏం చెబితే అది చేస్తారు. మోదీదాసోహం అనేవారు తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవమానించే అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వకూడదు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని మోదీ చెబుతూ ఉంటారు. మరి తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర భారత చరిత్ర కాదా? అని రాహుల్ ప్రశ్నించారు. ఒక భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడడం తన విధి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాగా తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 6న ఒకే దశలో జరగనుండగా, మే 2న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఈ సారి బరిలో ప్రధానంగా కాంగ్రెస్-డీఏంకే, బీజేపీ-ఏఐఏడీఎంకె కూటమి హోరీ హోరీగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. -
తమిళనాడులో బీజేపీకి కేసీఆర్ సహకారం
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇన్చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నియామకం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి తమిళనాడు ఎన్నికలకు నిధులు సమకూరుతున్నాయని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మాట్లాడుతూ టీఆర్ఎస్ సహకారం తమిళనాడుకు పూర్తిస్థాయిలో చేరేందుకే కిషన్‌రెడ్డిని నియమించారని దుయ్యబట్టారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీకి పూర్తిగా సహకరిస్తానని ప్రధానితో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ఇంటెలిజెన్స్‌ను తమిళనాడుకు పంపి బీజేపీకి కేసీఆర్ సహకరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర బలగాల భద్రత కల్పించండి.. బ్లూ స్టార్ ఆపరేషన్ చేసి, తనను అంతమొందిస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గతంలో హెచ్చరించిన నేపథ్యంలో తనకు కేంద్ర బలగాల భద్రత కల్పించాలని రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం అమిత్ షాకు వినతిపత్రం ఇచ్చారు. గతేడాది మార్చిలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హోం శాఖకు తన భద్రత విషయంలో విజ్ఞప్తి చేసినప్పటికీ ఏడాదిగా ఎలాంటి ఫలితంలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. -
అన్నాడీఎంకేలో ‘సీఎం’ వేడి
చెన్నై: ఎన్నికలకు మరో 9 నెలల సమయముండగానే అన్నాడీఎంకేలో తదుపరి సీఎం ఎవరనే అంశంపై వేడి రాజుకుంది. కొన్నాళ్లుగా ఈ విషయంలో మంత్రులు బాహటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీనికితోడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ శనివారం పలుచోట్ల పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి సీఎం పళనిస్వామి, పన్నీరు సెల్వంలతో భేటీ అవుతున్నారు. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం అభ్యర్థిపై ప్రచారాలు మొదలు కావడంతో పళనిస్వామి, పన్నీరు సెల్వం శనివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ సమష్టిగా జరుగుతాయని, వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ బాహాటంగా ప్రకటించకూడదని కోరారు. ‘ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంతో సహా నిర్ణయాలన్నీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొనే జరుగుతాయి. విజయం కోసం పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదు. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’అని ఆ ప్రకటనలో అగ్రనేతలిద్దరూ హెచ్చరించారు. ఇటీవల సహకారశాఖ మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనే దానిపై నిర్ణయం ఉంటుందని అన్నారు. మరో మంత్రి కేటీ రాజేంద్ర స్పందిస్తూ పళనిస్వామే సీఎం అభ్యర్థని ప్రకటించారు. దీంతో పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగి ‘ఏఐఏడీఎంకే లక్ష్యం... వరుసగా మూడోసారి నెగ్గడం. అదే అమ్మ (జయలలిత) కల కూడా. అందరూ క్రమశిక్షణతో ఈ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని ట్వీట్ చేశారు. -
ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఒక విషయంలో మోసపోయా’నని అన్నారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో గురువారం ఉదయం రజనీ మక్కల్ మన్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ విషయంలో తాను మోసపోయానని అనడం చర్చనీయాంశమైంది. పార్టీ ఏర్పాటుపై రాని స్పష్టత రాజకీయ అరంగేట్రం చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తానని 2017 డిసెంబర్లో అభిమానుల నడుమ రజనీకాంత్ బహిరంగంగా ప్రకటించారు. అయితే రెండేళ్లుగా పార్టీని స్థాపించకున్నా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తూత్తుకూడి కాల్పులు, పౌరహక్కుల చట్టం సవరణపై అభిప్రాయాన్ని వెలిబుచ్చి వివాదాల్లో చిక్కుకున్నారు. రజనీ విమర్శలు బీజేపీకి అనుకూలంగా మారాయి. అదే సమయంలో తనపై కాషాయం రంగు పులిమే ప్రయత్నాలు సాగుతున్నాయి, అది ఎంతమాత్రం కుదరదని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రజనీ ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి రజనీకాంత్ సొంతపార్టీని స్థాపించి ఒంటరిపోరుకు దిగుతారా, కమల్‌తో కలిసిపోతారా? అనేది వెయ్యిడాలర్ల ప్రశ్నగా మారింది. చదవండి: కమల్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం గెలుపోటములపై చర్చ.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగితే పార్టీ హిట్టా..ఫట్టా..అధికారంలోకి వస్తామా? తదితర వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా మన్రం నిర్వాహకులను సమావేశంలో రజనీ కోరినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇతర పార్టీల బలాలు? గెలిచే అభ్యర్థులు? కమల్ పార్టీతో జత కడితే లాభమా, నష్టమా? ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా?..తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని రజనీకాంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తంకండి, ఎన్నికలు ఎçప్పుడు వచ్చినా ఢీకొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీలతో కూటమి జోలికి పోకుండా ఒంటరిపోరే మంచిదని కార్యదర్శులు రజనీకి సూచించినట్లు సమాచారం. సమావేశం అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. ఏడాది తరువాత రజనీ మక్కల్ మన్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమై అనేక విషయాలపై చర్చించానని అన్నారు. ఈ సమావేశం తనకు, కార్యదర్శులకు సంతృప్తినిచ్చిందని అన్నారు. ముస్లిం పెద్దలతో తాను ఇటీవల భేటీ అయ్యానని అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్ గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నానని.. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాలను కలుసుకుని చట్టంలో మార్పుల గురించి వారికి వివరించాలని సూచించాని తెలిపారు. మోదీ, అమిత్‌షాలను కలుసుకునేందుకు సహాయం చేస్తానని వారికి చెప్పానన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యత తన వల్ల తొలగిపోతుందా? కమల్‌తో కూటమి ఉంటుందా అనే ప్రశ్నలకు కాలమే బదులు చెబుతుందని చెప్పారు. చదవండి: శభాష్ మిత్రమా రజనీకాంత్: కమల్‌హాసన్ ఒక విషయంలో మోసపోయాను సమావేశానికి సంబంధించి ఒక విషయంలో తాను మోసపోయానని ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమిటో తర్వాత చెబుతానని అన్నారు. రజనీ మక్కల్ మన్రం కార్యకలాపాలు బయటకు పొక్కడమే రజనీ అసంతృప్తికి కారణమని సమాచారం. ఈనెల 5న కార్యదర్శులతో జరిపే సమావేశానికి హాజరుకావాల్సిందిగా రజనీకాంత్ స్వయంగా వారందరికీ ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితమే రజనీ సమావేశంపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రజనీ ఇల్లు, కల్యాణమండపం వద్ద పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు వచ్చేశారు. “మీకు వ్యక్తిగతంగా ఫోన్లో ఇచ్చిన సమాచారం మీడియా దృష్టికి ఎలా వెళ్లింది, అంతమాత్రం గోప్యం పాటించకపోతే ఎలా’ అంటూ కార్యదర్శుల ముందు రజనీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ముఠాతగాదాలు, వర్గపోరాటాలను ఎంతమాత్రం సహించను, అలాంటి వారు ఎవరైనా ఉంటే వైదొలగిపోండని ఒక సమావేశంలో రజనీ హెచ్చరించారు. అయితే గురువారం నాటి సమావేశానికి హాజరయ్యే సందర్భంలోనూ కొందరు వర్గపోరును కొనసాగించడం రజనీదృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మన్రం నిర్వాహకుల్లోని విబేధాలు పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని రజనీ ఆందోళన చెందడం వల్లనే “మోసపోయాను’ అని చెప్పినట్లు ఊహిస్తున్నారు. పార్టీ ఏర్పాట్లకు సంబంధించి అంతర్గత విషయాలు, రాజకీయ ప్రవేశం ప్రకటించగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, బూత్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా రజనీ ఆదేశించారు. సుమారు 66 వేల బూత్ కమిటీలు, ఒక కోటికిపైగా సభ్యత్వం పూర్తయినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఒక సందర్భంలో రజనీ సైతం ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే ఆ తరువాత సభ్యులు, బూత్ కమిటీల జాబితాను పరిశీలించగా నకిలీ సభ్యుల వ్యహారం బయటపడింది. పార్టీలో పదవుల కోసం కొందరు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు రజనీకాంత్ తెలుసుకున్నారు. ఈ నకిలీ సభ్యుల చేరిక పనులను మనసులో పెట్టుకునే “మోసపోయాను’ అని వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు. నిరాశపడిన అభిమానులు రజనీ మక్కల్ మన్రం జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపానికి ఉదయం 10.25 గంటలకు రజనీ చేరుకోగా పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్న అభిమానులు “తలైవా తలైవా’ అంటూ నినాదాలు చేశారు. కారులో నుంచే వారికి అభివాదం చేస్తూ లోనికి వెళ్లిపోయారు. రాష్ట్రం నలుమూలల నుంచి 37 మంది కార్యదర్శులు హాజరుకాగా వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న తరువాతనే సమావేశం హాలులోకి పంపారు. కల్యాణమండపం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. సుమారు గంటన్నరపాటు రజనీ సమావేశమయ్యారు. -
తమిళనాడు >>> డీఎంకే
డేట్ లైన్ – చెన్నై తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు, కచ్చితంగా నెల తరువాత రాష్ట్రంలోని 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం మామూలే కానీ. తమిళ రాజకీయ దిగ్గజాలు పురచ్చితలైవి జయలలిత, కళైజ్ఞర్ కరుణానిధి లేకుండా పోలింగ్ జరుగుతుండటం విశేషం. అందుకేనేమో.. వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు నేతలు, కార్యకర్తలు. ప్రస్తుతం తమిళనాట పార్టీల్లో ఎలాగైనా గెలవాలన్న ఆరాటం కనిపిస్తోందే కానీ.. ఓ స్ఫూర్తిమంతమైన పోరాటం చేసే వారిగా మాత్రం అధినేతలు కనిపించడం లేదు. జాతీయ అంశాలకే ప్రాధాన్యం.. జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. సహజంగానే ఈ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. కాకపోతే బీజేపీతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు మోదీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నాయి. సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు పెట్టిన పోస్టులు మినహా అధికారికంగా, విశ్వాసంతో మోదీ ప్రభుత్వం గురించి ప్రజలకు చెప్పడంలో స్థానిక బీజేపీ నాయకులే తడబడుతున్నారు. అన్నాడీఎంకే నేతల సంగతి ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. ఈ రెండు పార్టీల ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే మాత్రం మోదీ వ్యతిరేక ప్రచారంలో పై చేయి సాధించింది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న ఇక్కట్లను ఏకరువు పెట్టడంలో డీఎంకే ఫ్రంట్ చాలా వరకు విజయం సాధించింది. అంతేకాకుండా అన్ని వర్గాల విద్యార్థులు ఎంబీబీఎస్‌లో చేరేందుకు వీలు కల్పించే నీట్ పరీక్షను కూడా మోదీకి వ్యతిరేకంగా వాడుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది. ఈ పరీక్ష కారణంగా ప్రైవేట్ కళాశాలల వ్యాపారం దారుణంగా దెబ్బతినడం ఇందుకు కారణం. ప్రైవేట్ కళాశాలలను నిర్వహిస్తున్న జగద్రక్షకన్ వంటి రాజకీయ నేతలు డీఎంకేలోనే ఉన్నారు. కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో గుర్తించిన సహజవాయు, ముడిచమురు నిక్షేపాలను వెలికితీసే విషయంలోనూ డీఎంకే కేంద్రానికి వ్యతిరేకంగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులను గతంలో డీఎంకే హయాంలోనే ప్రారంభించారు. అప్పటి వల్ల అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందిన డీఎంకే ఇప్పుడు వాటిని వ్యతిరేకించడం విడ్డూరమే అయినా దీన్ని అనుకూలంగా మలుచుకోవడంలో డీఎంకే విజయవంతమైంది. మీడియా మద్దతు కూడా డీఎంకేకు ప్లస్ పాయింట్. ఎందుకంటే , పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం కేంద్రం మద్దతుతో పత్రికా స్వేచ్ఛను అణచివేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. చెదరని అమ్మ ఓటుబ్యాంకు అన్నాడీఎంకే విషయానికొస్తే జయలలిత ఓటుబ్యాంకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ 15 శాతం వరకు ఓట్లను తనకు అనుకూలంగా చీల్చడంలో విజయం సాధిస్తారని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు దినకరన్, మరోవైపు డీఎంకే ఫ్రంట్లతో తలపడుతున్న పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు జయలలితకు తామే నిజమైన వారసులమని చెబుతూ ఆవిడ ఆశయాలను పథకాలను కొనసాగిస్తామని ప్రజలకు చెప్పడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దినకరన్ ఆర్కేనగర్లో చేసిన ప్రయోగాన్ని తిరిగి ఇప్పుడు కూడా మరింత పకడ్బందీగా చేసి అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించి కేంద్రంలో కింగ్ మేకర్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలలో ఎనిమిది స్థానాలు దక్కించుకోగలిగితే పళనిస్వామి ప్రభుత్వానికి ఈ పదవీకాలం ముగిసే వరకు ఢోకా లేదు. ఒకవేళ డీఎంకే లేదా దినకరన్‌కు ఎక్కువ స్థానాలు దక్కితే అధికార పీఠాన్ని కాపాడుకోవలసిన పరీక్ష మళ్లీ అన్నాడీఎంకేకు తప్పదు. కులాలవారీగా ఇక్కడ కూడా ప్రజలు చీలిపోయి ఉన్నారు. కుంభకోణాల పార్టీలుగా డీఎంకే, కాంగ్రెస్‌ను కలిపి అభివర్ణిస్తూ కేంద్రంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ పతనానికి దారితీసిన అవినీతి కుంభకోణాలను ఏకరువుపెడుతూ పళనిస్వామి డీఎంకే ఫ్రంట్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అవినీతిని ఒక అంశంగా ఓటర్లు పరిగణించే కాలం పోయింది కాబట్టి ఈ ప్రచారం ఎంతవరకు అన్నాడీఎంకే కు ఉపయోగపడుతుందో చెప్పలేము. మోదీపై వ్యతిరేకత? తమిళనాడులో బీజేపికి ఉన్న ఓటు బ్యాంకు 3–4 శాతానికి మించి లేనప్పటికీ.. మోదీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం మాత్రం అన్నాడీఎంకే ప్రభుత్వంపై పడుతోంది. దాని ప్రభావం డీఎంకేకు లభించవచ్చు. స్టాలిన్ గొప్ప నాయకుడు కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అండతో ఒక ప్రత్యామ్నాయం కావాలనుకునే వారికీ ఆశాకిరణంగా నిలిచారనే చెప్పాలి. రెండు ద్రావిడ పార్టీలలో ఏదో ఒక దానికి పగ్గాలు అందివ్వడం తమిళనాట సంప్రదాయంగా వస్తోంది కాబట్టి.. అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ కంటే డీఎంకేకు మద్దతివ్వడం మేలని ప్రజలు ఆలోచిస్తున్నారు. సముద్ర తీరం వెంబడి తిరువళ్లూరు నుంచి కన్యాకుమారి వరకు 15 లోక్‌సభ స్థానాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు మత్స్యకారులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓఖీ తుపాను సమయంలో రాహుల్ గాంధీ పర్యటించి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్రం అండతో అభివృద్ధి నిరాటంకంగా కొనసాగిస్తామని డీఎంకే ప్రచారం చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే మనకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని డీఎంకే ఫ్రంట్, బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నాడీఎంకే ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అనిశ్చితాలు, అసత్య ప్రచారాలు, వైరుధ్యాల మధ్య తమిళ ప్రజల తీర్పు ఎవరిని గెలిపిస్తుందో చూడాలి. -
వీడియో రచ్చ..
సాక్షి, చెన్నై: ఎన్నికల సమయంలో మూడు కంటైనర్లలో పట్టుబడ్డ నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించిన వీడియో ఓ ఛానల్‌కు చిక్కింది. అందులోని దృశ్యాలు చర్చ నీయంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుప్పూర్ వద్ద జరిపిన తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు పట్టుబడ్డ విషయం తెలిసిందే. మూడు కంటైనర్లలో ఉన్న ఆ నగదు కలకలం రేపాయి. కొన్ని గంటల తర్వాత ఆ నగదు తమదేనంటూ ఎస్బీఐ వర్గాలు ముందుకు వచ్చాయి. కోయంబత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ నగదు తరలింపు అనుమానాలకు తావివ్వడంతో డీఎంకే వర్గాలు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ సీబీఐ వేగవంతం చేసింది. ఈ సమయంలో ఆ నగదు పట్టుకునే క్రమంలో సాగిన వ్యవహారాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు బయట పడ్డాయి. ఇది ఓ మీడియాకు చిక్కడం, అందులో నాటకీయంగా చోటు చేసుకున్న కొన్ని దృశ్యాలు డీఎంకే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు. తిరుప్పూర్ వైపుగా వస్తున్న ఆ లారీలను తొలుత ఓ అధికారి పట్టుకుని విచారించడం, పేపర్లు అన్నీ సక్రమంగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చి మరీ పంపించి ఉండడం తొలి కెమెరా రికార్డు నమోదు మేరకు వెలుగులోకి వచ్చి ఉన్నది. ఆ అధికారికి , కంటైనర్లలో నగదు ఉన్నట్టు, తాము మఫ్టీ పోలీసులం అంటూ ఆ కంటైనర్ల వెంట వచ్చిన ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌కు చెందిన వాహనాల్లో ఉన్న వారు వివరించి ఉన్నారు. అలాగే, తమ వద్ద యూనిఫాంలు లేవన్నట్టుగా వ్యాఖ్యలు చేసి ఉండడం, చివరకు ఆ అధికారి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి ఉండడం దృశ్యాలను ఆ చానల్ మంగళవారం ప్రసారం చేసింది. ఆ కంటైనర్లు కొంత దూరం వెళ్లినానంతరం మరో అధికారి తనిఖీలు చేయడం, వారి వద్ద ఎలాంటి ఆధారాలు, సర్టిఫికెట్లు లేకపోవడం, మఫ్టీలో ఉన్న వాళ్లు కొందరు యూనిఫాంలతో ప్రత్యక్షం కావడం మరో కెమెరా రికార్డు ద్వారా వెలుగులోకి రావడం గమనార్హం. రెండోసారిగా తనిఖీలు చేసినా అధికారి, ఎ వరికో సమాచారం ఇవ్వడం, తక్షణం పోలీసు ఉన్నతాధికారులు సైతం అక్కడికి ఉరకలు తీయడం, ఆ కంటైనర్లలోని బాక్సులను విప్పిమరీ అందులో ఉన్న నోట్ల కట్టల్ని చూడడం వంటి దృశ్యాలు తాజాగా బయట పడడంతో చర్చనీయాంశంగా మారింది. తొలుత ఓ అధికారి క్లీన్ చిట్ ఇవ్వడం, రెండో సారిగా తనిఖీలు జరిపిన అధికారులు నిక్కచ్చితనంగా వ్యవహరించడం, అందులోని నోట్ల కట్టల్ని విప్పి చూడడం, వంటి దృశ్యాలతో పాటు , ఆంధ్రా వైపుగా వెళ్లాల్సిన వాహనాలు తిరుప్పూర్ వైపుగా ఎందుకు వచ్చాయని ఆ అధికారులు ప్రశ్నించడం వంటి దృశ్యాలు తాజాగా బయట పడడంతో రాష్ట్రంలో చర్చ బయలు దేరింది. ఈ వీడియో దృశ్యాలు ఎన్నికల సమయంలో తనిఖీల్లో భాగంగా తీసినవేనని స్పష్టం అయ్యాయి. ఇది కాస్త సీబీఐ విచారణకు మరింత కీలక ఆధారంగా మారే అవకాశాలు ఉన్నాయి. -
నేతలకు 'నోటా' దెబ్బ
* 22 నియోజక వర్గాల్లో 5.58 లక్షల నోటా ఓట్లు * అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు * పుదుచ్చేరిలో నోటాకు 13,240 ఓట్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: బలమైన కొండ చిలువ చలిచీమల చేత చిక్కి చచ్చినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నేతలు కేవలం నోటా ఓట్ల కారణంగా ఓటమి పాలయ్యారు. మొత్తం 22 నియోజకవర్గాల్లో 5.58 లక్షల మంది నోటాకు ఓటు వేసి అన్ని పార్టీల నేతలపై అయిష్టతను చాటుకున్నారు. కొందరు అభ్యర్థులను ఓటమి పాలుచేయడంలో నోటా ఓటర్లు కీలపాత్ర పోషించారు. ఎన్నికల్లో పోటీచేసే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం, ప్రతి అభ్యర్థికి ఓ చరిత్ర ఉంటుంది. పార్టీల సిద్ధాంతాన్ని, అభ్యర్థి నేపథ్యాన్ని ఇష్టపడని ప్రజలు ఓటును నోటాకు వేసి తమ నిరసనను వ్యక్తం చేసే వెసులుబాటు ఈవీఎంలలో ఉంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు గానూ 232 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. గురువారం ఓట్ల లెక్కింపు పూర్తికాగా 22 నియోజకవర్గాల్లో 5.58 లక్షల మంది నోటాకు ఓట్లు వేయడం ఎన్నికల కమిషన్‌ను ఆశ్చర్యపరిచింది. అంటే మొత్తం పోలైన ఓట్లలో 1.3 శాతం మంది నోటాకు ఓటువేశారు. ఈ నోటా ఓట్లు ఓ విధంగా అన్నాడీఎంకే అభ్యర్థులకు మేలుచేశాయి. 22 నియోజకవర్గాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు నోటా ఓట్ల కంటే తక్కువ మెజార్టీలో గెలుపొందారు. రాధాపురం డీఎంకే అభ్యర్థి 47 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో 1831 మంది నోటాకు ఓటు వేశారు. వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ అన్నాడీఎంకే అభ్యర్థి చేతిలో కేవలం 87 ఓట్ల తేడాతో ఓటమిపాలైనారు. ఈ నియోజకవర్గంలో నోటాకు 1025 ఓట్లు పడ్డాయి. ఇలా అనేక నియోజకవర్గాల్లో నోటా ఓట్ల కారణంగానే అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపు బాటపట్టారు. రాధాపురం, కాట్టుమన్నార్ కోవిల్, అన్నానగర్, ఆవడి, పెరంబూరు, తిరుపోరూరు, తిరుమయం, తిరునెల్వేలీ, తిరువిడైమరుదూర్, కోవిల్పట్టి, మడత్తుకుళం, కినత్తుకడవు, కరూరు, కడైయనల్లూరు, చిదంబరం, సెయ్యూరు, పర్కూరు, తెన్‌కాశీ, పేరావూరణి, పాపిరెడ్డిపట్టి, ఓట్టాభిటరాంలలో నోటా ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించాయి.మదుైరె తిరుమంగళంలో పీఎంకే అభ్యర్థి కన్నయ్యకు కేవలం 843 ఓట్లు రాగా, ఆయన కంటే నోటాకే ఎక్కువ (1,572) ఓట్లు పడ్డాయి. తిరువళ్లూరు జిల్లా లో సుమారు 3వేల ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే ఈరోడ్డు, తూత్తుకూడి జిల్లాల్లో 34,278 ఓట్లు నోటాకు వేయడం ద్వారా అభ్యర్థులపై తమ అయిష్టతను చాటుకున్నారు. పుదువైలో నోటాకు 13,240 ఓట్లు: పుదుచ్చేరిలో 30 నియోజవర్గాల్లో మొత్తం 13,240 ఓట్లు నోటాకు వేశారు. తట్టాంజావడి నియోజకర్గంలో అత్యధికంగా 922 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే మాకోయిల్ నియోజక వర్గంలో 109 ఓట్లు నోటాకు వేశారు. -
సొంత గ్రామాలకు తరలుతున్న ప్రజలు
క్రిష్ణగిరి: తమిళనాడు శాసనసభ ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు తమిళనాడు ఓటర్లు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తరలివెళ్లుతున్నారు. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపార రీత్యా వలస వెళ్లినవారు తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఆదివారం తమిళనాడుకు బయలుదేరారు. కర్ణాటక సరిహద్దు హొసూరు బస్టాం డు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఓటువేసేదుకు తమిళనాడు ఓటర్ల ఆసక్తి కనిపించింది. సంక్రాం తి పండుగ కోసం గ్రామాలకు వెళ్లే రద్దీ హొసూరు బస్స్టాం డులో కనిపించింది. ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్ల ను పార్టీల నాయకులు డబ్బులిచ్చి గ్రామాలకు రప్పించుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడులో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయాణికులను తీసుకెళ్లుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు సూళగిరికి వెళ్లకుండా జాతీయ రహదారిపైనే వెళ్లడంతో సూళగిరి బస్టాండులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సూ ళగిరిలోనికి బస్సులు రావాలని డిమాండ్ చేయడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆర్టీసీ అధికారులతో చెప్పి బస్సులను మళ్లించడంతో ఆందోళన విరమించారు. -
పీఠం ఎవరిదో?
సర్వేలతో గందరగోళం అన్నాడీఎంకే వైపు మూడు డీఎంకేదే అధికారమని రెండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీది అధికారమనే కోణంలో జరిపిన సర్వేలు ‘సర్వం మాయ...సర్వేల మాయ’ అనిపిస్తున్నాయి. గురువారం నాటికి ప్రముఖంగా ఐదు సర్వేలు జరుగగా అన్నాడీఎంకే ప్రభుత్వం ఖాయమని మూడు సర్వేలు తేల్చేశాయి. మరో రెండు సర్వేలు డీఎంకేకు ప్రజలు పట్టం కడతారని స్పష్టం చేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర తలరాతను నిర్ణయించే 16వ తేదీ దగ్గరపడుతోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోలింగ్‌కు ముచ్చటగా మూడురోజులే ఉంది. ఎన్నికల ప్రచారం రేపటితో ముగిసిపోనుంది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి, భారతీయ జనతాపార్టీలతో పంచముఖ పోటీ నెలకొని ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే సాగుతోంది. ఈరెండు పార్టీల్లో ఏదో ఒకటి అధికారంలోకి రావడం ఖాయమని అందరికీ తెలుసు. అయితే ఈ రెండింటిలో ఏపార్టీ అనేదే సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తం 234 స్థానాల్లో అన్నాడీఎంకే 227 చోట్ల పోటీచేస్తూ, మరో 7 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మిత్రపక్షాలు కూడా అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు (రెండాకులు)పైనే పోటీచేస్తున్నాయి. అన్నాడీఎంకే ఆవిర్భవించిన తరువాత ఒకే గుర్తుపై అన్నిస్థానాల్లో పోటీచేయడం ఒక రికార్డుగా నిలిచింది.డీఎంకేతోపాటూ ప్రజా సంక్షేమ కూటమి కూటమి సైతం తమదే అధికారం అంటున్నాయి. ఒంటరిగా రంగంలో ఉన్న పీఎంకే సీఎం పీఠం తమదేననే ధీమాను వ్యక్తం చేస్తోంది. అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు ఖాయమని, అది తమపార్టీతోనే జరుగబోతోందని డీఎంకే విశ్వాసంతో ఉంది. సీఎంలే కాదు, అధికారంలో ఉండే పార్టీలే మారిపోవడాన్ని చూస్తారని ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే చెబుతోంది. ఇలా ఎవరికి వారు తమదే అధికారమని ప్రచారం చే సుకుంటున్న తరుణంలో వివిధ సంస్థలు సర్వేలతో రంగ ప్రవేశం చేశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా ప్రజలారా తలలు బద్దలు కొట్టుకోవద్దు, ఇదిగో తాము తేల్చేస్తామని ప్రజల్లోకి వెళ్లాయి. టైమ్స్ నవ్, ఇండియా టీవీ, సీ వోటర్.. ఈ మూడు సంస్థలు సంయుక్తంగా సర్వేలు జరిపాయి. నాలుగు వారాలపాటూ నిర్వహించిన సర్వేలో మొత్తం 10,467 మందిని కలుసుకుని అభిప్రాయాన్ని సేకరించాయి. వీరిలో 39 శాతం మంది అన్నాడీఎంకేకు అనుకూలంగా చెప్పారు. 130 స్థానాలతో అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. డీఎంకే కూటమికి 32 శాతం ఓట్లతో 70 స్థానాల్లో మాత్రమే అవకాశం ఉందని తేలింది. మిగిలిన కూటములు 25 నుండి 34 శాతం ఓట్లతో 34 సీట్లు దక్కించుకోవచ్చని పేర్కొన్నారు. పుదియతలైమురై, ఏపీడీ సంస్థలు సంయుక్తంగా రెండుసార్లు సర్వే నిర్వహించాయి. ఈ సంస్థలు సైతం అన్నాడీఎంకేకే వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొన్నాయి. జనవరి 22 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు నిర్వహించిన తొలిదశ సర్వేలో 5,018 మంది నుండి అభిప్రాయాలు సేకరించాయి. ఈ సర్వేలో 32.83 శాతం మంది 119 సీట్లతో అన్నాడీఎంకే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అలాగే డీఎంకే కూటమికి 115 స్థానాలకు అవకాశం ఉందని తేలింది. డీఎండీకేకు 5.21 శాతం ఓట్లకే పరిమితం కాగలదని, సంక్షేమ కూటమి సంపూర్ణంగా లేదని ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వేలో స్పష్టమైంది. ఏప్రిల్ 18 నుంచి మే 4వ తేదీ వరకు రెండో దశ సర్వే నిర్వహించారు. అయితే రెండో దశ సర్వేలో ఆశ్చర్యకరంగా అన్నాడీఎంకే బాగా పుంజుకున్నట్లుగా వెల్లడైంది. 38.58 శాతం ఓట్లతో 164 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్బవిస్తుందని తేలింది. డీఎంకే కూటమి 32.11శాతం ఓట్లతో కేవలం 66 స్థానాలతో సరిపెట్టుకోక తప్పదని సర్వే స్పష్టం చేసింది.దినమలర్ దినపత్రిక, న్యూస్-7 టీవీ చానల్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఇటీవలే వెల్లడైంది. రాష్ట్రం నలుమూలల నుండి 2.34 లక్షల మంది నుండి అభిప్రాయాలను సేకరించింది. వీరు జరిపిన సర్వేలో 108 స్థానాలతో డీఎంకే అధికారం చేపట్టుతుందని, అన్నాడీఎంకేకు కేవలం 52 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. పీఎంకే, బీజేపీ తలా ఒక సీటును మాత్రమే గెలుచుకుంటాయని పేర్కొంది. 72 స్థానాల్లో గట్టి పోటీ నెలకొని ఉందని చెప్పింది. గుడ్‌విల్ కమ్యూనికేషన్స్ అనే సంస్థ గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది మే వరకు 4 సార్లు సర్వే నిర్వహించింది. జూలై 15 నుండి 30వ తేదీ వరకు 2,500 మంది, డిశంబరు 15 నుండి 30వ తేదీ వరకు 3,200 మంది అభిప్రాయాలను సేకరించింది. అలాగే మార్చి 10 నుండి 20వ తేదీ వరకు 3,800 మంది, ఏప్రిల్ 10 నుండి మే 5వ తేదీ వరకు 4,650 మంది అభిప్రాయాలను తెలుసుకుంది. ఈ సర్వేలో డీఎంకే కూటమిదే అధికారమని తేలింది. 43 శాతం ఓట్లతో 127-139 సీట్లను గెలుచుకుని డీఎంకే అధికారం చేపట్టుతుందని తెలిపింది. అన్నాడీఎంకే 38 శాతం ఓట్లను పొందడం ద్వారా 81-90 సీట్లుతో సరిపెట్టుకోగలదని అభిప్రాయపడింది. ఇతర పార్టీలు 19 శాతం ఓట్లతో 14-17 సీట్లను పంచుకుంటాయని తెలిపింది. ఎన్ని సంస్థలు, ఎన్నిరకాల సర్వేలు చేసినా ప్రజల సిసలైన తీర్పు కోసం ఈనెల 19వ తేదీ సాయంత్రం వరకు వేచిచూడక తప్పదు. ఐదు సర్వేలు-ఫలితాలు: 1. ఇండియా టీవీ :అన్నాడీఎంకే-116, డీఎంకే 101. 2. పుదియతలైమురై: అన్నాడీఎంకే-164, డీఎంకే-56. 3. టైమ్స్ నౌ:అన్నాడీఎంకే 130, డీఎంకే-70. 4. న్యూస్ 7, దినమలర్: డీఎంకే 108, అన్నాడీఎంకే-52. 5. గుడ్‌విల్ కమ్యూనికేషన్: డీఎంకే-139, అన్నాడీఎంకే 90. -
ఫ్రీ ఫోన్లు.. సగం ధరకే స్కూటీలు
* జయలలిత ఎన్నికల హామీలు * 100 నుంచి 750 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు * ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం.. రైతు రుణాల మాఫీ సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తాము గెలిస్తే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు అందిస్తామని, మహిళలకు 50% రాయితీపై స్కూటర్లనూ అందిస్తామని పేర్కొంటూ అధికార అన్నా డీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పలు ‘ఉచిత’ హమీలను ప్రకటించారు. పొంగల్ పండుగ సమయంలో కో-ఆప్టెక్స్ నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి రూ.500 విలువచేసే కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. 11, 12 తరగతుల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే పథకాన్ని కొనసాగిస్తామనీ, ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్నీ కల్పిస్తామని చెప్పారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని.. గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, నేత కార్మికులకు కేటగిరీల వారీగా 200 నుంచి 750 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించారు. గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు వల్ల 78 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నెల 16న జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి అన్నా డీఎంకే పార్టీ మేనిఫెస్టోను గురువారం ఈరోడ్ జిల్లా పెరుందురైలో జయలలిత విడుదల చేశారు. గురువారం నాడే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, తమ మిత్రపక్షమైన డీఎంకే అధినేత కరుణానిధితో కలిసి తమిళనాడులో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే వ్యూహాత్మకంగా ఇదే రోజు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టో ముఖ్యాంశాలు * వృత్తి విద్యా శిక్షణనిచ్చి ప్రతి ఇంటి నుంచి ఒకరికి ఉద్యోగం * దశల వారీగా రాష్ట్రంలో మద్యనిషేధం అమలు * బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫై సౌకర్యం * ప్రభుత్వ ఆధీనంలో నడిచే కేబుల్ టీవీ సంస్థల కనెక్షన్లు తీసుకునే వారికి ఉచిత సెట్ టాప్ బాక్సుల పంపిణీ * ప్రసూతి సెలవులు తొమ్మిది నెలలకు పెంపు, ప్రసూతి సాయం రూ. 12,000 నుంచి 18,000 కు పెంపు * ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు రూ. 40 లక్షల వరకు సాయం * ఈఎంఐ తరహాలో అమ్మ బ్యాంకింగ్ కార్డులు * అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రత్యేక ఫౌండేషన్ * పెళ్లి చేసుకునే జంటలకు ఇస్తున్న మంగళసూత్రాల్లో బంగారం 4 గ్రాముల నుంచి 8 గ్రాములకు పెంపు * లోకయుక్త ఏర్పాటు -
తమిళనాడు ఎన్నికల్లో ఆరుగురు హిజ్రాలు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు హిజ్రాలు పోటీకి దిగుతున్నారు. వీరిలో ఒకరు ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాల్లో పురుషుల సంఖ్య అధికంగా ఉండేది. క్రమేణా స్త్రీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, ఈసారి ఎన్నికల్లో ఆశ్చర్యకరంగా కొన్ని పార్టీలు హిజ్రాలకు అవకాశమివ్వడంతో వారి పేర్లు అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఆరుగురు హిజ్రాలు పోటీకి దిగుతున్నారు. ఆర్కేనగర్ నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా జయలలిత పోటీచేస్తుండగా, అదే స్థానంలో దేవీ అనే హిజ్రాకు నామ్ తమిళర్ కట్చి అవకాశం కల్పించింది. అలాగే, డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా పోటీకి దిగుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మధురై నుంచి స్వతంత్య్ర అభ్యర్థి భారతికన్నమ్మ రంగంలో నిలవడం ద్వారా ఎన్నికల్లో పోటీచేసిన తొలి హిజ్రాగా రికార్డు నెలకొల్పారు. ఆ ఎన్నికల తరువాత హీరో శరత్‌కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చిలో భారతికన్నమ్మ చేరారు. ఆ తరువాత అభిప్రాయబేధాలతో పార్టీ నుంచి వైదొలిగారు. హిందు మక్కల్ కట్చి తరపున మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అనసూయ అనే హిజ్రా పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మదురై దక్షిణం నుంచి పోటీ చేస్తున్నట్లు భారతి కన్నమ్మ తెలిపారు. ఏదైనా పార్టీ తరఫునా.. లేదా స్వతంత్య్ర అభ్యర్థిగానా.. అనేది రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. హిజ్రాలు తమ హక్కుల సాధన కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కన్నమ్మ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనతో కలిపి మొత్తం ఆరుగురు హిజ్రాలు పోటీ చేస్తున్నారని చెప్పారు. -
కుష్బుపై హిజ్రాల ఆగ్రహం...
చెన్నై : ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత కుష్బుపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై హిజ్రాలు పున:పరిశీలన చేసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలను హిజ్రాలు ఖండిస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ జాతీయ సమాచార ప్రతినిధి అయిన కుష్బు ఓ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె రాబోయే ఎన్నికల్లో హిజ్రాలు పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అనే విషయంపై వారు ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చుట్టుముట్టి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ ఉత్తర భారతదేశానికి చెందిన కుష్బు గత కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన మహిళల శీలాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇప్పుడు హిజ్రాల విషయంలోనూ అదేవిధంగా మాట్లాడటం ఆవేదన కలిగించిందన్నారు. కుష్బు నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని హిజ్రాలు స్పష్టం చేశారు. -
తమిళనాడులో రజనీకాంత్ ప్రచారం
- పార్టీ అధికారిక ప్రకటన చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రచారం చేసేందుకు అంగీకరించినట్లు ఆ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. మూడు ప్రధాన వేదికల నుంచి ప్రసంగించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు రజనీని ఒప్పించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వివిధ పీఠాధిపతులు, స్వాములు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆ పార్టీ తెలిపింది. గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో రజనీకి పార్టీ తీర్థం ఇప్పించాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా నరేంద్రమోదీ చెన్నైకి వచ్చినపుడు రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిశారు. అయితే ఇది కేవలం స్నేహపూర్వక కలయికని మోదీ సమక్షంలోనే రజనీకాంత్ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు రజనీకాంత్ ప్రచారం కూడా చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా రజనీకాంత్ క్రేజ్‌ను ఓట్లుగా మలచుకోవాలని కమలనాథులు మరో ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీకి ప్రచారంపై ఇప్పటివరకు రజనీకాంత్ నుంచి స్పందన లేదా ఖండన వెలువడలేదు. -
ఒంటరి పోరేనా?
కూటమిపై బీజేపీ ఆశ పోటీకై తమిళిసై దరఖాస్తు సీట్ల సర్దుబాటుకు డీఎంకేలో బృందం చెన్నై : ద్రవిడ పార్టీలకు దీటుగా బీజేపీలో సైతం దరఖాస్తుల పర్వం సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు శనివారంతో గడువు ముగుస్తుండగా శనివారం మధ్యాహ్నానికి రెండువేల మంది పైగా దరఖాస్తులు అందాయి. త్వరలో కూటమి ఖరారు కాగలదని బీజేపీ ఆశాభావంతో ఉంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు లేని బలమైన కూటమి ఏర్పాటుతో రికార్డు సృష్టించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకింత వెనుకబడిందని చెప్పవచ్చు. అధికార పీఠం ఎక్కించే ఎన్నికలు కావడంతో ప్రతిపార్టీ పొత్తుల విషయంలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వెంట నిలిచిన ప్రాంతీయ పార్టీలు తలోదారి చూసుకోగా డీఎండీకే మాత్రం ఉండలేక, వెళ్లలేక ఊగిసలాడుతోంది. ప్రధానమైన ప్రాంతీయ పార్టీల్లో ఓ మోస్తరు స్పష్టత వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ నాన్చుడు ధోరణి పొత్తును ఆశిస్తున్న పార్టీలకు తలనొప్పిగా మారింది. డీఎండీకే కోసం ఒకవైపు బీజేపీ, మరోవైపు డీఎంకే అలుపెరుగని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. తమతో రమ్మంటూ ప్రజాస్వామ్య కూటమి సైతం పిలుపునిచ్చింది. విజయకాంత్ వైఖరేంటో తేలగానే రాష్ట్రంలోని అన్ని కూటముల్లో ప్రచార వ్యూహం ఊపందుకుంటుంది. ఒంటరిపోరుతో బలపరీక్షకు సైతం కమలనాథులు వెనుకాడడం లేదు. మరికొద్దికాలం వేచిచూసి తమ నిర్ణయం ప్రకటించాలని బీజేపీ నిర్ణయించుకుంది. ప్రాంతీయ పార్టీల పొత్తు కోసం కాలం వృథాచేయకుండా సొంతకాళ్లపై నిలబడేందుకు సిద్ధం కావాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ కారణం చేతనే పార్టీలోని ముఖ్యనేతలంతా ఎన్నికల్లో పోటీచేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. కూటమి ఇంకా ఖరారు కాని పరిస్థితిలో సైతం పోటీకి పెద్ద సంఖ్యలో నేతలు ముందుకు రావడం అందరినీ ఆశ్చ్యర్యపరుస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు తొలిరోజైన శుక్రవారం నాడు 1,300 మంది దరఖాస్తు చేయగా, శనివారం గడువు ముగిసే సమయానికి ఈ సంఖ్య రెండువేలకు మించిపోనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, ఉపాధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, సీనియర్ నేతలు హెచ్ రాజా, కరుప్పు మురుగానందం, నరేంద్రన్ నామినేషన్లు వేశారు. చక్రవర్తినాయుడు పేరున పది: తమ అభిమాన నేత పేరున పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వేయడం ఇప్పటి వరకు అన్నాడీఎంకే, డీఎంకేలో మాత్రమే సాగుతోంది. అయితే ఈసారి బీజేపీలో సైతం అదేస్థాయి ఒరవడి అబ్బురపరుస్తోంది. తెలుగు ప్రముఖుడు ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) ప్రధాన కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తినాయుడు ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆయన పేరున అభిమానులు పది నామినేషన్లు వేశారు. తిరుత్తణి నుంచి పోటీ చేయాలంటూ ఐదుగురు, చెన్నై అన్నానగర్ నుంచి బరిలోకి దిగాలంటూ మరో ఐదుగురు చక్రవర్తినాయుడు పేరున దరఖాస్తులు సమర్పించారు. డీఎంకేలో సర్దుబాటు బృందం: మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న డీఎంకే సీట్ల సర్దుబాటుకు బృందాన్ని నియమించినట్లు ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ శనివారం ప్రకటించారు. డీఎంకేలో సాగుతున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలు శనివారం నాటికి పదోరోజుకు చేరుకున్నాయి. డీఎంకే టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇంటర్వ్యూల కోసం చెన్నై తేనాంపేటలోని అన్నాఅరివాలయంలో ప్రతిరోజూ బారులు తీరుతున్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చేరిపోయింది. డీఎండీకే సైతం చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎండీకే వల్ల తమ పార్టీ ఎన్నికల పనుల్లో ప్రతిష్టంభన నెలకొనలేదని ఈ ప్రచారాలపై స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
ఇక సమరమే
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 22వ తేదీ నుంచి నామినేషన్లు మే 16న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు తమిళనాడు, పుదుచ్చేరీలకూ ఒకే షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. రాజకీయపార్టీల గుండెల్లో గెలుపు ఓటముల గుబులు మొదలైంది. రాజకీయ పార్టీలు, ప్రజలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. తమిళనాడు, పుదుచ్చేరీ రాష్ట్రాల్లో మే 16న పోలింగ్ జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీమ్జైదీ ఢిల్లీలో ప్రకటన చేయడం ద్వారా సమరశంఖం పూరించారు. శుక్రవారం నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. చెన్నై : రాష్ట్రంలోని రాజకీయపార్టీలను అధికార అందలం ఎక్కించేది అసెంబ్లీ ఎన్నికలే. ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేదా డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వామపక్షాల వంటి జాతీయ పార్టీలైనా, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, తమాకా తదితర ప్రాంతీయ పార్టీలైనా అన్నాడీఎంకే, డీఎంకేల వెనక నడవాల్సిందే. అయితే 2011 నాటి ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. గత ఎన్నికల్లో జయలలిత, కరుణానిధి మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రంగంలో ఉండగా, ఈసారి వారిద్దరితోపాటు డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ బరిలో ఉన్నారు. డీఎండీకే, బీజేపీ, అన్నాడీఎంకే, తమాకాలు పొత్తుల విషయంలో ఇంకా ఊగిసలాట ధోరణినే కొనసాగిస్తున్నాయి. కింగ్‌ను (ముఖ్యమంత్రి) కావాలని పట్టుపడుతున్న విజయకాంత్ ఓ మెట్టుదిగి డీఎంతో పొత్తు కుదిరితే ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే, బీజేపీలు మిత్రపక్షాలు మారుతాయని కొందరు అంచనావేస్తున్నారు. డీఎండీకేను ఒకవైపు బీజేపీ, మరోవైపు డీఎంకే, ప్రజాస్వామ్య కూటమిలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మిత్రపక్షాలు ఎవరో, ప్రతిపక్షాలు ఎవరో ఇంకా రాజకీయ పార్టీలు తేల్చుకోకముందే ఎన్నికల గంట మోగేసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉరుకులు పరుగులు మొదలైనాయి. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలు తిరిగి ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు ప్రారంభించాల్సిన తరుణంలో రెండుమూడు రోజుల్లో పొత్తుల కసరత్తును ముగించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ జాగ్రత్త : రాజేష్ లఖానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున కోడ్ అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ ప్రకటించారు. ప్రభుత్వం కొత్త పథకాలు, ప్రకటనలు చేయకూడదని ఆదేశించారు. ప్రభుత్వ కార్యదర్శులు, అధికారులు తమ ఉత్తర్వులలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయరాదని సూచించారు. వాహనాల తనిఖీలు వెంటనే ప్రారంభించామని, అనధికార నగదు, ఇతర వస్తువులు ఉంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలు వినియోగించరాదని అన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎటువంటి చర్యలను సహించబోమని పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం తరపున గత కొంతకాలంగా ఆర్థిక సహాయం పంపిణీ సాగుతోందని, ఇకపై పంపిణీ చేయాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని అన్నారు. ఈవీఎంలో ఓటువేసి వేసిన తరువాత తమ ఓటు సరైన అభ్యర్థికి పడిందా అని తనిఖీ చేసుకునే వెసులుబాటును ఆ యంత్రాల్లో కల్పించామని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూలు : ఏప్రిల్ 22వ తేదీన నామినేషన్లు ప్రారంభం ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల స్వీకరణ ముగింపు ఏప్రిల్ 30 వ తేదీన నామినేషన్ల పరిశీలన మే 2వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణ మే 16వ తేదీన పోలింగ్ మే 19వ తేదీన ఓట్ల లెక్కింపు మే 21వ తేదీతో ఎన్నికల ప్రక్రియకు తెర -
స్టార్లతో ప్రచారం
సాక్షి, చెన్నై : ప్రముఖ స్టార్లతో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంపు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగం లక్ష్యంగా వీడియో చిత్రీకరణ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఈసీ రాజేష్ లఖానీ నేతృత్వంలో అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. గత ఏడాది ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని, ఈ సారి మరింతగా పెంచడం లక్ష్యంగా చర్యలు చేపట్టి ఉన్నారు. ప్రధానంగా 18 నుంచి 29 ఏళ్లలోపు వారు పెద్ద ఎత్తున గత ఏడాది ఓటు హక్కు వినియోగించుకోని దృష్ట్యా, అట్టి వారిని ఆకర్షించేందుకు స్టార్లను రంగంలోకి దించనున్నారు. ఓటు విలువను గుర్తు చేస్తూ యువతకు సందేశాన్ని ఇచ్చే విధంగా వీడియో క్లిప్పింగ్‌సను విడుదల చేయడానికి ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో సినీ స్టార్ కార్తీతో ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణ చేసి ఉన్నారు. అలాగే, క్రికెటర్లు అశ్విన్, దినేష్ కార్తిక్, స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ వంటి వారితోనూ ఓటర్లలో చైతన్యం తెచ్చే విధంగా ప్రకటనల విడియో సిద్ధం చేసి ఉన్నారు. మరి కొంత మంది యువ స్టార్ల ద్వారా సైతం ప్రత్యేకంగా వీడియో చిత్రీకరించి , వాటి ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి ఓటింగ్ శాతం పెంపునకు కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటి వరకు తీసిన వీడియో క్లిపింగ్‌లను ఒకటి రెండు రోజుల్లో ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వాటిల్లో విడుదల చేయడానికి రాజేష్ లఖానీ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. -
సర్వేలతో జనం సతమతం
సర్వే జనా సుఖినోభవంతు డీఎంకే ప్రభుత్వం ఖాయమన్న లయోలా సర్వే మళ్లీ అన్నాడీఎంకేకు పట్టమన్న మరో సర్వే చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘రానున్నది డీఎంకే ప్రభుత్వమే-లయోలా కాలేజీ పూర్వవిద్యార్థుల సర్వే సారాంశం. కాదు కాదు ప్రజలు మరోసారి అన్నాడీఎంకు పట్టం కట్టనున్నారు-స్వామి జ్యోతిష్యం. రాబోయే ఎన్నికల్లో ఎవరిది అధికారం అనే ప్రశ్నకు ఎవరికివారు అనుకూలంగా సమాధానం రాబట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలంటే ప్రజలందరికీ ఉత్సుకతే. అందునా రాజకీయ పార్టీల సంగతి చెప్పక్కర్లేదు. ప్రతి ఎన్నికల్లోనూ పొత్తులతోనే పొద్దుపొడిచే ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక ప్రముఖ పార్టీ పంచన చేరడం, అధికార పీఠంపై కూర్చోవడం ఖాయం. రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేలకు సైతం పొత్తులు తప్పడం లేదు. గత ఎన్నికల్లో డీఎండీకేతో చెలిమి చేసిన అన్నాడీఎంకే ఈసారి బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్‌తో పదేళ్లు కలిసి కాపురం చేసి కటీఫ్ చెప్పిన డీఎంకే మళ్లీ పాత మిత్రునితో రాజీపడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ప్రభుత్వానికి ఎంతో కొంత బాటలు వేస్తున్నా కూటమికి సారథ్యం వహించే ప్రధాన పార్టీ ప్రభావం జయాపజయాలను నిర్ణయిస్తుంది. ఇదిలా ఉండగా, డీఎంకే నేతృత్వంలో ఏర్పడ నుండి కూటమికి ప్రభుత్వలోకి రావడం ఖాయమని లయోలా కాలేజీ పూర్వ విద్యార్దులు ఇటీవల చేసిన సర్వేఫలితాలను శనివారం పునరుద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం ఖాయం, తన తండ్రే (కరుణానిధి) ముఖ్యమంత్రి అంటూ స్టాలిన్ శనివారం చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మరో ఐదేళ్లు కొనసాగితే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు అంటూ డీఎంకేతో పొత్తుకు సిద్ధమవుతున్న టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ వేలూరులో శనివారం జరిగిన సమావేశంలో ప్రజలను హెచ్చరించారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేకే అధిక అవకాశాలు ఉన్నాయని తమ సర్వేలో తేలిందని రిటైర్డు ప్రొఫెసర్ రాజలింగం శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనే అంశంపై ‘ప్రజా సర్వే’ పేరున రాజలింగం సర్వే జరిపారు. ఈ మాజీ ప్రొఫెసర్ సైతం లయోలా కాలేజీ నుంచి ఉద్యోగ విరమణ పొందినవారే కావడం గమనార్హం. ఈనెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 120 నియోజకవర్గాల్లో చేసిన సర్వేలో హెచ్చుశాతం ప్రజలు మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరుకున్నారని ఆయన తెలిపారు. గత నాలుగేళ్ల అమ్మపాలన బాగుందని 55.2 శాతం మంది మెచ్చుకున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఏపార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రశ్నించగా అన్నాడీఎంకే అంటూ 37.3, డీఎంకే ప్రభుత్వమని 35.7శాతం బదులిచ్చారని ఆయన అన్నారు. రెండు ప్రధాన పార్టీలు అధికారంలోకి వస్తాయని రెండు బృందాలు చేపట్టిన సర్వేలతో ఏది నమ్మాలో తెలియక ప్రజలు సతమతం అవుతున్నారు. లయోలా కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థుల సర్వేలో డీఎంకే ప్రభుత్వమని, అదే కాలేజీకి చెందిన పూర్వ అధ్యాపకుడు చేసిన సర్వేలో అన్నాడీఎంకే ప్రభుత్వమని పేర్కొనడం ద్వారా ‘సర్వే’జనా సుఖినోభవంతు అని తేల్చారు. -
సీమాన్ సేన రెడీ!
ప్రప్రథమంగా అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు నామ్ తమిళర్ కట్చి సిద్ధమయింది. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు పది నెలలకు ముందుగానే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. చెన్నై: శ్రీలంకలోని ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా సినీ దర్శకుడు సీమాన్ నామ్ తమిళర్ ఇయక్కంను గతంలో ఏర్పాటు చేశారు. ఎల్టీటీఈ అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ ఆదర్శంగా, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ, ఈ ఇయక్కం ద్వారా బహిరంగ సభల్లో ఆయన చేసే ప్రసంగం వివాదానికి దారితీస్తూ వచ్చింది. కేసుల మోత సైతం మోగాయి. అయినా, తగ్గని సీమాన్ తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల తన ఇయక్కంను రాజకీయ పార్టీగా ప్రకటించారు. నామ్ తమిళర్ కట్చి పేరిట కార్యక్రమాలను విస్తృత పరుస్తూ వస్తున్నారు. ప్రధానంగా తమిళ ఈలం లక్ష్యంగా, తమిళుల అభ్యున్నతి నినాదంతో ముందుకు సాగుతున్న సీమాన్ మరో అడుగు ముం దుకు వేశారు. రాష్ట్రంలో ఏ పార్టీలతో పొత్తు తమకు అవసరం లేదని, తమిళులతోనే తమ మద్దతు అంటూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రప్రథమంగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలలకు పైగా సమయం ఉన్నా, దాంతో తమకు పని లేదంటూ, ఇప్పుడే తమ అభ్యర్థుల తొలి చిట్టాను ప్రకటించేశారు. సీమాన్ సేన రెడీ కొద్ది రోజులుగా సీమాన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. తమిళాభిమానుల మద్దతు కూడగట్టుకునే విధంగా అక్కడక్కడ బిహ రంగ సభల్ని నిర్వహిస్తూ సంచనల, వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం గూడువాంజేరిలో జరిగిన సభలో ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటిస్తూ, తొలి విడతగా తొమ్మిది మందితో అభ్యర్థుల చిట్టాను విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా న్యాయవాదులు ఉండటం గమనార్హం. ఆ మేరకు నాగుర్కోయిల్- కాకలై కుట్టుదళం, శివగంగై - ఎలిల్ కుమార్, తిరువాడనై - రాజీవ్ గాంధీ అలియాస్ అరివు సెల్వం, షోళింగనల్లూరు - రాజన్, తిరుపత్తూరు - సినీ నిర్మాత కోట్టై కుమార్, మైలం- డాక్టర్ విజయలక్ష్మి, అంబత్తూరు - అన్భు తెన్నరసన్, గౌండం పాళయం - సినీ దర్శకుడు కార్వణ్ణన్, కుంభకోణం - మణి సెంథిల్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఒంటరిగా సిద్ధం అయ్యామని, పట్టున్న చోట్ల మాత్రమే తమ పోటీ ఉంటుందంటూనే, తమిళుల కోసం ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కాంక్షతో ముందుకు వెళ్తున్నామని సీమాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కారాగారాల్లో పదిఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న వాళ్లను క్రమ శిక్షణను పరిగణలోకి తీసుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పరిష్కారం కోసం జూలై పదిన మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టై, పుళల్ కారాగారాల ముందు ఆందోళనలు చేపట్టనున్నామని ప్రకటించారు. అలాగే, శ్రీలంక నుంచి వస్తున్న ఈలం తమిళుల్ని విచారణ పేరిట వేదించ వద్దని, ప్రత్యేక శిబిరాల్లో ఉన్న వాళ్లకు స్వేచ్ఛ కలిగించాలని డిమాండ్ చేశారు.