సర్వేలతో జనం సతమతం
సర్వే జనా సుఖినోభవంతు
డీఎంకే ప్రభుత్వం ఖాయమన్న లయోలా సర్వే
మళ్లీ అన్నాడీఎంకేకు పట్టమన్న మరో సర్వే
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘రానున్నది డీఎంకే ప్రభుత్వమే-లయోలా కాలేజీ పూర్వవిద్యార్థుల సర్వే సారాంశం. కాదు కాదు ప్రజలు మరోసారి అన్నాడీఎంకు పట్టం కట్టనున్నారు-స్వామి జ్యోతిష్యం. రాబోయే ఎన్నికల్లో ఎవరిది అధికారం అనే ప్రశ్నకు ఎవరికివారు అనుకూలంగా సమాధానం రాబట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలంటే ప్రజలందరికీ ఉత్సుకతే. అందునా రాజకీయ పార్టీల సంగతి చెప్పక్కర్లేదు. ప్రతి ఎన్నికల్లోనూ పొత్తులతోనే పొద్దుపొడిచే ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక ప్రముఖ పార్టీ పంచన చేరడం, అధికార పీఠంపై కూర్చోవడం ఖాయం.
రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేలకు సైతం పొత్తులు తప్పడం లేదు. గత ఎన్నికల్లో డీఎండీకేతో చెలిమి చేసిన అన్నాడీఎంకే ఈసారి బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్‌తో పదేళ్లు కలిసి కాపురం చేసి కటీఫ్ చెప్పిన డీఎంకే మళ్లీ పాత మిత్రునితో రాజీపడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు ప్రభుత్వానికి ఎంతో కొంత బాటలు వేస్తున్నా కూటమికి సారథ్యం వహించే ప్రధాన పార్టీ ప్రభావం జయాపజయాలను నిర్ణయిస్తుంది.
ఇదిలా ఉండగా, డీఎంకే నేతృత్వంలో ఏర్పడ నుండి కూటమికి ప్రభుత్వలోకి రావడం ఖాయమని లయోలా కాలేజీ పూర్వ విద్యార్దులు ఇటీవల చేసిన సర్వేఫలితాలను శనివారం పునరుద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం ఖాయం, తన తండ్రే (కరుణానిధి) ముఖ్యమంత్రి అంటూ స్టాలిన్ శనివారం చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మరో ఐదేళ్లు కొనసాగితే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు అంటూ డీఎంకేతో పొత్తుకు సిద్ధమవుతున్న టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ వేలూరులో శనివారం జరిగిన సమావేశంలో ప్రజలను హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేకే అధిక అవకాశాలు ఉన్నాయని తమ సర్వేలో తేలిందని రిటైర్డు ప్రొఫెసర్ రాజలింగం శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనే అంశంపై ‘ప్రజా సర్వే’ పేరున రాజలింగం సర్వే జరిపారు. ఈ మాజీ ప్రొఫెసర్ సైతం లయోలా కాలేజీ నుంచి ఉద్యోగ విరమణ పొందినవారే కావడం గమనార్హం.
ఈనెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 120 నియోజకవర్గాల్లో చేసిన సర్వేలో హెచ్చుశాతం ప్రజలు మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరుకున్నారని ఆయన తెలిపారు. గత నాలుగేళ్ల అమ్మపాలన బాగుందని 55.2 శాతం మంది మెచ్చుకున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఏపార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రశ్నించగా అన్నాడీఎంకే అంటూ 37.3, డీఎంకే ప్రభుత్వమని 35.7శాతం బదులిచ్చారని ఆయన అన్నారు.
రెండు ప్రధాన పార్టీలు అధికారంలోకి వస్తాయని రెండు బృందాలు చేపట్టిన సర్వేలతో ఏది నమ్మాలో తెలియక ప్రజలు సతమతం అవుతున్నారు. లయోలా కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థుల సర్వేలో డీఎంకే ప్రభుత్వమని, అదే కాలేజీకి చెందిన పూర్వ అధ్యాపకుడు చేసిన సర్వేలో అన్నాడీఎంకే ప్రభుత్వమని పేర్కొనడం ద్వారా ‘సర్వే’జనా సుఖినోభవంతు అని తేల్చారు.