నేతలకు 'నోటా' దెబ్బ | Election results 2016: More than 1 per cent NOTA votes in four out of five states | Sakshi
Sakshi News home page

నేతలకు 'నోటా' దెబ్బ

Published Sat, May 21 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

Election results 2016: More than 1 per cent NOTA votes in four out of five states

* 22 నియోజక వర్గాల్లో 5.58 లక్షల నోటా ఓట్లు
* అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు
* పుదుచ్చేరిలో నోటాకు 13,240 ఓట్లు

సాక్షి ప్రతినిధి, చెన్నై: బలమైన కొండ చిలువ చలిచీమల చేత చిక్కి చచ్చినట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నేతలు కేవలం నోటా ఓట్ల కారణంగా ఓటమి పాలయ్యారు. మొత్తం 22 నియోజకవర్గాల్లో 5.58 లక్షల మంది నోటాకు ఓటు వేసి అన్ని పార్టీల నేతలపై అయిష్టతను చాటుకున్నారు.

కొందరు అభ్యర్థులను ఓటమి పాలుచేయడంలో నోటా ఓటర్లు కీలపాత్ర పోషించారు.  ఎన్నికల్లో పోటీచేసే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం, ప్రతి అభ్యర్థికి ఓ చరిత్ర ఉంటుంది. పార్టీల సిద్ధాంతాన్ని, అభ్యర్థి నేపథ్యాన్ని ఇష్టపడని ప్రజలు ఓటును నోటాకు వేసి తమ నిరసనను వ్యక్తం చేసే వెసులుబాటు ఈవీఎంలలో ఉంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు గానూ 232 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. గురువారం ఓట్ల లెక్కింపు పూర్తికాగా 22 నియోజకవర్గాల్లో 5.58 లక్షల మంది నోటాకు ఓట్లు వేయడం ఎన్నికల కమిషన్‌ను ఆశ్చర్యపరిచింది. అంటే మొత్తం పోలైన ఓట్లలో 1.3 శాతం మంది నోటాకు ఓటువేశారు. ఈ నోటా ఓట్లు ఓ విధంగా అన్నాడీఎంకే అభ్యర్థులకు మేలుచేశాయి.  

22 నియోజకవర్గాల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులు నోటా ఓట్ల కంటే తక్కువ మెజార్టీలో గెలుపొందారు. రాధాపురం డీఎంకే అభ్యర్థి 47 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో 1831 మంది నోటాకు ఓటు వేశారు. వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ అన్నాడీఎంకే అభ్యర్థి చేతిలో కేవలం 87 ఓట్ల తేడాతో ఓటమిపాలైనారు. ఈ నియోజకవర్గంలో నోటాకు 1025 ఓట్లు పడ్డాయి.

ఇలా అనేక నియోజకవర్గాల్లో నోటా ఓట్ల కారణంగానే అన్నాడీఎంకే అభ్యర్థులు గెలుపు బాటపట్టారు. రాధాపురం, కాట్టుమన్నార్ కోవిల్, అన్నానగర్, ఆవడి, పెరంబూరు, తిరుపోరూరు, తిరుమయం, తిరునెల్వేలీ, తిరువిడైమరుదూర్, కోవిల్‌పట్టి, మడత్తుకుళం, కినత్తుకడవు, కరూరు, కడైయనల్లూరు, చిదంబరం, సెయ్యూరు, పర్కూరు, తెన్‌కాశీ, పేరావూరణి, పాపిరెడ్డిపట్టి, ఓట్టాభిటరాంలలో నోటా ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించాయి.మదుైరె  తిరుమంగళంలో  పీఎంకే అభ్యర్థి కన్నయ్యకు కేవలం 843 ఓట్లు రాగా, ఆయన కంటే నోటాకే ఎక్కువ (1,572)  ఓట్లు పడ్డాయి. తిరువళ్లూరు జిల్లా లో సుమారు 3వేల ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే ఈరోడ్డు, తూత్తుకూడి జిల్లాల్లో 34,278 ఓట్లు నోటాకు వేయడం ద్వారా అభ్యర్థులపై తమ అయిష్టతను చాటుకున్నారు.
 
పుదువైలో నోటాకు 13,240 ఓట్లు:   పుదుచ్చేరిలో 30 నియోజవర్గాల్లో మొత్తం 13,240 ఓట్లు నోటాకు వేశారు. తట్టాంజావడి నియోజకర్గంలో అత్యధికంగా 922 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే మాకోయిల్ నియోజక వర్గంలో 109 ఓట్లు నోటాకు వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement