స్టార్‌లతో ప్రచారం
సాక్షి, చెన్నై : ప్రముఖ స్టార్లతో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంపు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగం లక్ష్యంగా వీడియో చిత్రీకరణ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఈసీ రాజేష్ లఖానీ నేతృత్వంలో అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. గత ఏడాది ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని, ఈ సారి మరింతగా పెంచడం లక్ష్యంగా చర్యలు చేపట్టి ఉన్నారు. ప్రధానంగా 18 నుంచి 29 ఏళ్లలోపు వారు పెద్ద ఎత్తున గత ఏడాది ఓటు హక్కు వినియోగించుకోని దృష్ట్యా, అట్టి వారిని ఆకర్షించేందుకు స్టార్‌లను రంగంలోకి దించనున్నారు.
ఓటు విలువను గుర్తు చేస్తూ యువతకు సందేశాన్ని ఇచ్చే విధంగా వీడియో క్లిప్పింగ్‌సను విడుదల చేయడానికి ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో సినీ స్టార్ కార్తీతో ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణ చేసి ఉన్నారు. అలాగే, క్రికెటర్లు అశ్విన్, దినేష్ కార్తిక్, స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ వంటి వారితోనూ ఓటర్లలో చైతన్యం తెచ్చే విధంగా ప్రకటనల విడియో సిద్ధం చేసి ఉన్నారు. మరి కొంత మంది యువ స్టార్ల ద్వారా సైతం ప్రత్యేకంగా వీడియో చిత్రీకరించి , వాటి ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి ఓటింగ్ శాతం పెంపునకు కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటి వరకు తీసిన వీడియో క్లిపింగ్‌లను ఒకటి రెండు రోజుల్లో ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వాటిల్లో విడుదల చేయడానికి రాజేష్ లఖానీ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు.