Star Campaign
-
స్టార్ క్యాంపెయినర్ సిద్ధూకు ఫుల్ గిరాకీ!
సాక్షి, న్యూడిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్‌గా మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. గత డిసెంబర్లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున సిద్ధూ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం నిర్వహించి.. కాంగ్రెస్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో మంచి వాగ్ధాటి ఉన్న సిద్ధూతో తమ రాష్ట్రాల్లో ప్రచారానికి పంపాలని ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సిద్ధూను ప్రచారంలో విస్తృతంగా వాడుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీకి మంచి ఛరిష్మా, ప్రజాదరణ ఉండటంతో ఆమెతో యూపీతోపాటు ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. హిందీ రాష్ట్రాలతోపాటు, పశ్చిమ బెంగాల్లోనూ ప్రచారం చేయాల్సిందిగా సిద్ధూను కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా, టీవీ యాంకర్‌గా ప్రసిద్ధుడైన సిద్ధూ మంచి వాగ్ధాటి గల నేత. పరిస్థితులకు తగ్గట్టూ ప్రత్యర్థులపై పంచ్ డైలాగులు విసురుతూ.. ఆయన జనాన్ని ఆకట్టుకోగలరు. తన ప్రసంగశైలితో, డైలాగులతో హాస్యాన్ని పంచగలరు. దీంతోపాటు ప్రజలకు చక్కగా హిందీ అర్థమయ్యేలా మాట్లాడటంలో దిట్ట. దీంతో హిందీ రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయాలోనూ ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టాలని భావిస్తోంది. గత డిసెంబర్లో జరిగిన మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై సిద్ధూ సంధించిన వ్యంగ్యాస్త్రాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌ను కూడా పలు హిందీ రాష్ట్రాల్లో ప్రచారం చేయవల్సిందిగా కాంగ్రెస్ కోరుతోంది. యువ నాయకులైన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జ్యోతిరాధిత్యా సింధియాలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారబరిలోకి కాంగ్రెస్ దింపనుంది. పైలట్ రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయనున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సింధియా తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోనూ ప్రచారం చేయనున్నారు. ఇక, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కొన్ని లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసే అవకాశముంది. -
ములాయం స్టార్ క్యాంపెయినర్ కాదా?
లక్నో: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ పేరు లేకుండానే శనివారం ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ స్థానం అయిన ఆజంగఢ్ నుంచి ఈసారి ములాయం కొడుకు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో నిలవనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ శనివారం 40 మంది నేతలతో కూడిన ప్రచార సారథుల జాబితా విడుదల చేసింది. ఇందులో అఖిలేశ్, ఆయన భార్య డింపుల్‌తోపాటు నేతలు ఆజంఖాన్, రామ్‌గోపాల్, జయా బచ్చన్ తదితరుల పేర్లున్నాయి. ములాయం పేరు లేదు. పొరపాటును గుర్తించిన పార్టీ నాయకత్వం వెంటనే ఆ జాబితాలో ఆయన పేరును చేర్చి మరో లిస్టును ఎన్నికల సంఘానికి పంపించింది.. -
కండలవీరుడి ప్రచారం కలిసొచ్చేనా..?
భోపాల్ : స్టార్ క్యాంపెయినర్లు ఎంతమంది ఉన్నా సినీ తారలు ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ అభ్యర్ధులు సినీ నటుల ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సినీ గ్లామర్ ఉపకరిస్తుందని ఆశిస్తుంటారు. ఇదే కోవలో ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇండోర్‌లో ప్రచారం చేసేలా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 1965లో ఇండోర్‌లో జన్మించిన సల్మాన్ ముంబైకి వెళ్లక ముందు బాల్యమంతా అక్కడే గడిచిందని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇండోర్‌లో తమ పార్టీ తరపున ప్రచారం చేపట్టేందుకు బాలీవుడ్ కండలవీరుడితో ఇప్పటికే పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. సల్మాన్ తాత ఇండోర్‌లో సీనియర్ పోలీస్ అధికారిగా పనిచేశారని, సల్మాన్ బాల్యమంతా ఇక్కడే సాగిందని ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో భారీసంఖ్యలో సల్మాన్‌కు అభిమానులున్నారని ఆయన ప్రచారంతో ఇండోర్‌లో తమ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా 1989లో సుమిత్రా మహజన్ అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం ప్రకాష్ చంద్ర సేథిని ఓడించడం ద్వారా బీజేపీకి ఇండోర్‌ను కంచుకోటగా మార్చారు. మహజన్ అప్పటి నుంచి ఈ స్ధానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. మరోవైపు 2009లో కాంగ్రెస్ ఇండోర్ మేయర్ అభ్యర్థి పంకజ్ సంఘవి తరపున సల్మాన్ రోడ్‌షోలో పాల్గొన్నారు. అయితే అప్పట్లో కండలవీరుడి ప్రచారం కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధించి మేయర్ పీఠమెక్కారు. ఇక ఏప్రిల్ 29 నుంచి నాలుగు దశల్లో మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. -
స్టార్లతో ప్రచారం
సాక్షి, చెన్నై : ప్రముఖ స్టార్లతో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంపు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగం లక్ష్యంగా వీడియో చిత్రీకరణ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఈసీ రాజేష్ లఖానీ నేతృత్వంలో అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. గత ఏడాది ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుని, ఈ సారి మరింతగా పెంచడం లక్ష్యంగా చర్యలు చేపట్టి ఉన్నారు. ప్రధానంగా 18 నుంచి 29 ఏళ్లలోపు వారు పెద్ద ఎత్తున గత ఏడాది ఓటు హక్కు వినియోగించుకోని దృష్ట్యా, అట్టి వారిని ఆకర్షించేందుకు స్టార్లను రంగంలోకి దించనున్నారు. ఓటు విలువను గుర్తు చేస్తూ యువతకు సందేశాన్ని ఇచ్చే విధంగా వీడియో క్లిప్పింగ్‌సను విడుదల చేయడానికి ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో సినీ స్టార్ కార్తీతో ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణ చేసి ఉన్నారు. అలాగే, క్రికెటర్లు అశ్విన్, దినేష్ కార్తిక్, స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ వంటి వారితోనూ ఓటర్లలో చైతన్యం తెచ్చే విధంగా ప్రకటనల విడియో సిద్ధం చేసి ఉన్నారు. మరి కొంత మంది యువ స్టార్ల ద్వారా సైతం ప్రత్యేకంగా వీడియో చిత్రీకరించి , వాటి ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి ఓటింగ్ శాతం పెంపునకు కసరత్తుల్లో నిమగ్నం అయ్యారు. ఇప్పటి వరకు తీసిన వీడియో క్లిపింగ్‌లను ఒకటి రెండు రోజుల్లో ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వాటిల్లో విడుదల చేయడానికి రాజేష్ లఖానీ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. -
రేపటితో ప్రచారానికి తెర
నియోజకవర్గాల్లో అభ్యర్థుల సుడిగాలి పర్యటనలు సినీ స్టార్లతో ప్రచార హోరు తాయిలాల పర్వం మొదలు పోలీసుల విస్తృత తనిఖీలు సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల పక్రియలో భాగంగా జరుగుతున్న బహిరంగ ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడనుంది. దీంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. మరోవైపు ‘తాయిలాల’కు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండగా, అదే సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ప్రచార గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్‌షోలతో ప్రజల వద్దకు వెళ్లి తమను ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఆయా పార్టీలు కూడా తమ ‘స్టార్ క్యాంపెయిన్ల’తో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్రమోడీ ఆదివారం ఒక్కరోజే ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని చిక్కబళాపుర, చిక్కమగళూరు, హావేరిలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై ప్రసంగించారు. ఆ పార్టీ జాతీయ నేతలైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్, వెంకయ్యనాయుడు కూడా బెంగళూరులో ఆదివారం జరిగిన పలు బహిరంగ ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ ప్రచారంతో రాష్ట్రన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని పార్టీలు చివరి రెండు రోజులైనా ఓటర్లను ఆకర్షించడానికి వెండి, బుల్లితెర నటులను తమ ప్రచార కార్యక్రమాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రచారానికి దూరంగా ఉన్న గోల్డెన్‌స్టార్ గణేష్, రాగిణీ ద్వివేదిలు కూడా ప్రచారం చేయనున్నారు. తాయిలాల పర్వం మొదలు : ఇప్పటి వరకూ బహిరంగ వేదికలపై ఉపన్యాసాలతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించిన అభ్యర్థులు ఇక ఓటర్లుకు తాయిలాలు అందజేస్తూ తమ వైపునకు తిప్పుకునే పర్వానికి తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంది. చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా ఉంచింది. ఇప్పటి వరకు రూ. 21.36 కోట్ల నగదు, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, చీరలు తదితర సొత్తుతో పాటు రూ.2.77 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా శాంతి భద్రతలకు ఎటువ ంటి విఘాతం కలగకుండా ఉండటానికి పారామిలటరీ దళాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.