- నియోజకవర్గాల్లో అభ్యర్థుల సుడిగాలి పర్యటనలు
- సినీ స్టార్లతో ప్రచార హోరు
- తాయిలాల పర్వం మొదలు
- పోలీసుల విస్తృత తనిఖీలు
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల పక్రియలో భాగంగా జరుగుతున్న బహిరంగ ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడనుంది. దీంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. మరోవైపు ‘తాయిలాల’కు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండగా, అదే సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో నిఘా పెంచారు.
ప్రచార గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్‌షోలతో ప్రజల వద్దకు వెళ్లి తమను ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఆయా పార్టీలు కూడా తమ ‘స్టార్ క్యాంపెయిన్ల’తో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్రమోడీ ఆదివారం ఒక్కరోజే ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని చిక్కబళాపుర, చిక్కమగళూరు, హావేరిలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై ప్రసంగించారు.
ఆ పార్టీ జాతీయ నేతలైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్, వెంకయ్యనాయుడు కూడా బెంగళూరులో ఆదివారం జరిగిన పలు బహిరంగ ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ ప్రచారంతో రాష్ట్రన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని పార్టీలు చివరి రెండు రోజులైనా ఓటర్లను ఆకర్షించడానికి వెండి, బుల్లితెర నటులను తమ ప్రచార కార్యక్రమాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రచారానికి దూరంగా ఉన్న గోల్డెన్‌స్టార్ గణేష్, రాగిణీ ద్వివేదిలు కూడా ప్రచారం చేయనున్నారు.
తాయిలాల పర్వం మొదలు : ఇప్పటి వరకూ బహిరంగ వేదికలపై ఉపన్యాసాలతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించిన అభ్యర్థులు ఇక ఓటర్లుకు తాయిలాలు అందజేస్తూ తమ వైపునకు తిప్పుకునే పర్వానికి తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంది. చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా ఉంచింది. ఇప్పటి వరకు రూ. 21.36 కోట్ల నగదు, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, చీరలు తదితర సొత్తుతో పాటు రూ.2.77 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా శాంతి భద్రతలకు ఎటువ ంటి విఘాతం కలగకుండా ఉండటానికి పారామిలటరీ దళాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.