
తమిళనాడులో రజనీకాంత్ ప్రచారం
- పార్టీ అధికారిక ప్రకటన
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రచారం చేసేందుకు అంగీకరించినట్లు ఆ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. మూడు ప్రధాన వేదికల నుంచి ప్రసంగించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు రజనీని ఒప్పించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వివిధ పీఠాధిపతులు, స్వాములు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆ పార్టీ తెలిపింది. గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో రజనీకి పార్టీ తీర్థం ఇప్పించాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది.
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా నరేంద్రమోదీ చెన్నైకి వచ్చినపుడు రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిశారు. అయితే ఇది కేవలం స్నేహపూర్వక కలయికని మోదీ సమక్షంలోనే రజనీకాంత్ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు రజనీకాంత్ ప్రచారం కూడా చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా రజనీకాంత్ క్రేజ్‌ను ఓట్లుగా మలచుకోవాలని కమలనాథులు మరో ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీకి ప్రచారంపై ఇప్పటివరకు రజనీకాంత్ నుంచి స్పందన లేదా ఖండన వెలువడలేదు.