వీడియో రచ్చ..
సాక్షి, చెన్నై: ఎన్నికల సమయంలో మూడు కంటైనర్లలో పట్టుబడ్డ నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించిన వీడియో ఓ ఛానల్‌కు చిక్కింది. అందులోని దృశ్యాలు చర్చ నీయంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుప్పూర్ వద్ద జరిపిన తనిఖీల్లో కోట్లాది రూపాయల నగదు పట్టుబడ్డ విషయం తెలిసిందే. మూడు కంటైనర్లలో ఉన్న ఆ నగదు కలకలం రేపాయి. కొన్ని గంటల తర్వాత ఆ నగదు తమదేనంటూ ఎస్‌బీఐ వర్గాలు ముందుకు వచ్చాయి. కోయంబత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ నగదు తరలింపు అనుమానాలకు తావివ్వడంతో డీఎంకే వర్గాలు కోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ సీబీఐ వేగవంతం చేసింది. ఈ సమయంలో ఆ నగదు పట్టుకునే క్రమంలో సాగిన వ్యవహారాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు బయట పడ్డాయి. ఇది ఓ మీడియాకు చిక్కడం, అందులో నాటకీయంగా చోటు చేసుకున్న కొన్ని దృశ్యాలు డీఎంకే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు. తిరుప్పూర్ వైపుగా వస్తున్న ఆ లారీలను తొలుత ఓ అధికారి పట్టుకుని విచారించడం, పేపర్లు అన్నీ సక్రమంగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చి మరీ పంపించి ఉండడం తొలి కెమెరా రికార్డు నమోదు మేరకు వెలుగులోకి వచ్చి ఉన్నది.
ఆ అధికారికి , కంటైనర్లలో నగదు ఉన్నట్టు, తాము మఫ్టీ పోలీసులం అంటూ ఆ కంటైనర్ల వెంట వచ్చిన ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌కు చెందిన వాహనాల్లో ఉన్న వారు వివరించి ఉన్నారు. అలాగే, తమ వద్ద యూనిఫాంలు లేవన్నట్టుగా వ్యాఖ్యలు చేసి ఉండడం, చివరకు ఆ అధికారి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి ఉండడం దృశ్యాలను ఆ చానల్ మంగళవారం ప్రసారం చేసింది. ఆ కంటైనర్లు కొంత దూరం వెళ్లినానంతరం మరో అధికారి తనిఖీలు చేయడం, వారి వద్ద ఎలాంటి ఆధారాలు, సర్టిఫికెట్లు లేకపోవడం, మఫ్టీలో ఉన్న వాళ్లు కొందరు యూనిఫాంలతో ప్రత్యక్షం కావడం మరో కెమెరా రికార్డు ద్వారా వెలుగులోకి రావడం గమనార్హం.
రెండోసారిగా తనిఖీలు చేసినా అధికారి, ఎ వరికో సమాచారం ఇవ్వడం, తక్షణం పోలీసు ఉన్నతాధికారులు సైతం అక్కడికి ఉరకలు తీయడం, ఆ కంటైనర్లలోని బాక్సులను విప్పిమరీ అందులో ఉన్న నోట్ల కట్టల్ని చూడడం వంటి దృశ్యాలు తాజాగా బయట పడడంతో చర్చనీయాంశంగా మారింది. తొలుత ఓ అధికారి క్లీన్ చిట్ ఇవ్వడం, రెండో సారిగా తనిఖీలు జరిపిన అధికారులు నిక్కచ్చితనంగా వ్యవహరించడం, అందులోని నోట్ల కట్టల్ని విప్పి చూడడం, వంటి దృశ్యాలతో పాటు , ఆంధ్రా వైపుగా వెళ్లాల్సిన వాహనాలు తిరుప్పూర్ వైపుగా ఎందుకు వచ్చాయని ఆ అధికారులు ప్రశ్నించడం వంటి దృశ్యాలు తాజాగా బయట పడడంతో రాష్ట్రంలో చర్చ బయలు దేరింది. ఈ వీడియో దృశ్యాలు ఎన్నికల సమయంలో తనిఖీల్లో భాగంగా తీసినవేనని స్పష్టం అయ్యాయి. ఇది కాస్త సీబీఐ విచారణకు మరింత కీలక ఆధారంగా మారే అవకాశాలు ఉన్నాయి.