చెన్నై: ఎన్నికలకు మరో 9 నెలల సమయముండగానే అన్నాడీఎంకేలో తదుపరి సీఎం ఎవరనే అంశంపై వేడి రాజుకుంది. కొన్నాళ్లుగా ఈ విషయంలో మంత్రులు బాహటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. దీనికితోడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ శనివారం పలుచోట్ల పోస్టర్లు దర్శనమివ్వడం కలకలం రేపింది. సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి సీఎం పళనిస్వామి, పన్నీరు సెల్వంలతో భేటీ అవుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. సీఎం అభ్యర్థిపై ప్రచారాలు మొదలు కావడంతో పళనిస్వామి, పన్నీరు సెల్వం శనివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నీ సమష్టిగా జరుగుతాయని, వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ బాహాటంగా ప్రకటించకూడదని కోరారు. ‘ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంతో సహా నిర్ణయాలన్నీ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొనే జరుగుతాయి. విజయం కోసం పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలి. ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించకూడదు.
ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’అని ఆ ప్రకటనలో అగ్రనేతలిద్దరూ హెచ్చరించారు. ఇటీవల సహకారశాఖ మంత్రి సెల్లూరు రాజు మాట్లాడుతూ ఎన్నికల తర్వాతే సీఎం ఎవరనే దానిపై నిర్ణయం ఉంటుందని అన్నారు. మరో మంత్రి కేటీ రాజేంద్ర స్పందిస్తూ పళనిస్వామే సీఎం అభ్యర్థని ప్రకటించారు. దీంతో పళనిస్వామి స్వయంగా రంగంలోకి దిగి ‘ఏఐఏడీఎంకే లక్ష్యం... వరుసగా మూడోసారి నెగ్గడం. అదే అమ్మ (జయలలిత) కల కూడా. అందరూ క్రమశిక్షణతో ఈ దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment