ఎస్వీ సూర్యప్రకాశ్, దినకరన్,పళని స్వామి, స్టాలిన్
డేట్ లైన్ – చెన్నై
తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు, కచ్చితంగా నెల తరువాత రాష్ట్రంలోని 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం మామూలే కానీ. తమిళ రాజకీయ దిగ్గజాలు పురచ్చితలైవి జయలలిత, కళైజ్ఞర్ కరుణానిధి లేకుండా పోలింగ్ జరుగుతుండటం విశేషం. అందుకేనేమో.. వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు నేతలు, కార్యకర్తలు. ప్రస్తుతం తమిళనాట పార్టీల్లో ఎలాగైనా గెలవాలన్న ఆరాటం కనిపిస్తోందే కానీ.. ఓ స్ఫూర్తిమంతమైన పోరాటం చేసే వారిగా మాత్రం అధినేతలు కనిపించడం లేదు.
జాతీయ అంశాలకే ప్రాధాన్యం..
జరుగుతున్నవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. సహజంగానే ఈ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. కాకపోతే బీజేపీతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు మోదీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నాయి. సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు పెట్టిన పోస్టులు మినహా అధికారికంగా, విశ్వాసంతో మోదీ ప్రభుత్వం గురించి ప్రజలకు చెప్పడంలో స్థానిక బీజేపీ నాయకులే తడబడుతున్నారు. అన్నాడీఎంకే నేతల సంగతి ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. ఈ రెండు పార్టీల ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే మాత్రం మోదీ వ్యతిరేక ప్రచారంలో పై చేయి సాధించింది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న ఇక్కట్లను ఏకరువు పెట్టడంలో డీఎంకే ఫ్రంట్ చాలా వరకు విజయం సాధించింది. అంతేకాకుండా అన్ని వర్గాల విద్యార్థులు ఎంబీబీఎస్‌లో చేరేందుకు వీలు కల్పించే నీట్ పరీక్షను కూడా మోదీకి వ్యతిరేకంగా వాడుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది.
ఈ పరీక్ష కారణంగా ప్రైవేట్ కళాశాలల వ్యాపారం దారుణంగా దెబ్బతినడం ఇందుకు కారణం. ప్రైవేట్ కళాశాలలను నిర్వహిస్తున్న జగద్రక్షకన్ వంటి రాజకీయ నేతలు డీఎంకేలోనే ఉన్నారు. కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో గుర్తించిన సహజవాయు, ముడిచమురు నిక్షేపాలను వెలికితీసే విషయంలోనూ డీఎంకే కేంద్రానికి వ్యతిరేకంగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులను గతంలో డీఎంకే హయాంలోనే ప్రారంభించారు. అప్పటి వల్ల అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందిన డీఎంకే ఇప్పుడు వాటిని వ్యతిరేకించడం విడ్డూరమే అయినా దీన్ని అనుకూలంగా మలుచుకోవడంలో డీఎంకే విజయవంతమైంది. మీడియా మద్దతు కూడా డీఎంకేకు ప్లస్ పాయింట్. ఎందుకంటే , పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం కేంద్రం మద్దతుతో పత్రికా స్వేచ్ఛను అణచివేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
చెదరని అమ్మ ఓటుబ్యాంకు
అన్నాడీఎంకే విషయానికొస్తే జయలలిత ఓటుబ్యాంకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ 15 శాతం వరకు ఓట్లను తనకు అనుకూలంగా చీల్చడంలో విజయం సాధిస్తారని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు దినకరన్, మరోవైపు డీఎంకే ఫ్రంట్లతో తలపడుతున్న పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు జయలలితకు తామే నిజమైన వారసులమని చెబుతూ ఆవిడ ఆశయాలను పథకాలను కొనసాగిస్తామని ప్రజలకు చెప్పడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దినకరన్ ఆర్కేనగర్లో చేసిన ప్రయోగాన్ని తిరిగి ఇప్పుడు కూడా మరింత పకడ్బందీగా చేసి అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించి కేంద్రంలో కింగ్ మేకర్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
అసెంబ్లీ స్థానాలలో ఎనిమిది స్థానాలు దక్కించుకోగలిగితే పళనిస్వామి ప్రభుత్వానికి ఈ పదవీకాలం ముగిసే వరకు ఢోకా లేదు. ఒకవేళ డీఎంకే లేదా దినకరన్‌కు ఎక్కువ స్థానాలు దక్కితే అధికార పీఠాన్ని కాపాడుకోవలసిన పరీక్ష మళ్లీ అన్నాడీఎంకేకు తప్పదు. కులాలవారీగా ఇక్కడ కూడా ప్రజలు చీలిపోయి ఉన్నారు. కుంభకోణాల పార్టీలుగా డీఎంకే, కాంగ్రెస్‌ను కలిపి అభివర్ణిస్తూ కేంద్రంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ పతనానికి దారితీసిన అవినీతి కుంభకోణాలను ఏకరువుపెడుతూ పళనిస్వామి డీఎంకే ఫ్రంట్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అవినీతిని ఒక అంశంగా ఓటర్లు పరిగణించే కాలం పోయింది కాబట్టి ఈ ప్రచారం ఎంతవరకు అన్నాడీఎంకే కు ఉపయోగపడుతుందో చెప్పలేము.
మోదీపై వ్యతిరేకత?
తమిళనాడులో బీజేపికి ఉన్న ఓటు బ్యాంకు 3–4 శాతానికి మించి లేనప్పటికీ.. మోదీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం మాత్రం అన్నాడీఎంకే ప్రభుత్వంపై పడుతోంది. దాని ప్రభావం డీఎంకేకు లభించవచ్చు. స్టాలిన్ గొప్ప నాయకుడు కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అండతో ఒక ప్రత్యామ్నాయం కావాలనుకునే వారికీ ఆశాకిరణంగా నిలిచారనే చెప్పాలి. రెండు ద్రావిడ పార్టీలలో ఏదో ఒక దానికి పగ్గాలు అందివ్వడం తమిళనాట సంప్రదాయంగా వస్తోంది కాబట్టి.. అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ కంటే డీఎంకేకు మద్దతివ్వడం మేలని ప్రజలు ఆలోచిస్తున్నారు.
సముద్ర తీరం వెంబడి తిరువళ్లూరు నుంచి కన్యాకుమారి వరకు 15 లోక్‌సభ స్థానాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు మత్స్యకారులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓఖీ తుపాను సమయంలో రాహుల్ గాంధీ పర్యటించి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్రం అండతో అభివృద్ధి నిరాటంకంగా కొనసాగిస్తామని డీఎంకే ప్రచారం చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే మనకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని డీఎంకే ఫ్రంట్, బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నాడీఎంకే ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అనిశ్చితాలు, అసత్య ప్రచారాలు, వైరుధ్యాల మధ్య తమిళ ప్రజల తీర్పు ఎవరిని గెలిపిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment