ఒంటరి పోరేనా?
కూటమిపై బీజేపీ ఆశ
పోటీకై తమిళిసై దరఖాస్తు
సీట్ల సర్దుబాటుకు డీఎంకేలో బృందం
చెన్నై : ద్రవిడ పార్టీలకు దీటుగా బీజేపీలో సైతం దరఖాస్తుల పర్వం సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణకు శనివారంతో గడువు ముగుస్తుండగా శనివారం మధ్యాహ్నానికి రెండువేల మంది పైగా దరఖాస్తులు అందాయి. త్వరలో కూటమి ఖరారు కాగలదని బీజేపీ ఆశాభావంతో ఉంది. ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు లేని బలమైన కూటమి ఏర్పాటుతో రికార్డు సృష్టించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకింత వెనుకబడిందని చెప్పవచ్చు.
అధికార పీఠం ఎక్కించే ఎన్నికలు కావడంతో ప్రతిపార్టీ పొత్తుల విషయంలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వెంట నిలిచిన ప్రాంతీయ పార్టీలు తలోదారి చూసుకోగా డీఎండీకే మాత్రం ఉండలేక, వెళ్లలేక ఊగిసలాడుతోంది. ప్రధానమైన ప్రాంతీయ పార్టీల్లో ఓ మోస్తరు స్పష్టత వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ నాన్చుడు ధోరణి పొత్తును ఆశిస్తున్న పార్టీలకు తలనొప్పిగా మారింది. డీఎండీకే కోసం ఒకవైపు బీజేపీ, మరోవైపు డీఎంకే అలుపెరుగని ప్రయత్నాలు సాగిస్తున్నాయి. తమతో రమ్మంటూ ప్రజాస్వామ్య కూటమి సైతం పిలుపునిచ్చింది. విజయకాంత్ వైఖరేంటో తేలగానే రాష్ట్రంలోని అన్ని కూటముల్లో ప్రచార వ్యూహం ఊపందుకుంటుంది.
ఒంటరిపోరుతో బలపరీక్షకు సైతం కమలనాథులు వెనుకాడడం లేదు. మరికొద్దికాలం వేచిచూసి తమ నిర్ణయం ప్రకటించాలని బీజేపీ నిర్ణయించుకుంది. ప్రాంతీయ పార్టీల పొత్తు కోసం కాలం వృథాచేయకుండా సొంతకాళ్లపై నిలబడేందుకు సిద్ధం కావాలని బీజేపీ ఆశిస్తోంది. ఈ కారణం చేతనే పార్టీలోని ముఖ్యనేతలంతా ఎన్నికల్లో పోటీచేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
కూటమి ఇంకా ఖరారు కాని పరిస్థితిలో సైతం పోటీకి పెద్ద సంఖ్యలో నేతలు ముందుకు రావడం అందరినీ ఆశ్చ్యర్యపరుస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు తొలిరోజైన శుక్రవారం నాడు 1,300 మంది దరఖాస్తు చేయగా, శనివారం గడువు ముగిసే సమయానికి ఈ సంఖ్య రెండువేలకు మించిపోనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, ఉపాధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్, సీనియర్ నేతలు హెచ్ రాజా, కరుప్పు మురుగానందం, నరేంద్రన్ నామినేషన్లు వేశారు.
చక్రవర్తినాయుడు పేరున పది:
తమ అభిమాన నేత పేరున పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వేయడం ఇప్పటి వరకు అన్నాడీఎంకే, డీఎంకేలో మాత్రమే సాగుతోంది. అయితే ఈసారి బీజేపీలో సైతం అదేస్థాయి ఒరవడి అబ్బురపరుస్తోంది. తెలుగు ప్రముఖుడు ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) ప్రధాన కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తినాయుడు ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆయన పేరున అభిమానులు పది నామినేషన్లు వేశారు.
తిరుత్తణి నుంచి పోటీ చేయాలంటూ ఐదుగురు, చెన్నై అన్నానగర్ నుంచి బరిలోకి దిగాలంటూ మరో ఐదుగురు చక్రవర్తినాయుడు పేరున దరఖాస్తులు సమర్పించారు.
డీఎంకేలో సర్దుబాటు బృందం:
మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న డీఎంకే సీట్ల సర్దుబాటుకు బృందాన్ని నియమించినట్లు ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ శనివారం ప్రకటించారు. డీఎంకేలో సాగుతున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలు శనివారం నాటికి పదోరోజుకు చేరుకున్నాయి. డీఎంకే టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఇంటర్వ్యూల కోసం చెన్నై తేనాంపేటలోని అన్నాఅరివాలయంలో ప్రతిరోజూ బారులు తీరుతున్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ చేరిపోయింది. డీఎండీకే సైతం చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎండీకే వల్ల తమ పార్టీ ఎన్నికల పనుల్లో ప్రతిష్టంభన నెలకొనలేదని ఈ ప్రచారాలపై స్టాలిన్ వ్యాఖ్యానించారు.