‘మారాజు’లు.. ప్రపంచంలో ఇంకా రాచరికమున్న దేశాలివే..
ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించిన బ్రిటన్ దేశపు రాణి ఎలిజిబెత్–2 మరణం, ఛార్లెస్–3 పట్టాభిషేకం నేపథ్యంలో.. రాచరికానికి సంబంధించిన పలు ప్రశ్నలు సమాజంలో వస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల పార్లమెంట్లకు తల్లిలాంటిది బ్రిటన్ పార్లమెంట్. ప్రజాస్వామ్యానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్న బ్రిటన్ ప్రజలకు రాచరికం పట్ల అంతులేని ఆకర్షణ ఉందని ఇటీవల ప్రస్ఫుటమయింది.
మరణించిన రాణి ఎలిజబెత్ తర్వాత రాజుగా సింహాసనం ఎక్కిన ఛార్లెస్–3 కేవలం బ్రిటన్కే కాకుండా, మరో 14 దేశాలకూ రాజుగా (దేశాధినేతగా) ఉన్నారనే విషయం ఆశ్చర్యం కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లోనూ రాచరికమే ఉంది. కొన్ని దేశాల్లో రాజే సర్వాధికారి. మరికొన్ని దేశాల్లో పాక్షిక అధికారాలను కలిగి ఉంటారు. బ్రిటన్ పాలించిన వలస దేశాలను కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తారు. మొత్తం 56 కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి. వీటిలో 14 దేశాలు బ్రిటన్ రాజు/రాణినే తమ దేశ రాజు/రాణిగా అంగీకరిస్తాయి. మిగిలిన దేశాల్లో 36 పూర్తి గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాలకు సొంత రాచరికాలు ఉన్నాయి.
బ్రిటన్ రాజునే తమ రాజుగా అంగీకరిస్తున్న 14 దేశాలు
1. కెనడా, 2. ఆస్ట్రేలియా, 3. న్యూజిలాండ్, 4. యాంటిగు అండ్ బాబోడ, 5. ది బహామస్, 6. బెలీజ్, 7. గ్రెనాడ, 8. జమైకా, 9. పాపువా న్యూ గీని, 10. సెయింట్ కిట్స్ అండ్ నెవస్, 11. సెయింట్ లూసియా, 12. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీస్, 13. సోలోమన్ ఐలండ్స్, 14. తువాలు
మొత్తం 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే
ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ఉంది. యూకేతో కలిపి మొత్తం 15 దేశాలకు రాజుగా బ్రిటన్ రాజు వ్యవహరిస్తున్నారు. రాచరిక వ్యవస్థ ఉన్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలూ ఉండటం గమనార్హం. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిలయాలుగా ఉన్న దేశాలూ ఉన్నాయి. యూకే, జపాన్, కెనడా, డెన్మార్క్, స్పెయిన్ తదితర దేశాలే ఇందుకు ఉదాహరణలు. వెనుకబడిన సమాజం ఆనవాళ్లకు రాచరిక వ్యవస్థ గుర్తుగా ఉందనే వాదన చాలా దేశాలకు వర్తించడంలేదని ఆయా దేశాలు వివిధ రంగాల్లో పురోగమిస్తున్న తీరు చెబుతోంది.
రాచరిక వ్యవస్థ 3 రకాలు
ఆయా దేశాల సంస్కృతి, భాషను బట్టి రాచరికంలో దేశాధినేతను రాజు, రాణి, అమీర్, సుల్తాన్ వంటి హోదాలతో వ్యవహరిస్తున్నారు. రాచరిక స్వభావం, వాటికున్న అధికారాలను బట్టి 3 రకాలుగా విభజించవచ్చు.
రాజ్యాంగపరమైన రాచరికం
కేవలం రాజ్యాంగ విధులు (సెరిమోనియల్ డ్యూటీస్) నిర్వర్తించడానికి మాత్రమే రాచరికం పరిమితమవుతుంది. రాజకీయ అధికారాలు ఏమీ ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిజమైన అధికారాన్ని అనుభవిస్తుంది. ఇలాంటి రాచరికం బ్రిటన్ (యూకే), జపాన్, డెన్మార్క్ దేశాల్లో ఉంది.
పూర్తి రాచరికం
దేశంలో రాజుదే పూర్తి అధికారం. చట్టాలను రూపొందించే, సవరించే, తిరస్కరించే అధికారం రాజు/రాణికి ఉంటుంది. విదేశీ వ్యవహారాలను కూడా రాజే పర్యవేక్షిస్తారు. రాజకీయ నేతలను నామినేట్ చేస్తారు. సౌదీ అరేబియా, వాటికన్ సిటీ, యస్వటినీ తదితర దేశాలు ఈ కోవలోకి వస్తాయి.
మిశ్రమ రాచరికం
కొన్ని అంశాల్లో సంపూర్ణ అధికారాలను వినియోగించుకుంటూనే, కొన్ని అంశాల్లో ప్రజా ప్రభుత్వాలు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాబితాలో జోర్డాన్, మొరాకో, లిక్టన్స్టైన్ తదితర దేశాలు ఉన్నాయి.
- (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి)
ఇది కూడా చదవండి: అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం