రాచరికాలు అంతరించిపోయినా వాటిని ఇంకా కొనసాగిస్తున్నవారు ఉన్నారు. వందిమాగదులతో వంగి వంగి దండాలు పెట్టించుకోవడం, తమకు నచ్చనివారిని శంకరగిరి మాన్యాలు పట్టించడం వంటి రాజరిక ఆనవాళ్లను సమకాలిన సమాజంలోనూ ఆచరించేవారున్నారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. 'పురచ్చితలైవీ' ప్రఖ్యాతిగాంచిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఈ కోవకు చెందిన వారే.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత చూడడానికి సింపుల్ గా కనబడతారు. ఆమె పోకడలన్నీ రాజరికాన్ని గుర్తుకు తెస్తాయి. అన్నాడీఎంకే నాయకులతో 'అమ్మ' వంగి వంగి దండాలు పెట్టించుకుంటారు. ఆమె ముందు తలెగరవేస్తే వారి పని అయిపోయినట్టే. అందుకే అనుచరణం ఆమె అడుగులకు మడుగులొత్తుతూ భయభక్తులతో మెలుగుతుంటారు. అంతేకాదు హంగు, ఆర్భాటాలు చేయడంలోనూ ఆమెది చెరిగిపోని రికార్డే. ఇందుకు ఆమె గతమే తిరుగులేని నిదర్శనం.
రాచరికపోకడలను జయలలిత మర్చిపోలేదని ఆమె హస్తిన పర్యటన మరోసారి రుజువు చేసింది. అమ్మ హస్తినలో అడుగుపెట్టగానే అన్నాడీఎంకే పార్టీ ఎంపీలందరూ వరుసగా నిలబడి ఆమెకు వంగి వంగి దణ్ణాలు పెట్టారు. ఆమె కారు దిగకుండానే తన అనుచరులను కటాక్షించారు. కనీసం కారు తలుపు అద్దం కూడా తీయకుండానే పార్టీ నేతలను కరుణించారు. ఈ భాగ్యానికే 'అమ్మ' భక్తులు పులకించిపోయారు.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో జయలలిత మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీ కోసం ఆమె ప్రత్యేకంగా కుర్చీ తెప్పించుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఈ కుర్చీని తమిళనాడు భద్రతాధికారి జాగ్రత్తగా తీసుకెళ్లి భద్రపరిచారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టుగా... జయ వ్యవహార శైలి ఉందని తలపండిన రాజకీయ నేతలే ముక్కున వేలేసుకున్నారు. రాచరికానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
'జయ'మ్మ ఇదేం పనమ్మా?
Published Wed, Jun 4 2014 1:52 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement