పోలీసు, ఫైర్ స్టేషన్లకు చర్యలు
అసెంబ్లీలో సీఎం స్టాలిన్
సాక్షి,చైన్నె : అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం కూటమి లెక్కల చర్చ జోరుగా సాగింది. డీఎంకే సభ్యులు, అన్నాడీఎంకే సీనియర్ నేత ఎస్పీ వేలుమణి మధ్య ఆసక్తికరంగా వ్యాఖ్యల తూటాలు పేలాయి. ఇక, సభలో ప్రసంగించిన సీఎం స్టాలిన్ రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్లు, ఫైర్ స్టేషన్ల ఏర్పాటు విస్తృత లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం ప్రశ్నోత్తరాలకు స్పీకర్ అప్పావు అనుమతి ఇచ్చారు. ఈసమయంలో మంత్రి ఏవీ వేలు మాట్లాడుతూ తాంబరం–కిష్కింధ మార్గం ఫోర్‌వేగా మార్చేందుకు అటవీ అనుమతులు, ఇతర కసరత్తులపై దృష్టి పెట్టామన్నారు.
తిరునల్వేలి ఔటర్ రోడ్డు పనులకు రెండో విడతగా స్థలసేకరణ ముగిసిందన్నారు. అన్నాడీఎంకే సభ్యుడు విజయభాస్కర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సెంథిల్‌బాలాజీ సమాధానం ఇస్తూ, 2 లక్షల విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు నిలుపుదల చేశామని ఎమ్మెల్యే కొంగు ఈశ్వరన్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఎంఆర్‌కే పన్నీరుసెల్వం సమాధానం ఇచ్చారు. కోయంబత్తూరులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌పై చర్యలు చేపట్టామని, ఇది అమల్లోకి రాగానే తిరుప్పూర్‌లో ఉన్న చెత్తను తొలగిస్తామని మంత్రి నెహ్రూ మరో సభ్యుడి ప్రశ్నకు వివరణ ఇచ్చారు.
20 పారిశ్రామిక వేత్తలు కలిసి ముందుకొచ్చి స్థలాన్ని కొనుగోలు చేసి ఇస్తే రూ.15 కోట్ల రాయితీతో పాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అన్బరసన్ ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం రూ.186 కోట్లతో 95 ఆలయాలకు రాజగోపురాల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి శేఖర్‌బాబు ప్రకటించారు.
పోలీస్‌స్టేషన్లు..
సభలో సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ పోలీసులు, అగ్నిమాపక విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అరంతంగి నియోజకవర్గంలో 500 కంటే ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా ఉమ్మడి తాగునీటి ప్రాజెక్టును అందించామన్నారు. అరంతాంగిలోని పోలీస్‌స్టేషన్ గురించి ప్రస్తావిస్తూ నాగురి, అవుడయార్ కోవిల్, కరూర్ సహా ఐదు శాంతి భద్రత విభాగం పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసు స్టేషన్లు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల గురించి ప్రస్తావించారు. తమకు సమాచారం , విజ్ఞప్తులు రాగానే, తక్షణం స్పందిస్తున్నామన్నారు.
కూటమి లెక్కల చర్చ
సభలో రెండు రోజుల క్రితం అన్నాడీఎంకేను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యంగ్యాస్త్రం సంధించారు. మోసపోకుండా ఉంటే శుభాకాంక్షలు అని ఎద్దేవా చేశారు. బుధవారం గ్రామీణాభివృద్ధిశాఖకు నిధుల కేటాయింపునకు సంబంధించిన చర్చ సమయంలో అన్నాడీఎంకే సభ్యుడు కడంబూరు రాజు చేసిన వ్యాఖ్యలు సభలో కూటమి చర్చకు దారి తీసింది. లెక్కలు అడుగుతాం..ప్రశ్నించేందుకే ఆవిర్భవించిన పార్టీ అన్నాడీఎంకే అని కడంబూరు రాజు వ్యాఖ్యానించారు. త్వరగా లెక్కలన్నీ సమర్పించండి, ముగించండి, 2026 తర్వాత కొత్త లెక్కలు వేసుకుంటామని స్పందించారు.
ఇందుకు ఆర్థికమంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ తప్పుడు లెక్కలతో ఇరకాటంలో పడేరు అని ఎద్దేవా చేశారు. ఇందుకు అన్నాడీఎంకే సీనియర్ ఎస్పీ వేలుమణి స్పందిస్తూ, ఎంజీఆర్, జయలలిత మార్గంలో పళణిస్వామి లెక్కలు వేస్తున్నారని, ఆయన లెక్కలు తప్పే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు మంత్రి పెరియస్వామి స్పందిస్తూ అమ్మ పాలన అంటూ గత పాలనలో సాగిన వారు లెక్కలంటూ అమ్మను మరిచారని చమత్కరించారు. అమ్మ పథకాలు అంటూ చివరకు అమ్మనే మరిచినట్టున్నారని ఎద్దేవా చేశారు. దీంతో సభలో కూటమి చర్చ మరింతగా ఆసక్తికర వ్యాఖ్యలతో ఊపందుకుంది. చివరకు స్పీకర్ అప్పావు జోక్యం చేసుకుని చర్చకు ముగింపు పలికారు.