
♦ జీవన కాలమ్
మహానుభావులు– తమ జీవితంలో ఎల్లలు లేని ప్రాముఖ్యాన్ని సాధించిన మహానుభావులు– జీవితంలో నష్టపోయే విలువైన ఆస్తి పేరు ప్రశాంతత. ఇది వారు తమ తమ ‘జీనియస్’కి చెల్లించే మూల్యం.
నేను దినపత్రికలో పనిచేసే రోజుల్లో ‘ఊమెన్’ అనే కార్టూనిస్టు విరివిగా కార్టూన్లు వేసేవాడు. వాటి విమర్శ వాడిగా, వేడిగా ఉండేది. తరుచు ఈ విమర్శకు గురయ్యే నాయకులు– ఆ రోజుల్లో స్వతంత్ర పార్టీ స్థాపకులు చక్రవర్తి రాజగోపాలాచారిగారు. ఓసారి ఎవరో పాత్రికేయుడు రాజాజీని అడిగాడు, ‘ఊమెన్ కార్టూన్ల గురించి మీ అభిప్రాయమేమి’టని. ఇది ఓ పెద్ద నాయకుడి మీద కావాలని కాలు దువ్వడం. రాజాజీ గొప్ప మేధావి. చమత్కారం ఆయన సొత్తు. ఆ ప్రశ్నకు సమాధానంగా , ‘నేను అడ్డమయిన వారి మీదా నా అభిప్రాయం చెప్పను. చెప్తే వారు పాపులర్ అవుతారు’ అన్నారు.
ఇప్పుడు మరో అరుదయిన కథ. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, సాపేక్ష సిద్ధాంతానికి ఆద్యుడు అల్బర్ట్ ఐన్‌స్టీన్ 1922లో జపాన్ వెళ్లారు, ఉపన్యాసాలు ఇవ్వడానికి. అంతకు కొద్దికాలం ముందే భౌతికశాస్త్రానికి ఆయనకి నోబెల్ బహుమతిని ప్రకటించారు. అప్పట్లో ఆయన పరపతి ప్రపంచమంతా మార్మోగుతోంది. టోక్యోలో ఆయన ఉన్న ఇంపీరియల్ హోటల్‌కి ఒక సందేశాన్ని ఆయనకు అందజేయడానికి ఒక వార్తాహరుడు వచ్చాడు.
అప్పటి సంప్రదాయం ప్రకారం ఈ వార్తాహరుడు చిన్న పారితోషికాన్ని పుచ్చుకోవడానికి తిరస్కరించాడు. లేక చిన్న పారితోషికానికి ఐన్‌స్టీన్ దగ్గర చిల్ల రలేదో! ఆయన్ని ఉత్త చేతుల్తో పంపడం ఐన్‌స్టీన్‌కి ఇష్టం లేదు. అప్పుడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఏం చేయాలి? హోటల్ కాగితం మీద ఓ సందేశం రాసి ఇచ్చారు. టోక్యో ఇంపీరియల్ హోటల్ కాగితం మీద ఆయన రాసిన సందేశం, ‘విజయాన్ని వేటాడే గందరగోళం కన్నా, సరళమయిన జీవితం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది’ అని.
అనుకోకుండా, అసంకల్పితంగా చేసిన కొన్ని పనులు కళాఖండాలయిపోతాయి. చరిత్రలుగా నిలుస్తాయి. ఇప్పుడీ కాగితం విలువ కొన్ని లక్షల డాలర్లు. 95 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సందేశం ఉన్న కాగితాన్ని వేలం వేయనున్నారు. ఐన్‌స్టీన్ యూదులు. జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయంలో ఆయన జ్ఞాపికలు చాలా ఉన్నాయి. ఎన్నో శాస్త్రానికి సంబంధించిన విలువైన దస్త్రాల మధ్య – అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన ఒక మహానుభావుడి వ్యక్తిగత ‘ఆలోచన’లకు అద్దం పట్టే ఈ సందేశం చాలా విలువైనది.
ఇలాగే మరో విలువైన చరిత్రను సృష్టించే చిత్రం కథ. ప్రముఖ చిత్రకారులు, ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కుమారుడు బుజ్జాయిగారు 1946లో ఎలియట్స్ రోడ్డులో శాస్త్రిగారి అభిమాని తిరుపతిగారితో నడుస్తున్నారట. రోడ్డు మీద కారులో వెళ్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తిరుపతిగారిని చూసి కారు ఆపారట. తిరుపతిగారు రాధాకృష్ణన్ గారి శిష్యుల్లో ఒకరు. ఇద్దర్నీ కారెక్కించుకుని ఇంటికి తీసుకెళ్లారు. తిరుపతిగారు బుజ్జాయిని పరిచయం చేసి, ‘‘మీరలా కూర్చుంటే ఈయన మీ పెన్సిల్ స్కెచ్ వేస్తారు’’ అన్నారట. బుజ్జాయి వేశారు.
ఆ బొమ్మ మీద ‘రాధాకృష్ణయ్య’ అని సంతకం చేశారు. దేశానికి ఆయన ‘రాధాకృష్ణన్’ గానే తెలుసు. బహుశా అదొక్కటే తెలుగు ‘రాధాకృష్ణయ్య’ గారికి అభిజ్ఞగా మిగిలిన అరుదైన బొమ్మ. విచిత్రం ఏమిటంటే తరువాతి కాలంలో ఆయన దేశ ఉపా«ధ్యక్షులయ్యారు. మరో17 సంవత్సరాల తర్వాత బుజ్జాయిగారికి కొడుకు పుట్టాడు. మరో యాభై సంవత్సరాల తర్వాత రాధాకృష్ణన్ గారి మనుమరాలు ఆయన కోడలయింది.
మరో ప్రపంచ ప్రఖ్యాత మహా నటుడు చార్లీ చాప్లిన్ అమెరికాలో అఖండమయిన కీర్తిని ఆర్జించాక స్వదేశానికి వచ్చాడు. అతను ఊహించనంత కీర్తి అతనికి దక్కిందని తెలి యదు. వందలాది మంది అతను వస్తున్న రైలు దగ్గర హాహాకారాలు చేస్తూ ఎదురు చూస్తున్నారు. చాప్లిన్ అంటాడు, ‘బయట లక్షలాది మంది అభిమానులు. కానీ రైలు పెట్టెలో నేను నిస్సహాయమైన ఒంటరిని’ అని.
మహానుభావులు– తమ జీవితంలో ఎల్లలు లేని ప్రాముఖ్యాన్ని సాధించిన మహానుభావులు– జీవి తంలో నష్టపోయే విలువైన ఆస్తి పేరు ప్రశాంతత. ఇది వారు తమ తమ ‘జీనియస్’కి చెల్లించే మూల్యం.
వారితో పోలిస్తే నాది చిన్న జీవితం– ఇటు బళ్లారి, అటు బరంపురం దాటని పాపులారిటీ.
నా పాపులారిటీ రెక్కలు విచ్చుకుంటున్న తొలిరోజుల్లో చిలకలూరిపేటలో షూటింగ్ చేసి తెల్లవారితే పూడిపల్లిలో (పోలవరానికి లాంచిలో 30 నిమిషాల ప్రయాణం) ‘త్రిశూలం’ ముహూర్తానికి చేరాలి. రైలు తప్పిపోయింది. ఏం చెయ్యాలో తెలీక– నిస్సహా యంగా– సాహసించి– బస్సు ఎక్కాను. రాజమండ్రిలో దిగి ఉదయం మిత్రుడు శ్రీపాద పట్టాభి ఇంటికి చేరాను.
‘ఎలా వెళ్లారయ్యా?’’ అనడిగారు మిత్రులు రావు గోపాలరావు.
‘‘రిక్షాలో’’ అన్నాను.
ఆయన నవ్వి, ‘‘మీ జీవితంలో ఇదే ఆఖరి ప్రయాణమయ్యా. ఇంక రిక్షా ఎక్కే అదృష్టం లేదు’’ అన్నారు.
చరిత్ర రచన ఆనాటికి తెలియదు. కాలం వాటి విలువల్ని నిర్ణయిస్తుంది.
- గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment