భీతి వద్దు ప్రీతి ఉండాలి | special story to gollpudi maruthi rao | Sakshi
Sakshi News home page

భీతి వద్దు ప్రీతి ఉండాలి

Published Tue, Jan 9 2018 11:49 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

special  story to  gollpudi maruthi rao - Sakshi

గొల్లపూడి మారుతిరావు. ఈ పేరు చెబితే సినీ జీవితంలో ఆయన పోషించిన పాత్రలు కళ్లెదుట కదలాడతాయి. సాహితీవేత్తలకు రచనలు మనసులో మెదులాడతాయి. రచయితగా 60 ఏళ్లు నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ 78 ఏళ్ల బహుముఖ ప్రజ్ఞాశాలి నిత్య దైవారాధికుడు. దైవ పూజతోనే దైనందిన జీవనం మొదలపెట్టే గొల్లపూడి ఆలయానికి వెళ్లనిదే నిద్రపోరు. నిత్యం ఏదో ఆధ్యాత్మిక గ్రంథం చదువుతూనే ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా ప్రవచనాలు చెబుతున్నారని తెలిస్తే సతీ సమేతంగా వెళ్లి ఏదో ఓ మూల కూర్చొని వింటూ లీనమైపోతారు. దైవం పట్ల భీతి ఉండటం కంటే ప్రీతి ఉండటం మేలని ‘నేను నా దైవం’ శీర్షిక కోసం గొల్లపూడి తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

మీ జీవితం విశాఖ, విజయనగరంల మధ్య ఎక్కువగా గడిచినట్టుంది?
అవును. మాది మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. నేను పుట్టింది విజయనగరం. పెరిగింది విశాఖ. చిన్నప్పుడు విశాఖపట్నం నుంచి విజయనగరంకు ప్రయాణం అంటే  పెద్ద విశేషంగా ఉండేది.  ఇప్పుడు గంట కూడా పట్టని ప్రయాణం ఆ రోజుల్లో నాలుగు గంటలకు పైగా సాగేది. అప్పట్లో విజయనగంలో ఎడ్ల బళ్లలో తిరిగిన జ్ఞాపకం ఇంకా మర్చిపోలేదు.
   
ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండేది?
ఒక నమ్మకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే అది– దైవం అంతా చూస్తూ ఉంటాడు మనం ఎవరికీ ఏమీ చేయకపోతే ఎవరూ మనల్ని ఏమీ చేయరు.. అంతా మంచే జరుగుతుంది అనేది ఆ భావనకు మూలం అనుకుంటా.  మా నాన్న గారు కంపెనీలో గుమస్తాగా జీవితాన్ని ఆరంభించి  కంపెనీ ఇన్‌చార్జి స్థాయికి ఎదిగారు. పెద్ద కలలకు పోకుండా గౌరవ ప్రదంగా బతికే వాళ్లం. ఏ రోజూ భోజనం లేదు మంచినీళ్లు లేవు అనే పరిస్థితి మా జీవితాల్లో ఎప్పుడు ఎదుర్కో లేదు. గౌరవంగా, తృప్తిగా, డిగ్నిఫైడ్‌గా జీవించాం.  భేషజాలకు పోని ఫాల్స్‌ ప్రెస్టేజ్‌ ప్రమేయం లేని ప్రశాంతమైన డిగ్నిఫైడ్‌ జీవితం గడపడం మా తల్లిదండ్రులు నాకు నేర్పారు. నాన్న గారు రోజూ గాయత్రి జపం చేసేవారు. అమ్మగారు భగవద్గీత చదివేవారు. సుదర్శన నామం చేసేవారు.  మా తల్లిదండ్రులతో కలిసి ప్రతి ఏటా పుణ్యక్షేత్రాలకు వెళ్లేవాడని. ఆ తర్వాత ఏనాడు దైవ చింతన వదల్లేదు. ఉద్యోగంలోనే కాదు..రచయతగా..నటుడిగా ఎక్కడకు వెళ్లినా దైవారాధన వీడలేదు. మొన్ననే భద్రాచలంలో మూడురోజుల పాటు ఉన్నాను.
     
ఆ రోజుల్లో డిగ్రీ చేయడం విశేషం అనే చెప్పుకోవాలి...
మనిషి సంస్కారానికి రెండు మార్గాలుండాలి. ఒకటి దైవమార్గం రెండు విద్యామార్గం. మా నాన్న చదువు ముఖ్యం అనుకోవడం నా అదృష్టం. విశాఖలో 1956–59 మధ్య బీఎస్సీ హానర్స్‌ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను. అప్పట్లో మా నాన్నగారి జీతం 30 రూపాయలు ఉండేది. నా టర్మ్‌ ఫీజు కూడా అంతే ఉండేది. అయినా ఆయన చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని పోషించుకుంటూ నా టర్మ్‌ ఫీజు కట్టేవారు. బస్సుకు వెళ్లడానికి డబ్బులిచ్చేవారు. పాకెట్‌ మనీ లాంటివి ఇవ్వలేదు. ఒక్క రోజు కూడా నా ఖర్చుతో కాఫీ తాగలేదు. ఇప్పటికి కూడా హొటల్‌కు వెళ్లి కాఫీ, టిఫిన్‌ తీసుకోవాలంటే మనస్కరించదు.
     
చాలా త్వరగా ఉద్యోగ జీవితాన్ని వెతుక్కున్నట్టున్నారు? 
మధ్యతరగతి వాళ్లకు వేణ్ణీళ్లకు ఎంత తొందరగా చల్లనీళ్లు దొరికితే అంత మంచిది. అందుకే బీఎస్సీ హానర్స్‌ పూర్తి కాగానే రచనా రంగంపై ఉన్న మక్కువతో  20 ఏళ్లకే జర్నలిజంలో అడుగుపెట్టాను.  1961లో వివాహమైంది. 1962 అక్టోబర్‌కు పెద్దబ్బాయి పుట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్‌ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూ వచ్చింది. 20 ఏళ్ల పని చేశాను.  

ఏ దేవుడంటే ఇష్టం?
నాకు దేవుళ్లందరూ ఇష్టమే. ఫలానా దేవుడంటేనే ఇష్టమని లేదు. నా జీవితంలో ఆలయాలకు వెళ్లని రోజంటూ ఉండదు. ఎంత బిజీగా ఉన్నా సమీపంలోని ఏదో ఒక ఆలయానికి వెళ్లాల్సిందే. గుడికి వెళ్లకుండా నిద్రపోవడం అంటే నాకేమిటో వెలితిగా ఉంటుంది. పగటి వేళ పని ఒత్తిడిలో గుడికి వెళ్లలేకపోతే పడుకునే ముందైనా ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తర్వాతే పడుకుంటాను. ఇక విశాఖలో ఉంటే ఒక రోజు మర్రిపాలెం వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్తాను. ఒకరోజు ఈస్ట్‌పాయింట్‌ కాలనీ బాబా గుడికి వెళ్తాను. హైవేపై ఉన్న యోగాంజలి స్వామి గుడికి ఇంకోక రోజు ఎంవీపీ కాలనీలో ఉన్న శివాలయానికి వెళ్తాను. దేవాలయాలుæ నెగిటివ్‌ థింకింగ్‌ని దూరం చేసే ఒక్క చక్కటి వ్యవస్థ. అక్కడకు వెళ్తే  మనసు నిర్మలంగా ఉంటుంది.
   
దైవం పట్ల భక్తి గొప్పదా? భయం గొప్పదా
దేవుడికి భయపడటం సరి కాదు. దేవునికి ప్రేమించాలి. దేవుడిలో మమేకం కావాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడి దగ్గర చనువు ప్రదర్శించగలగాలి. దేవుడి పట్ల భయం ప్రదర్శిస్తూ దూరం ఉండేకంటే దేవుని దగ్గర నిష్కపటంగా సర్వసన్నిహితంగా ఉండటం సరిౖయెనదని నేను భావిస్తాను. దైవారాధన చేయాల్సింది భయంతో కాదు భక్తితో. రోజూ దేవుణ్ణి దర్శించడం, గుడికి వెళ్లడం, లేదా దైవ నామస్మరణ చేయడం వల్ల మనకు ఆత్మశక్తి వస్తుంది. దేవుడు ఉన్నాడన్న భరోసా వస్తుంది. దాని వల్ల జీవితంలో ఎదురైన కష్టనష్టాలు ఎదుర్కొంటాం. దైవం ఉన్నది ఆయన నుంచి శక్తి పొందడానికి. కోరికల కోసం వరాల కోసం బేరసారాలు చేయడం కంటే మన జీవితం ఆయనకు వదిలిపెట్టి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ వెళ్లడం సరైనదని నేను భావిస్తాను. 
     
అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? 
ఆధ్యాత్మికతకు ప్రత్యేకంగా నిర్వచనం అంటూ లేదు. నా దృష్టిలో తోటి వారికి అపకారం చేయకుండా చేతనైన సహాయం చేస్తూ జీవించడమే ఆధ్యాత్మికత.  ఆధ్యాత్మిక గ్రంథాలు దైవ జ్ఞానాన్ని, దైవ స్పృహను కలిగిస్తాయి. ఆ క్రమంలో మనల్ని మనం కూడా తెలుసుకుంటాం. విశ్వశక్తిని, మానవశక్తికి సమన్వయం చేసుకుంటూ మానవ కల్యాణానికి ఉపక్రమించడమే అసలైన ఆధ్యాత్మికత అని నేను అనుకుంటాను.
     
మీ ఇంట్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది?
నా భార్యకు దైవభక్తి ఎక్కువ. ఇప్పటికి మూడుసార్లు రామకోటి రాసింది. మూడోసారి రాసిన రామకోటిని ఇటీవలే భద్రాద్రి రాముడికి సమర్పించాం. అలాగే ఇంట్లో మా కోడళ్లు కూడా పూజలు చేస్తారు. జర్మనీలో స్థిరపడిన మా మనవరాలు కూడా నిత్యం పూజలు చేస్తుంది. నేను దైవస్మరణ చేస్తానే తప్ప నేను ప్రత్యేకంగా కూర్చొని పూజ, జపం చేయను. 
     
ప్రవచనాలు ఎక్కువగా వింటారట?
ప్రవచనాలు వినడం మాకు చాలా ఇష్టం. మల్లాది చంద్రశేఖరశాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, సుందర చైతన్యానంద, చినజియ్యర్‌ స్వామి, చిన్మాయానంద, పార్థసారథి, దయానంద సరస్వతి, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎక్కడ ఉన్నా వెళ్తాం. ప్రవచనం ఎక్కడ జరిగినా ఏదో మూల కూర్చొని ప్రశాంతంగా విని ఇంటికి వెళ్లడం ఆనందం. అంతే కాని సత్సంగలో చేరడం స్వామి వారు రాగానే పూలు జల్లడం నాకు తెలియదు.

మనుషుల్లో మీరు చూసిన దైవత్యం?
ఎదుటవారికి సాయం చేయాలనే గుణం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం ఉన్నట్టే.  మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ దైవత్యం ఉన్నట్టే.
   
జీవితంలో బాగా బాధపడిన సందర్భాలు?
నా కుమారుడు శ్రీనివాస్‌ చనిపోయిన ఘటన నా జీవితంలో చేదు జ్ఞాపకం. ఎంతో సంతోషంగా సాగుతున్న మా జీవితంలో వాడి మరణం మాకు తీరని లోటు. అది ఎప్పటికి పూడ్చలేనిది.

 

రచనా రంగంలో ఎప్పుడు అడుగుపెట్టారు?
కళాశాల సమయంలోనే చిన్న చిన్న రనలు చేసేవాడిని. నా రచనలు చూసి నా మిత్రులు, అధ్యాపకులు ఎంతగానో ప్రోత్సహించేవారు. ఎప్పటికైనా నువ్వు గొప్ప రచయిత అవుతావని వెన్ను తట్టేవారు. నాలో నటుడు కూడా ఏయూలో చదువుతున్నప్పుడే బయటకొచ్చాడు. ఎన్నో నాటకాలు వేసే వాళ్లం. ఆల్‌ ఇండియా రేడియోలో చేరిన రెండేళ్లకు అనుకోకుండా సినీ రచయతగా అవకాశం వచ్చింది. కడపలో పనిచేసే రోజుల్లో సినిమాల్లోకి రచయితగా వచ్చాను. డాక్టర్‌ చక్రవర్తి సినిమాకు స్క్రీన్‌ప్లే రాసాను. ఆ తర్వాత ఆత్మగౌరవం సినిమాకు రాసాను. అప్పుడు నా వయస్సు 24 ఏళ్లు. నేడు 78 ఏళ్లు. అంటే 54 ఏళ్లుగా సినిమాలకు రచనలు చేస్తూనే ఉన్నా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుణ్ణయ్యాక ఇప్పటికి 290 సినిమాల్లో నటించా. నటిస్తూనే ఉన్నా.

చిన్నప్పట్నుంచీ పూజలంటే చాలా ఇష్టం. పెళ్లయిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తూ వచ్చాను. అందరి దేవుళ్లనూ పూజిస్తాను. ఫలానా దైవం అంటూ ఏమీలేదు. నా భర్తతో కలిసి అన్ని తీర్థయాత్రలు పూర్తిచేశాను. మూడుసార్లు రామకోటి రాశాను. నా జీవితాంతం రాస్తూనే ఉంటాను. 
– శివకామ సుందరి 


     
మీ పిల్లలకు దైవం గురించి ఎలాంటి విషయాలు చెబుతారు?
ఏ దైవాన్ని కొలిచినా అభ్యంతరం చెప్పను.కాని దైవచింతనతో గడపని చెబుతాను. దేవుని పట్ల భక్తి, ఇంకొకర్ని ఇబ్బంది పెట్టని  ప్రశాంతంగా జీవనం సాగించమని చెబుతా. అదే నేను నేర్చుకున్న జీవిత సత్యం. అదే నా జీవన మార్గం.    
– పంపన వరప్రసాదరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement