మనవాళ్లు ‘లుంగీ దోశె’ వెయ్యగలరు | Gollapudi Maruti Rao Writes A Guest Column About Trump Kim summit | Sakshi
Sakshi News home page

తెలుగు తిళ్లు

Published Thu, Jun 21 2018 1:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Gollapudi Maruti Rao Writes A Guest Column About Trump Kim summit - Sakshi

♦ జీవన కాలమ్‌
అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్,  కిమ్‌ మధ్య సమావేశం అనుకు న్నంత గొప్పగా జరగక పోవడానికి కారణాలు నాకు తెలుసు. నిజానికి నాకే తెలుసు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే– దాదాపు అన్ని విదేశాలలో భారతీయ ఆహారం అంటే– ఉత్తర దేశపు ఆహారమనే అర్థం. నేనూ, మా పెద్ద బ్బాయి చాలా సంవత్సరాల కిందట నెదర్లాండ్స్‌లో గ్రహించాం. అక్కడ ‘ఇండియన్‌ రెస్టా రెంట్‌’ అన్న బోర్డు చూడగానే మా ఇద్దరికీ ప్రాణం లేచి వచ్చింది. రెస్టారెంటు పేరు ‘మహారాజా’. తీరా వెళ్లి చూస్తే– తందూరీ రోటీ, తందూరీ కుఫ్టా, చోళా భటూరే, భైంగన్‌ భర్తా, కశ్మీరీ దమ్‌ ఆలూ, చికెన్‌ టిక్కా నెడ్‌ (ఈ ‘నెడ్‌’ ఏమిటని అడిగితే, తింటున్న ఓ విదేశీ మనిషి చెప్పాడు. అది నెదర్లాండ్స్‌ స్పెషల్‌ అట). ఏమైనా మా రోగం కుదిరింది. అన్నట్టు ‘రుమాలీ రోటీ’ మరిచిపోయాను. మనవాళ్లు తలచుకుంటే ‘గావంచా దోశె’, ‘లుంగీ దోశె’, ‘గోచీ దోశె’ కూడా వెయ్యగలరని వారికి తెలీదు.

కొత్తవాళ్లకి కొత్త రుచులు నేర్పాలంటే మనకి బాగా నలిగిన వంటకాలను ఎంపిక చేయాలి. వీరిద్దరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినపని ఇద్దరు తమిళ మంత్రులకు అప్పగించారు. న్యాయంగా భోజ నంలో తమిళ రుచులు వీటు దోశె, పొగైల్, అవి యల్, వెర్త కుళంబు వంటివి సమృద్ధిగా ఉండాలి. అలాంటిది– పులావు, చేపల కూర, కోడి కూర, చికెన్‌ కుర్మా వంటివి ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎక్కడ దెబ్బ కొట్టిందో నాకు వెంటనే అర్థమైపోయింది.

ఇలాంటి చోట ఒక తెలుగు వంటవాడిని కల పాలని నా ఉద్దేశం– పుల్లట్లు, మినపట్లు, పెసరట్లు, నాటుపెసర దోశె, బొబ్బట్టు, పొన్నగంటి పచ్చడి, బచ్చలి మజ్జిగ పులుసు, చిట్టి గారెలు, పెనం గారెలు, ఉల్లి గారెలు, పచ్చి పులుసు– ఇలాంటివి సమృద్ధిగా ఏర్పాటు చేసి ఉండాలి. కిమ్‌ దొర గారికి అమెరికా క్షిపణుల మీద చుర్రు మని కోపం వచ్చినప్పుడు– వారి చేతికి చిట్టి గారెలు అందించాలి. ట్రంప్‌ కిమ్‌ని కరుచుకు తినేసేటట్టు చూసేటప్పుడు– ఒక పుల్లట్టు రుచిని వారి ముందు ఉంచాలి.

తెలుగు రుచులు తెలియని అరవ మంత్రులు కేవలం 15 దేశాల రుచులను వారి ముందుంచారు కానీ, తమ రాష్ట్రపు రుచులను కానీ, ఆ మాటకు వస్తే పొరుగు రాష్ట్రపు రుచులను కానీ ఎంపిక చేయక పోవటం చాలా ఘోరం. వీరు పెట్టిన పదార్థాలన్నీ ఈ కార్యక్రమాన్ని తమ తమ పేపర్లలో రాయడానికి వచ్చిన 3 వేల మంది పాత్రికేయులకు పెట్టారు. వారంతా సుష్టుగా భోజనం చేశారు కానీ ఎవరూ బాలకృష్ణన్‌తోగానీ, షణ్ముగమ్‌తోగానీ వారు ‘మిస్‌’ అవుతున్న రుచుల గురించి వివరించకపోవడం అత్యంత శోచనీయం.

ఎటువంటి సమస్యనయినా కమ్మని భోజనం పరిష్కరిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ‘ఒక గ్లాసు మజ్జిగ తాగండి’ అంటాం. అందులో ‘చలవ’ ఎక్కువ. అలాగే చర్చలకు ముందు– మన తెలుగు వంటవాడు ఉంటే– మడత కజ్జికాయలు, పాలకా యలు, బూందీ గారె, ఉల్లిపాయ పకోడీలు, శనగ పప్పు బఠాణీలు, వేపుడు వేరు శెనగపప్పు, చిన్న కారం అతికించి నానబెట్టిన అటుకుల తాళింపు, పెసర పుణుకులు– ఇలాంటివి చేసి పెట్టేవాడు. చర్చలు ప్రారంభానికి ముందే ఇద్దరు నాయకులూ– ఈ పదార్థాలు నంచుకుని– ‘చర్చలు రేపు చేద్దాం. ముందు వీటిని తిందాం’ అనుకునేవారని నా ఉద్దేశం.

అయితే ఇందులో చిన్న పితలాటకం ఉంది. తమిళ వంటవారి సంగతి నాకు తెలీదు కానీ తెలుగు వంటవారు ముఖాలు చూస్తూ వారి వంటకాలు తినలేం, ఇలా అందరినీ అవమానించడం లేదని తమరు గుర్తించాలి. రత్నాలు రాళ్లలో ఉంటాయి. అవి తీసి మెరుగు పెడితేనే రత్నమని తెలుస్తుంది. నాకీ అనుభవం చాలా ఉంది. ‘దోశె చూస్తూ తింటారా? తిని చూస్తారా?’ అని ఒక మిత్రుడు పొద్దున్నే మా ఆవిడనీ, నన్నూ ఒక ఊళ్లో అడిగాడు. ఊరు పేరు చెప్పను. ఇదేం ప్రశ్న? అనుకున్నాను. ‘మంచి దోశె తింటాను’ అన్నాను. నన్ను కారులోనే కూర్చోపెట్టి వెళ్లి రెండు దోశెలు తెచ్చాడు. అపూర్వం. ఆనాడు ఇద్దరం తలో మూడు దోశెలు తిన్నాం. ఆ తర్వాత మా మిత్రుడు వద్దంటున్నా ఆ వంటవాడిని చూడా లన్నాను. నన్ను వారించడం చేతగాక పిలుచుకొచ్చాడు. ఆ కుర్రాడిని చూస్తూనే మూర్ఛబోయాను. అంత ‘అసందర్భం’గా, అసహ్యంగా ఉన్నాడు. అక్కడితో ఆగుతాను.

‘మా తెలుగు తల్లికి’ రాసి తెలుగు తల్లికి నీరాజనాలర్పించిన శంకరంబాడి.. డిలన్‌ థామస్‌ జ్ఞాపకం వచ్చారు. ప్రతిభకీ, జీవనానికీ సంబంధం లేదు. అంత గొప్ప పనివాడు. వంటని అలం కరించాడు కానీ తనని కాదు. ఏమైనా సింగపూర్‌లో పెద్ద చరిత్రను సృష్టించిన ఇద్దరు తమిళ మంత్రులు– మొన్న గొప్ప అవకాశాన్ని నష్టపోయారని మనవి చేస్తున్నాను.


గొల్లపూడి మారుతీరావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement