సింగపూర్: శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శాంతి వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ ట్రంప్ కిమ్‌కు ఓ వీడియో చూపించారు. హాలీవుడ్ శైలిలో రూపొందించిన ఆ వీడియోలో ట్రంప్, కిమ్‌లను ప్రధాన పాత్రధారులుగా చిత్రీకరించారు. ఉ.కొరియాలో అణ్వాయుధాలను నిర్మూలిస్తే ఇరు దేశాలకు కలిగే లాభాలను అందులో ప్రస్తావించారు. కొరియా భాషలో ఉన్న వీడియోను కిమ్‌తో పాటు ఆయనతో కలసి సమావేశంలో పాల్గొన్న 8 మంది అధికారులు తిలకించారు.
ఇదివరకెప్పుడూ చూడని అభివృద్ధిని సాధించే భావి ప్రజా నాయకుడుగా కిమ్ నిలిచేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ‘టూ మెన్, టూ లీడర్స్, వన్ డెస్టినీ’ టైటిల్‌తో ప్రదర్శించిన ఆ వీడియోలో వాయిస్‌ఓవర్‌లో.. ‘చరిత్రను తిరగరాసే సమావేశంలో ట్రంప్, కిమ్. ఒక్క అవకాశం, ఒక్క క్షణం చాలదా? భవిష్యత్తును మార్చడానికి. మనం తీసుకునే నిర్ణయంపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.
ఈ సమయం, ఈ క్షణంలో మొత్తం ప్రపంచం మిమ్మల్నే చూస్తోంది. వింటోంది. ఆశగా ఎదురుచూస్తోంది. ఈ నాయకుడు(కిమ్) తన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారా? తన ప్రజలకు హీరోగా నిలుస్తారా? శాంతి, సయోధ్యతో కలసిసాగి, గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని సాధిస్తారా? గొప్ప జీవితమా..లేక ఒంటరితనమా? ఏ దారి ఎంచుకుంటారు?’ అని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment